నేపాల్ కు మరో ఫ్లడ్ వార్నింగ్.. చైనా ముందస్తు హెచ్చరిక..!
నేపాల్ నెత్తిపై మరో వాటర్ బాంబ్ పేలేందుకు సిద్ధంగా ఉంది. పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపున ఏర్పడిన సరస్సు పొంగుతోంది. దానిపై చైనా (China) మరోసారి హెచ్చరిక చేసింది. ఏ క్షణాన అయినా అది ఉప్పొంగి, కిందికి దూసుకురావొచ్చని పేర్కొంది. నీటి రంగులో మార్పును అందుకు కారణంగా చెప్పింది. నేపాల్ విదేశాంగశాఖతో ఈ సమాచారాన్ని షేర్ చేసుకుంది. ‘‘విపత్తు తర్వాత ఏర్పడిన సరస్సు రంగు మారుతోంది. ముదురురంగులోకి వస్తోంది. అంటే అది బద్దలయ్యేందుకు అవకాశం ఉంది’’ అని చైనా అధికారులు వెల్లడించారు.
నది లేక ఇతర వనరుల్లో నీటి రంగు మారడం అనేది వరదలు వచ్చేముందు ప్రధానంగా కనిపించే సూచన (water Color). పర్వత ప్రాంతాలు, నీటి వనరులకు ఎగువభాగంలో భారీ వర్షాలు కురిసినప్పుడు.. అక్కడి నుంచి కిందికి ప్రవహించే నీటిలో మట్టి, రాళ్లు, ఇసుక, ఆకులు, ఇతర వ్యర్థాలు కొట్టుకొస్తుంటాయి. దాంతో నీటి రంగులో మార్పు వస్తుంటుంది. అంటే ఎగువ నుంచి నీటి ప్రవాహం ఉందని అర్థం. అలాగే వరద ముంచుకొచ్చే ముందు నదీ ప్రవాహ శబ్దంలో కూడా మార్పు వస్తుందని నిపుణులు చెప్తుంటారు. ఇలాంటి సమయాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారు. ఇప్పుడు చైనా (China) అధికారులు కూడా లోతట్టు ప్రాంత ప్రజలకు ఇలాంటి సూచనలే చేశారు.
చైనా వైపున చోచెన్ నది, నేపాల్ వైపున పురెపు నది కలిసే దగ్గరలో ఈ సరస్సు ఏర్పడింది. అందులోని నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సరస్సు తెగితే (Lake bursts) సంభవించే నష్టాన్ని అంచనా వేయడానికి చైనా ఫ్లడ్ మోడలింగ్ అధ్యయనం చేపట్టింది. ఈ సరస్సు గట్టులో కొంతభాగం తెగితే.. నీటి ప్రవాహం గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్లు ఉండొచ్చు. అయితే ఆ పరిమాణం నది ఒడ్డుకే పరిమితమై ఉంటుందని పేర్కొనడం కాస్త ఊరటనిచ్చే విషయం. శుక్రవారం ఆ సరస్సు ఉప్పొంగి.. లెండేఖోలా, త్రిశూలీ నదుల్లోకి ప్రవహించింది. తర్వాత ఆ ప్రవాహ తీవ్రత అదుపులోకి వచ్చిందని చైనా మీడియా వెల్లడించింది. డ్రోన్లు, శాటిలైట్ చిత్రాల ఆధారంగా డ్రాగన్ ఈ లెక్కలు చెప్తోంది.








