భారత డీఎన్ఏలోనే ఏకత్వం మోహన్ భగవత్
ప్రవాస భారతీయులు తమ కర్మభూమి అయిన అమెరికాకు విధేయంగా ఉండాలని సూచన…
ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పంచామన్నదే ముఖ్యమన్న భగవత్..
న్యూయార్క్ మాడిసన్ స్క్వేర్ మీటింగ్ విజయవంతం
భారతదేశపు డీఎన్ఏలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ’ (ఏహెచఈఏడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్’ సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్’ (ఏహెచఈఏడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్’ సదస్సులో ఆయన ముఖ్య ప్రసంగం చేశారు. సుమారు 6000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 250 మంది విద్యార్థులతో 39 రాష్ట్రాల నుంచి, 853 నగరాల నుంచి, 250 సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు వచ్చిన ఈ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకునేలా మోహన్ భాగవత్ ప్రసంగించారు.
అమెరికా అనగానే ‘బహుళత్వం’ (ప్లూరలిజం) గుర్తొస్తుందని, భారత్ అనగానే ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫురిస్తుందని, ఈ రెండూ భారతీయుల జన్యువుల్లోనే ఉన్నాయని భగవత్ పేర్కొన్నారు. జీవనశైలి, భౌతిక అవసరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, అంతర్గత ఏకత్వమే అందరినీ కలుపుతుందని వివరించారు. మానవతా దృక్పథం, సానుభూతిని వివరించేందుకు ఆయన ఒక ఉదాహరణను ప్రస్తావించారు. ఆకలితో ఉన్న వ్యక్తి మన ముందు నిలబడి ఆహారం వైపు చూస్తున్నప్పుడు, అతడిని గమనిస్తూ, ఒక్క మెతుకు కూడా ఇవ్వకుండా ఎవరూ భోజనం చేయలేరని, అదే మనుషుల్లోని అంతర్గత మానవత్వమని అన్నారు. జంతువులు కేవలం మనుగడ, తిండి వరకే ఆలోచిస్తాయని, కానీ మంచి చెడులను గుర్తించి ఆలోచించే విచక్షణా జ్ఞానం ఒక్క మానవులకే ఉందని భగవత్ అన్నారు.
ఈ సందర్భంగా మోహన్ భగవత్, అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులకు కీలక సందేశమిచ్చారు. వారు నివసిస్తున్న, పనిచేస్తున్న దేశానికే (కర్మభూమి) సంపూర్ణ విధేయతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ.. “మీరు అమెరికాలో ఉన్నారు. ఇక్కడే జీవిస్తున్నారు, ఇక్కడే సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు అమెరికాకు నిజాయతీగా మెలగాలి” అని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్ వారి జన్మభూమి అని గుర్తుచేశారు. కర్మభూమి పట్ల తమ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత, జన్మభూమి అయిన భారత్‌కు సేవ చేసేందుకు వారికి అవకాశం ఉందని, అది నిషిద్ధం కాదని వివరించారు. ఈ విధంగా ప్రవాసులు తమ విధేయత, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. భిన్నత్వం కారణంగానే ఏకత్వం మరింత శోభాయమానంగా ఉంటుందని, కాబట్టి దానిని మనం ఉత్సవంలా జరుపుకోవాలని అన్నారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఉటంకిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే భారత్ విధి అని తెలిపారు. తన ప్రసంగంలో భగవత్ పలు తాత్విక అంశాలను కూడా ప్రస్తావించారు. భౌతిక సుఖాలు తాత్కాలికమని, అవి శాశ్వతమైన సంతృప్తిని ఇవ్వలేవని అన్నారు. డోనట్స్ తినే ఉదాహరణను చెబుతూ, ఒక దశలో ఎక్కువగా తిన్న తర్వాత వాటిపై ఆసక్తి పోతుందని, కానీ మళ్లీ కొంతకాలానికి తినాలనిపిస్తుందని వివరించారు. భౌతిక ఆనందం మితిమీరినా సంతృప్తినివ్వడంలో విఫలమవుతుందని చెప్పారు. దేహాలు, వస్త్రధారణ, పూజా విధానాలు వేరైనా మానవులంతా ఒకే ఆధ్యాత్మిక సూత్రంతో ముడిపడి ఉన్నారని అన్నారు.
డబ్బు సంపాదన, భౌతిక విజయాలే జీవితంలో అంతిమ లక్ష్యాలు కాదని హితవు పలికారు. “మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంత పంచుతున్నామన్నదే ముఖ్యం” అని ఆయన అన్నారు. భారతీయ తత్వశాస్త్రంలో భౌతిక విజయాన్ని తిరస్కరించలేదని, పురుషార్థాలలో అర్థ, కామాలకు ప్రాధాన్యత ఉందని, అయితే వాటితో పాటు ఉన్నత లక్ష్యాలను కూడా సాధించాలని సూచించారు. వ్యక్తి, సమాజం, పర్యావరణం మధ్య సమతుల్యత అవసరమని, అన్నీ కలిసి అభివృద్ధి చెందినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని వివరించారు. హిందుత్వం అనేది ప్రతి మనిషి గౌరవాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి చేరవేసే విభిన్న మార్గాలను అంగీకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన 2018లో ఢిల్లీలో తాను చేసిన ప్రసంగాల సిరీస్‌ను గుర్తుచేసుకున్నారు. “2018లో ఢిల్లీలో నేను ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడున్న కొందరు ముస్లిం సోదరులు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ‘మీరు హిందూ సంస్థ. హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. మరి మా ముస్లింల పరిస్థితి ఏంటి? మమ్మల్ని తరిమేస్తారా?’ అని అడిగారు. అప్పుడు నేను వారితో, ‘లేదు, అది హిందుత్వం కాదు. ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా అనుకుంటే, అతను హిందువుగా తన అస్తిత్వాన్ని కోల్పోతాడు’ అని చెప్పాను” అని భగవత్ వివరించారు.
