“స్కూల్ ఎలా ఉంది?” — “బాగుంది అమ్మా… ఈరోజు రైఫిల్ పాఠం చెప్పారు!”
ప్రియమైన తల్లిదండ్రులకు,
మీ పిల్లల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడానికి మా పాఠశాల ఈ ఏడాది కొన్ని కొత్త సబ్జెక్టులను ప్రవేశపెడుతోంది.
సోమవారం: రైఫిల్ పరిచయం
మంగళవారం: గ్రెనేడ్ పరిచయం
బుధవారం: డ్రోన్ ఆపరేషన్
గురువారం: యుద్ధ గాయాలకు ప్రథమ చికిత్స
శుక్రవారం: దేశభక్తి
దయచేసి పిల్లలను సమయానికి స్కూల్‌కు పంపండి.
గమనిక: పెన్సిల్ బాక్స్ అవసరం. హెల్మెట్ ఉంటే ఇంకా మంచిది.
ఇది నిజమైన స్కూల్ సర్క్యులర్ కాదు. కానీ రష్యా స్కూళ్లలోకి వస్తున్న కొత్త శిక్షణను చూస్తే, ఆ సర్క్యులర్ రేపు నిజమైపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదనిపిస్తుంది.
ఇక క్లాస్ రూమ్ లోకి వెళ్తే…
క్లాస్‌రూమ్‌లో పిల్లలంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. టీచర్ బోర్డు ముందు నిలబడ్డాడు. చేతిలో పుస్తకం లేదు. మార్కర్ కూడా లేదు. బదులుగా ఒక తుపాకీ మోడల్ ఉంది. “ఇది ఏంటో ఎవరికైనా తెలుసా?” అని టీచర్ అడిగాడు. కొంతమంది పిల్లలు చేతులు పైకెత్తారు. “రైఫిల్” అని ఒక పిల్లాడు చెప్పాడు. టీచర్ తల ఊపాడు. తర్వాత మరో వస్తువును చూపించాడు. “మరి ఇది?” ఈసారి క్లాస్‌లో కాసేపు నిశ్శబ్దం. “గ్రెనేడ్…” అని ఓ విద్యార్థి సమాధానం చెప్పాడు. టీచర్ మళ్లీ తల ఊపాడు. ఆ తర్వాత బోర్డుపై మరో పదం రాశాడు — డ్రోన్.
వెనుక బెంచ్‌లో కూర్చున్న ఓ పిల్లాడు చేయి ఎత్తాడు. “సార్… ఇది ఏ సబ్జెక్ట్?” అని అడిగాడు. టీచర్ చాలా సీరియస్‌గా, “దేశభక్తి” అన్నాడు. “సార్… మ్యాథ్స్ ఎప్పుడు?” అని పిల్లాడు మళ్లీ అడిగాడు. “అది తర్వాత. ముందుగా దేశాన్ని ఎలా రక్షించాలో నేర్చుకో” అని టీచర్ చెప్పాడు.
ఈలోగా అటుగా వెళ్తున్న మాస్టారు..లోపలకి తొంగి చూసి…ఇలాంటివి బలంగా నేర్పాలంటే పుస్తకం సరిపోదు. ఒక చిన్న గ్రెనేడ్ మోడల్ ఉంటే పిల్లలకు విషయం త్వరగా అర్థమవుతుంది.అన్నారు.
చూస్తుంటే ఇది ఏదో సెటైరికల్ సినిమా సీన్లా అనిపిస్తుంది. కానీ కాదు. ఇది రష్యా స్కూల్లోకి వస్తున్న కొత్త విద్యా విధానం. అక్కడ పిల్లలకు ఇప్పుడు పుస్తకాలతో పాటు యుద్ధం కూడా ఒక పాఠంగా మారుతోంది. మన పిల్లలకు JEE సిలబస్ టెన్షన్. వాళ్ల పిల్లలకు యుద్ధ సిలబస్ టెన్షన్.
