చైనా మిలటరీలో ప్రక్షాళన.. టాప్ కమాండర్ల తొలగింపు..!
చైనా మిలటరీలో సంస్కరణల పర్వం కొనసాగుతోంది. తమ దేశంలోని పలువురు ఉన్నతాధికారులపై చైనా ప్రభుత్వం (China) వేటు వేసింది. కొందరు మాజీ ఉన్నతాధికారులను సైతం కీలక పదవుల నుంచి తొలగించింది. వీరిలో 2017 డోక్లాం ప్రతిష్టంభన, 2020 గల్వాన్ ఘర్షణల సమయంలో సైన్యానికి నాయకత్వం వహించిన మాజీ జనరల్ ఝావో జోంగ్కీ (Zhao Zongqi) కూడా ఉన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్ట్రన్ థియేటర్ కమాండ్ మాజీ కమాండర్ ఝావోను తమ అత్యున్నత రాజకీయ సలహా మండలి సహా మరో రెండు కీలక పదవుల నుంచి కూడా తొలగించినట్లు బీజింగ్ ప్రకటించింది. అయితే, ఈ తొలగింపునకు ఎటువంటి కారణాన్నీ వెల్లడించలేదు. కాగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేపట్టిన అవినీతి నిరోధక చర్యల్లో (మిలిటరీ ప్రక్షాళన) భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 2016లో చైనా పునర్వ్యవస్థీకరించిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు ఝావో జోంగ్కీ తొలి కమాండర్‌గా నియమితులయ్యారు. భారత్‌తో చైనా సరిహద్దులోని అధిక భాగంలో పీఎల్ఏ కార్యకలాపాలకు ఈ కమాండ్ బాధ్యత వహిస్తుంది. 2017 జూన్‌లో భూటాన్ తమదిగా చెప్పుకొంటున్న ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం ప్రారంభించడంతో ఈ విషయంలో భారత సైన్యం జోక్యం చేసుకుంది. డోక్లాం (Doklam) హక్కులపై ఇరు దేశాల సైన్యాల మధ్య రెండు నెలలకు పైగా ప్రతిష్టంభన నెలకొనడంతో తర్వాత చైనా ఆ నిర్మాణపనులను నిలిపివేసింది.
2020 జూన్‌లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణలు (Galwan Valley clash) చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ రెండు సమయాల్లోనూ ఝావో చైనా సైన్యానికి వెస్ట్రన్ థియేటర్ కమాండర్‌గా కొనసాగారు. అదే ఏడాది డిసెంబర్లో ఆయన స్థానంలో మరో కమాండర్‌ను నియమించారు.








