మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తానీ మద్దతు దారులు..!
ఖలిస్థానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. అమెరికా పర్యటన సందర్భంగా వారు.. భారత జాతీయపతాకాన్ని దారుణంగా అవమానించారు. న్యూయార్క్ లో భగవత్ పాల్గొంటున్న కార్యక్రమం సందర్భంగా.. అక్కడకు చేరుకున్న ఖలీస్థానీ సానుభూతిపరులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వారు భారత జాతీయ జెండాను కిందపడేసి, కాళ్లతో తొక్కారు. అంతటితో ఆగకుండా జెండాను చించివేస్తూ దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వారికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
“మీకు ఆర్ఎస్ఎస్ను, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ఉంది. కానీ మన దేశాన్ని అవమానించవద్దు. జాతీయ జెండాను అగౌరవపరచవద్దు. అది మీకు చాలా ప్రమాదకరం” అని ఆయన తన పోస్టులో తెలిపారు.
విదేశీ గడ్డపై భారత జాతీయ పతాకానికి జరిగిన ఈ అవమానంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కేంద్రం ఈ హెచ్చరిక ద్వారా తేల్చిచెప్పినట్టయింది.








