‘సర్’పై ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి సంచలన లేఖ
తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న వేళ, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మూడో వంతు ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆరు పేజీల లేఖ రాయడం సంచలనం రేపింది. కేవలం పరిపాలనాపరమైన విజ్ఞప్తిగానే కాకుండా, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రంపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలో సీఎం లేఖకు విశేష రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
జూన్ 10 నాటికి తెలంగాణలో నమోదైన 3.38 కోట్ల మంది ఓటర్ల జాబితాలో దాదాపు 73.39 లక్షల మందిని అంటే 21.7 శాతం ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్ (ASDD) కేటగిరీ కింద చేర్చడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటివరకు డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారమ్‌లలో 60.50 లక్షల ఫారమ్‌లలో లోపాలు ఉన్నాయని, మరో 32.36 లక్షల ఫారమ్‌లకు పాత ఓటర్ల జాబితాతో ఎలాంటి లింక్ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ లెక్కన మొత్తం 92.86 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును నిలుపుకోవడానికి మళ్లీ అర్హతను నిరూపించుకోవాల్సిన విపత్కర పరిస్థితి ఏర్పడింది. ASDD జాబితాలోని 73.39 లక్షల ఎంట్రీలలో 45.19 లక్షల మందిని (దాదాపు 62 శాతం) శాశ్వతంగా తరలివెళ్లిన వారిగా గుర్తించడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన పేద, మధ్యతరగతి వర్గాలను శాశ్వతంగా వలస వెళ్లినట్టు రికార్డుల్లో చూపి ఓటు హక్కుకు దూరం చేయడం తీవ్ర అన్యాయమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి వంటి పట్టణ, నగర శివారు జిల్లాల్లోనే అత్యధికంగా ASDD కేటగిరీ పేర్లు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ జీవో నెం. 172 కింద జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను మినహాయించడం వల్ల పట్టణ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివాసముంటున్న శ్రామిక, ఉద్యోగ వర్గాలు ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే సత్తా ఉన్నవారు. వీరి పేర్లు భారీగా తొలగింపునకు గురైతే అది అధికార పక్షానికి, రాజకీయ ప్రాతినిధ్యానికి పెను సవాలుగా మారుతుంది. అందుకే ఈ ప్రాంతాల్లో ఈఆర్వో స్థాయిలో అదనపు సిబ్బందిని నియమించి ప్రక్రియను వికేంద్రీకరించాలని సీఎం కోరారు.
ఓటర్ల సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసీకి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న ఒక నెల క్లెయిమ్‌లు, అభ్యంతరాల సమర్పణ గడువు ఏమాత్రం సరిపోదని, దీనిని మరో 4 వారాల పాటు పొడిగించాలి. తద్వారా అక్టోబర్ 19న విడుదల కావాల్సిన తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని కూడా ముందుకు జరపాలన్నారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు పరిధిలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కనీసం 2 సార్లు చదివి వినిపించాలని, ఎన్నికల సంఘం జారీ చేసే నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు కనీసం 3 నుంచి 4 వారాల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించడంలో ప్రజలకు సహాయపడేందుకు పోలింగ్ బూత్ స్థాయిలోనే ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా సులభంగా లభించే ధ్రువపత్రాలను ఆమోదించేలా నిబంధనలను సవరించాలని సీఎం కోరారు.
లక్షలాది మంది సామాన్య, వలస ఓటర్ల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చాటుతూనే, ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు, ఏకపక్ష తొలగింపులు జరగకుండా ఎన్నికల సంఘాన్ని అప్రమత్తం చేయడంలో రేవంత్ రెడ్డి లేఖ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మౌలిక, అధికారిక సహాయాన్ని అందిస్తుందని సీఎం హామీ ఇవ్వడం ద్వారా బంతిని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులోకి నెట్టారు.








