యూఏఈలో పెరిగిపోతున్న బ్లూకాలర్ నేరాలు..పౌరులకు భారత ఎంబసీ హెచ్చరిక..!
యూఏఈలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వీసా క్రమబద్ధీకరణ, అత్యవసర ధ్రువపత్రాలు, ఎగ్జిట్ పర్మిట్స్, ఎమిరేట్స్ ఐడీలు, ఉపాధి విషయంలో సహాయం చేస్తామంటూ.. వివరాలు తీసుకుని, నేరాలకుపాల్పడుతున్నారు. ఈ విషయం సదరు వ్యక్తికి తెలియకుండానే జరిగిపోతున్నాయి.దీంతో భారత్ దౌత్యకార్యాలయం.. యూఏఈలోని పౌరులను ఎక్స్ వేదికగా హెచ్చరించింది.
అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యూఏఈ (UAE)లోని భారతీయులకు సూచించింది. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, బయోమెట్రిక్ వివరాలు షేర్ చేయొద్దని పేర్కొంది. భారతీయులు ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగులు వీరి బారినపడి నష్టపోతున్న ఘటనలు పెరుగుతుండడంతో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి.(Indian nationals in the UAE)
నకిలీ ఏజెంట్లు బాధితుల అనుమతి లేకుండా బయోమెట్రిక్ డేటాను సేకరించి, బ్యాంకు ఖాతాలు తెరవడం, రుణాలు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు పొందటం వంటివి చేస్తున్నారు. ఆ వివరాలు ఇచ్చిన వ్యక్తి ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఎగ్జిట్ పర్మిట్స్, ఎమిరేట్స్ ఐడీలు, వీసా క్రమబద్ధీకరణ కోసం బయోమెట్రిక్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉన్న భారతీయులు.. ఆ వివరాలన్నీ యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు, లేక కౌంటర్లలో మాత్రమే ఇవ్వాలని సూచించింది. భారత పాస్‌పోర్టులు లేక అత్యవసర ధ్రువపత్రాలను జారీ చేసేందుకు దుబాయ్, అబుధాబిలోని రాయబార కార్యాలయాలు దరఖాస్తుదారుల నుంచి ఫింగర్‌ప్రింట్, ఫేస్, ఐ స్కాన్ తీసుకోవడం లేదని చెప్పింది.
రాయబార కార్యాలయం పేరుతో బయోమెట్రిక్ డేటాను అడిగే ఏజెంట్లను నమ్మవద్దని పేర్కొంది. అలాంటి పరిస్థితి ఏదైనా ఎదురైతే ధ్రువీకరించుకునేందుకు కొన్ని నంబర్లను కార్యాలయం షేర్ చేసింది. టోల్ ఫ్రీ నంబర్-80046342 , వాట్సప్ లేక ఎస్ఎంఎస్- 00971543090571, [email protected] ద్వారా ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రాన్ని సంప్రదించవచ్చని పేర్కొంది. వివరాలను సరిచూసుకోవడంతో పాటు మోసం జరిగిందనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది.








