ఇందూరు వేదికగా కవిత ‘పాంచజన్యం’.. బలప్రదర్శనకేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రధాన పక్షాల కదలికలు చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో, ఒకప్పుడు గులాబీ దళానికి తిరుగులేని కంచుకోటగా నిలిచిన నిజామాబాద్ గడ్డ నుంచి సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేవబోతోంది. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగష్టు 31న, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సభ ద్వారా కవిత వేయబోయే అడుగులు, ఆమె అనుసరించబోయే వ్యూహాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నిజామాబాద్ జిల్లాతో కవితకు 20 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ, సామాజిక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జాగృతి ద్వారా సాంస్కృతిక చైతన్యం తెచ్చి, ఎంపీగా జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన చరిత్ర ఆమె సొంతం. అయితే, గత పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతం బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తిరిగి తన పట్టును నిరూపించుకోవడానికి ఇంతకంటే బలమైన వేదిక మరొకటి లేదు. ఇందూరు గడ్డపై నిర్వహించే ఈ భారీ బలప్రదర్శన కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా, యావత్ తెలంగాణకు ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని పంపేలా వ్యూహరచన చేశారు.
పాంచజన్య సంకల్ప సభ ద్వారా కవిత ఎవర్ని టార్గెట్ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ పనితీరు, జిల్లాకు వచ్చిన నిధులు, నెరవేరని హామీలను ఎండగట్టే అవకాశముంది. గతంలో తన హయాంలో జరిగిన సమగ్ర అభివృద్ధికి, ప్రస్తుత స్తబ్ధతకు మధ్య ఉన్న తేడాను ప్రజల ముందుంచవచ్చు. నిజామాబాద్‌లో తన గత ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ, వెన్నుపోటు పొడిచిన సొంత పార్టీ నేతల అసలు రంగును మరోసారి బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అమలుకాని గ్యారంటీలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయవచ్చు.
ఈ సభ కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన జాగృతి నెట్వర్క్ ను తిరిగి యాక్టివేట్ చేయడానికి ఒక సాధనంగా మారనుంది. మహిళలు, యువత, రైతులు, మేధావులు, కళాకారులతో భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే ప్రధాన లక్ష్యం. ఒకవైపు పార్టీ శ్రేణులకు రాజకీయ భరోసా కల్పిస్తూనే, మరోవైపు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ సభను పునాదిగా మార్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
ఈ సభ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు నాంది పలకవచ్చు. నిజామాబాద్‌లో మళ్లీ పట్టు సాధిస్తే అది బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి హెచ్చరికగా మారుతుంది. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటానికి సిద్ధమని చాటిచెప్పే ఈ పాంచజన్య సంకల్ప సభ విజయవంతమైతే, రాష్ట్ర రాజకీయ యవనికపై కల్వకుంట్ల కవిత ఒక బలమైన నిర్ణయాత్మక శక్తిగా అవతరించే అవకాశముంది.