హర్యానాలో జరిగిన మరో సంఘటనను మోహన్ భగవత్ ప్రస్తావిస్తూ.. “మా వాలంటీర్లు అందరికీ సమానంగా సేవ చేస్తారు… భారత్‌లోని హర్యానా ప్రాంతంలో ఉన్న దాద్రి అనే ప్రదేశం వద్ద రెండు విమానాలు ఢీకొన్నాయి… అందులోని ప్రయాణికులలో అత్యధికులు ముస్లింలు. మా స్వయంసేవకులు అందరికంటే ముందే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులకు వారు సేవ చేశారు.. అయితే ప్రాణాలతో చాలా తక్కువ బయటపడ్డారు.. మిగిలిన వారంతా మరణించారు.. మృతదేహాలను వెలికి తీసి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు… ఆ సమయంలో ఆరఎసఎస్ స్వయంసేవకులు ‘వీరు ముస్లింలు’ అని ఏనాడూ భావించలేదు” ఆయన అన్నారు. మరింత వివరణ ఇస్తూ “అక్కడ ప్రధానంగా పని చేసిన సంస్థ ఆరఎసఎస్. మేము రాజకీయాలో లేకపోవడం వల్లే ఇది చేయగలిగాం. దీని నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించం కాబట్టి మేము ఈ విషయాలను ప్రచారం చేసుకోం. మేము కేవలం సేవ మాత్రమే అందిస్తాం.. మాకు ఏమీ అవసరం లేదు” అని ఉద్ఘాటించారు. చారిత్రక క్రమంలో విదేశీ దండయాత్రల వల్ల అనేక నాగరికతా సంపదలను కోల్పోయినప్పటికీ, అందరినీ కలుపుకొనిపోయే భారత సంప్రదాయం ఇప్పటికీ సజీవంగానే ఉందని ఆయన గుర్తుచేశారు. “భారత్ సంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరికీ ఆశ్రయం ఇచ్చింది. అందుకే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవిస్తున్నారు” అని పేర్కొన్నారు.

మానవ ఐక్యత సందేశాన్ని నిరంతరం ప్రజలకు గుర్తుచేయకపోతే సమాజంలో విపరీత ధోరణులు తలెత్తుతాయని, అందువల్ల మత పెద్దలు ఈ పనిని కొనసాగించాలని భగవత్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఇది చాలా కష్టంతో, ఓపికతో, ఎక్కువ సమయం తీసుకుని చేయాల్సిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు. భౌతికవాదం, ఆధిపత్య ధోరణులు, అహంకారం వంటి వాటిని నిరోధించగల సామాజిక అలవాట్లను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
1925లో నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆరఎసఎస్‌ను స్థాపించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్‌వర్క్‌తో అతిపెద్ద సామాజిక సంస్థలలో ఒకటిగా ఎదిగింది. మోహన్ భగవత్ 2009 నుంచి ఆరఎసఎస్ సర్ సంఘచాలక్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంస్థ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావనను బలపరుస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ‘ధర్మం’ గురించి మాట్లాడుతూ.. ధర్మం అనేది కేవలం పూజ లేదా మతం కాదని, విశ్వాన్ని నిలబెట్టే మూల సూత్రమని భగవత్ వివరించారు. సత్యాన్వేషణ ద్వారా మోక్షం పొందడమే మానవ జన్మ అంతిమ లక్ష్యమని, మానవ జీవితం అనేది కేవలం ఒక యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు. దాదాపు 6,000 మందికి పైగా హాజరైన ఈ సభలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమాన్నిఅమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్ మెంట్ అండ్ డైలాగ్ సంస్థ చారిత్రాత్మక రక్షా బంధన్ సమావేశం గా అభివర్ణించింది. మరోవైపు న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో మోహన్ భగవత్ పోస్టర్ అక్కడి బిల్ బోర్డుపై దర్శనమిచ్చింది. ఇక ఈ కార్యక్రమం స్థానిక సమయానికి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5.30 గంటల వరకు జరుగుతుండగా.. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు జరిగింది . ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, సంగీత, కళా ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి. ఈ కార్యక్రమాన్ని సమాజాల మధ్య.. దేశాల మధ్య ఐక్యతను జరుపుకునే ఉత్సవంగా నిర్వచించనున్నారు. ఇక 200 లకుపైగా హిందూ అమెరికన్ సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి.
అంతకుముందు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నిరాశ్రయులకు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ ప్రసంగిస్తూ.. ప్రస్తుతం ప్రపంచంలో పెరుగుతున్న విభేదాలు, ఘర్షణలను రూపుమాపి అందరినీ ఏకం చేసే అద్భుత శక్తి ఒక్క కృష్ణ చైతన్యానికి మాత్రమే ఉందని ఉద్ఘాటించారు. మనుషుల మధ్య ఎన్ని తేడాలు ఉన్నా.. అంతిమంగా అంతా కృష్ణమయం అనే భావన ప్రతి ఒక్కరి హృదయంలో నిండినప్పుడే ప్రపంచం స్వర్గధామంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.








