గులాబీ గూటిలో పట్టభద్రుల ‘పోరు’!
తెలంగాణ శాసనమండలిలో ఖాళీ కానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చే ఏడాది మార్చి 29తో ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వచ్చే నెల నుంచే అర్హులైన గ్రాడ్యుయేట్ల నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఈసారి ఎలాగైనా పట్టభద్రుల కోటాలో జెండా ఎగరేయాలని గులాబీ దళపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే, ఓటర్ల నమోదు ప్రారంభం కాకముందే పార్టీ లోపల అభ్యర్థిత్వం కోసం తీవ్రస్థాయిలో అంతర్గత పోరు మొదలైంది.
రాష్ట్రంలో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ తపిస్తోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల నాడిని పసిగట్టేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ లిట్మస్ టెస్ట్‌గా భావిస్తోంది. గతంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజీనామా చేసిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత ఉపఎన్నికలో ఎదురైన ఫలితాలను విశ్లేషించుకుంటూ, ఈసారి గ్రౌండ్ లెవల్లోనే ఓటర్ల నమోదుపై విస్తృతంగా ఫోకస్ పెట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది.
గత ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎనుగుల రాకేష్‌రెడ్డి ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన చేసిన విస్తృత ప్రచారం, విద్యావంతులతో ఉన్న అనుబంధం, పార్టీ కేడర్‌తో సమన్వయం తనకు కలిసివస్తాయని రాకేష్‌రెడ్డి వర్గం వాదిస్తోంది. నియోజకవర్గ పరిధిలోని క్షేత్రస్థాయి సమీకరణాలను ఇప్పటికే తన అధీనంలోకి తెచ్చుకున్న ఆయన, మరోసారి తనకే అధిష్ఠానం అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
మరోవైపు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుల నుంచి తీవ్రమైన డిమాండ్ తెరపైకి వస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడూ వలస నేతలకే పెద్దపీట వేస్తున్నారని, ఏళ్ల తరబడి జెండా మోసిన ఉద్యమకారులకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక బలమైన వర్గం పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే వికలాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సైతం నేను సైతం అంటూ రేసులోకి వచ్చారు. ఉద్యమ నేపథ్యం, సామాజిక సమీకరణాలు, వికలాంగుల హక్కుల కోసం చేసిన పోరాటాలను ప్రస్తావిస్తూ తనకు టికెట్ కేటాయించాలని ఆయన ఇప్పటికే పార్టీ అధిష్ఠానం వద్ద లాబీయింగ్ ముమ్మరం చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పరిధిలో అత్యధికంగా ఉన్న ఓటర్లలో బీసీ వర్గాలే కీలకం. ఈ నేపథ్యంలో ఈసారి పట్టభద్రుల సీటును బీసీ నేతకే ఇవ్వాలి అన్న డిమాండ్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. సుదీర్ఘకాలంగా రెడ్లకే ప్రాధాన్యత దక్కుతోందని, గ్రాడ్యుయేట్ వర్గాల్లో బీసీల సంఖ్య భారీగా ఉన్నందున ఆ వర్గానికి చెందిన సమర్థుడైన నాయకుడిని బరిలోకి దింపితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని బీసీ లాబీ అధిష్ఠానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది.
ఒకవైపు విద్యావంతుడైన యువనేత రాకేష్‌రెడ్డి, మరోవైపు తెలంగాణ సెంటిమెంట్‌ను గుర్తుచేస్తున్న ఉద్యమకారులు, ఇంకోవైపు సామాజిక న్యాయం పేరుతో పట్టుబడుతున్న బీసీ నేతలు… ఈ మూడు వర్గాల మధ్య సమతుల్యత సాధించడం కేసీఆర్, కేటీఆర్‌లకు పెద్ద సవాలుగా మారింది. అభ్యర్థి ఎంపికలో ఏమాత్రం తేడా వచ్చినా అది ఓటరు నమోదు, ప్రచార సరళిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయడమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ప్రధాన కర్తవ్యం.








