నమో స్టేడియాన్ని తలదన్నేలా రేవంత్ మెగా స్టేడియం ప్లాన్!
రాజకీయాల్లో నాయకుల విజన్ కేవలం ప్రసంగాలకే పరిమితం కాదు.. తాము నిర్మించే భారీ ప్రాజెక్టులు, సృష్టించే ల్యాండ్‌మార్క్‌ల ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం క్రీడా మౌలిక వసతుల వేదికగా జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించే సరికొత్త రాజకీయ చదరంగానికి తెరతీశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోదీ స్టేడియంను అంటే లక్ష 32వేల సీటింగ్ సామర్థ్యాన్ని తలదన్నేలా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అంతకంటే భారీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రూపకల్పన చేశారు.
జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్‌ను, అహ్మదాబాద్‌లోని మెగా స్టేడియాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి సరిగ్గా అదే స్థాయి ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, రాజకీయంగా బలమైన సంకేతాన్ని పంపే వ్యూహాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా, గ్లోబల్ స్పోర్ట్స్ క్యాపిటల్‌గా నిలబెట్టాలనేది కాంగ్రెస్ సర్కార్ లక్ష్యం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏకంగా 100 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ స్టేడియానికి డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు.
ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వ నిధులపై భారం పడకుండా చాకచక్యంగా పీపీపీ పద్ధతిలో పట్టాలెక్కిస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి-బీసీసీఐ తో జాయింట్ వెంచర్ ద్వారా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. తెలంగాణ ప్రభుత్వం 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుండగా, నిర్మాణ వ్యయం, నిర్వహణ ఖర్చులను బీసీసీఐ భరిస్తుంది. ఉమ్మడి నిర్వహణ పద్ధతిలో ఇది కొనసాగుతుంది. ఇంగ్లండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్, ఆస్ట్రేలియాలోని అత్యాధునిక స్టేడియాల తరహాలో డిజైన్ చేస్తున్నారు. నిర్మాణం వ్యయం కూడా గుజరాత్ స్టేడియం కంటే అధికంగా ఉండవచ్చని అంచనా.
ప్రస్తుతం ఉన్న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కెపాసిటీ ప్రపంచకప్ వంటి భారీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు సరిపోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో నిర్మించబోయే కొత్త స్టేడియం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్, అలాగే ఫ్యూచర్ సిటీ వరకు పొడిగించనున్న ప్రతిపాదిత మెట్రో రైల్ మార్గానికి చేరువగా అనువైన స్థలాన్ని అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం క్రికెట్ స్టేడియానికే పరిమితం కాదు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, గ్లోబల్ మ్యూజిక్ కన్సర్ట్లు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కంటే భారీ కన్వెన్షన్ ఈవెంట్లు.. తదితర మల్టీ పర్పస్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటీ కాన్సెప్ట్‌ను రద్దు చేసి, దాని స్థానంలో సరికొత్త విజన్‌తో భారత్ ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చిన రేవంత్ సర్కార్.. తన పాలనకు శాశ్వత గుర్తుగా ఒక మెగా ప్రాజెక్టును నిలపాలని భావిస్తోంది. చంద్రబాబు గతంలో హైటెక్ సిటీతో, కేసీఆర్ కాళేశ్వరంతో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తే, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీతో పాటు వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియంతో తన మార్క్ బ్రాండింగ్‌ను జాతీయ వేదికపై బలంగా చాటాలనుకుంటున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంను తలదన్నేలా సౌత్ ఇండియాలో అతిపెద్ద క్రికెట్ సామ్రాజ్యాన్ని నిర్మించడమంటే.. అది కేవలం క్రీడా విప్లవం మాత్రమే కాదు, పక్కా రాజకీయ ఎత్తుగడ కూడా!








