వెనెజులాతో భారీ చమురు డీల్.. ట్రంప్ ప్రకటన….!
అమెరికా చమురు భద్రత మరింత పటిష్టమయ్యేలా వెనజువెలాతో భారీ ఒప్పందం చేసుకుంది. వెనెజువెలాలోని 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) తెలిపారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందం అని పేర్కొన్నారు. అగ్రరాజ్యంతో చేసుకున్న ఈ ఒప్పందంతో తమ దేశ పునరుద్ధరణ, 17 చమురు క్షేత్రాల అభివృద్ధి ముడిపడి ఉందని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెల్లడించారు. దీనివల్ల దాదాపు 100 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం ఇరుదేశాలకు పెద్ద విజయమని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) పేర్కొన్నారు. ఇది వెనెజువెలాకు బిలియన్ల కొద్దీ ప్రైవేట్ పెట్టుబడులను తీసుకువస్తుందని.. అమెరికాలో గ్యాస్ ధరలు తగ్గడానికి దారితీస్తుందని తెలిపారు. వారి నుంచి కొనుగోలు చేసే చమురును వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను నింపడానికి, సైనిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు.
ఆరు నెలలుగా ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధం (Iran war) వల్ల అమెరికాలో చమురు కొరత ఏర్పడుతోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్‌లో సైతం ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో.. గ్యాస్ నిల్వలు పెంచుకోవడానికి ట్రంప్ వెనెజువెలాపై దృష్టి సారించారు. ప్రస్తుత ఒప్పందం ప్రకారం వెనెజువెలా చమురు ఉత్పత్తిలో కొంతమేర యాజమాన్య వాటాతో సహా అసలు ధరకే కొనుగోలు చేసే హక్కు అమెరికాకు ఉంటుంది. ఈ ఒప్పందం కుదిరినప్పటికీ అమెరికాలో చమురు ధరలు వెంటనే తగ్గబోవని.. వెనెజువెలా నుంచి చమురు వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.