అవును ఇదంతా నిజం…
రష్యా కొత్త విద్యా ప్రణాళికలో “మాతృభూమి భద్రత, రక్షణకు ప్రాథమిక అంశాలు” అనే కోర్సుకు సైనిక శిక్షణను మరింతగా జోడించారు. ఇందులో తుపాకులు, యాంటీ ట్యాంక్ ఆయుధాలు, చేతి గ్రెనేడ్లు వంటి ఆయుధాలపై ప్రాథమిక అవగాహనతో పాటు సైనిక క్రమశిక్షణ, యుద్ధ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, గాయపడినవారికి ఎలా ప్రథమ చికిత్స చేయాలి, పేలుడు పదార్థాల ప్రమాదాలను ఎలా గుర్తించాలి, రసాయనాలు, రేడియేషన్ వంటి ప్రమాదాల నుంచి ఎలా రక్షించుకోవాలి వంటి అంశాలు ఉన్నాయి. పదమూడేళ్లు, పద్నాలుగేళ్ల పిల్లలకు ఇవన్నీ వినిపించడం మనకు షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ రష్యా విద్యా వ్యవస్థలో ఇది ఇప్పుడు దేశ రక్షణ పేరుతో సాధారణ విద్యలో భాగమవుతోంది.
ఇక కథలో అసలు ట్విస్ట్ తుపాకి కాదు. డ్రోన్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సోవియట్ కాలం నాటి తుపాకీ పట్టుకుని కవాతు చేసే శిక్షణను మాత్రమే తీసుకుంటే సరిపోదు. ఆధునిక యుద్ధం ఎలా మారిందో దానికి తగ్గట్టుగానే పిల్లలకు శిక్షణను మార్చుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లు ఎంత కీలకంగా మారాయో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు అదే సాంకేతికత రష్యా పిల్లల శిక్షణలోకి వస్తోంది. డ్రోన్లపై ప్రత్యేక తరగతులు, సిమ్యులేటర్ల ద్వారా శిక్షణ వంటి అంశాలు పాఠ్య ప్రణాళికలో చోటు సంపాదించాయి.
అంటే ఒకప్పుడు పిల్లవాడు స్కూల్లో “సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందా?” అనే ప్రశ్నకు సమాధానం రాసేవాడు. ఇప్పుడు మరో ప్రశ్న కూడా ఎదురవుతోంది — “డ్రోన్ యుద్ధంలో ఏం చేస్తుంది?” విద్యా వ్యవస్థ కూడా కాలానికి తగ్గట్టు అప్డేట్ అవుతోంది కదా! తేడా ఒక్కటే. మన దగ్గర కొత్త టెక్నాలజీ అంటే కోడింగ్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రష్యాలో అదే టెక్నాలజీకి మరో అప్లికేషన్ కూడా కనిపిస్తోంది — యుద్ధం.
పాఠాలు మాత్రమే కాదు…ప్రాక్టికల్స్ కూడా
స్కూల్ గంట కొట్టగానే ఈ శిక్షణ ఆగిపోవడం లేదు. రష్యా సోవియట్ కాలం నాటి “జర్నిట్సా” అనే యువత సైనిక ఆటను ఆధునిక రూపంలో తిరిగి తీసుకొచ్చింది. పిల్లలను టీమ్ లుగా విభజించి, వారికి కమాండర్, డ్రోన్ ఆపరేటర్, వైద్య సహాయకుడు, దాడి దళ సభ్యుడు వంటి పాత్రలు ఇస్తారు. లేజర్ ట్యాగ్ పరికరాలు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు, కందకాల తరహా శిక్షణ, నకిలీ తుపాకులు వంటి వాటితో యుద్ధాన్ని పోలిన ఆటలు నిర్వహిస్తున్నారు. పేరు మాత్రం “ఆట”. నిజమైన బుల్లెట్లు లేవు కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ పిల్లల మెదడులో మాత్రం యుద్ధం, సాహసం, దేశభక్తి అనే మూడు పదాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం మొదలవుతుంది.
ఇంతమందికి ట్రైనింగా?
2024లో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న పిల్లల సంఖ్య సుమారు 8 లక్షలు కాగా, ఈ ఏడాది అది 25 లక్షలకు చేరుతుందని అంచనా. అంటే ఇది ఒకటి రెండు సైనిక కుటుంబాల పిల్లలకు పరిమితమైన కార్యక్రమం కాదు. లక్షలాది మంది పిల్లలను తాకే స్థాయిలో విస్తరిస్తోంది. మన దగ్గర సమ్మర్ క్యాంప్ అంటే క్రికెట్, స్విమ్మింగ్, డ్యాన్స్, పెయింటింగ్. రష్యాలో కొన్ని పిల్లల సమ్మర్ క్యాంపుల్లో మాత్రం “ఈరోజు డ్రోన్ ఆపరేషన్, రేపు కందక శిక్షణ” అన్నట్టుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. బాల్యంలో కూడా యుద్ధానికి ఒక సిలబస్ తయారవుతోంది.
టీచర్లు ఎవరు
ఇంతకీ ఈ పాఠాలన్నీ చెప్పేది ఎవరు అంటారా… ఈ సైనిక వాతావరణాన్ని పిల్లలకు పరిచయం చేసేది కేవలం టీచర్లు మాత్రమే కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న సైనికులను పాఠశాలలు, కిండర్గార్టెన్లకు తీసుకెళ్లి పిల్లలతో మాట్లాడిస్తున్నారు. వాళ్ల యుద్ధ అనుభవాలు, దేశభక్తి, సైనిక సేవ గురించి చెబుతున్నారు. రష్యా పార్లమెంటు దిగువ సభ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలోడిన్ అయితే యుద్ధంలో పాల్గొన్న సైనికులు ప్రతి పాఠశాలలో ఉండాలని కోరుతున్నారు. అంటే భవిష్యత్తులో ఒక పిల్లాడు “ఈరోజు స్కూల్లో ఎవరు క్లాస్ చెప్పారు?” అంటే “మ్యాథ్స్ టీచర్ కాదు నాన్నా… ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడిన సైనికుడు” అనే సమాధానం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఇక ఇప్పటికే 95 శాతం పాఠశాలల్లో యుద్ధానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని తేలింది. 80 శాతానికి పైగా పాఠశాలలు యుద్ధంలో పాల్గొన్న సైనికులను విద్యార్థులతో మాట్లాడిస్తున్నాయి. దాదాపు 75 శాతం పాఠశాలల్లో యుద్ధంపై ప్రత్యేక పాఠాలు నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఒక్క స్కూల్ టీచర్‌కు వచ్చిన ఐడియా కాదు. విద్యా వ్యవస్థలోకి ఒక ఆలోచనను వ్యవస్థీకృతంగా తీసుకువస్తున్న ప్రక్రియ.
ఇదంతా ప్రభుత్వ పైప్ లైన్..
ఇప్పుడు మొత్తం కలిపి ఓ చిత్రంగా కలిపి చూడండి. పిల్లవాడు స్కూల్‌కు వెళ్తాడు. అక్కడ సైనిక శిక్షణ పరిచయం అవుతుంది. తర్వాత సైనిక ఆటలు, డ్రోన్ శిక్షణ, సైనిక శిబిరాలు, క్యాడెట్ పాఠశాలలు, యుద్ధంలో పాల్గొన్న సైనికులతో సమావేశాలు. 18 ఏళ్ల వయసులో పురుషులకు తప్పనిసరి సైనిక సేవ. మధ్యలో ఎక్కడైనా పిల్లవాడికి సైనికుడిగా మారాలనే ఆసక్తి పెరిగితే దానికి ప్రత్యేక మార్గాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవస్థను చూస్తే “స్కూల్ నుంచి ఆర్మీ వరకు ఒక పైప్‌లైన్ తయారవుతోందా?” అనే ప్రశ్న రావడం సహజమే.
రష్యా ఏమంటోంది
రష్యా ప్రభుత్వం పిల్లలకు యుద్ధాన్ని మాత్రమే నేర్పించడం లేదని చెబుతుంది. అది దేశభక్తిని నేర్పుతోందని చెబుతోంది. సరే. దేశాన్ని ప్రేమించాలి. దేశాన్ని కాపాడాలి. శత్రువుల నుంచి రక్షించుకోవాలి. ఇవన్నీ అర్థమయ్యే మాటలే. కానీ ఒక చిన్న సందేహం మాత్రం మిగిలిపోతుంది — దేశాన్ని ప్రేమించడం నేర్పడానికి గ్రెనేడ్ ఎందుకు అవసరం? దేశాన్ని రక్షించడం నేర్పడానికి డ్రోన్ ఎందుకు అవసరం? క్రమశిక్షణ నేర్పడానికి కందకం ఎందుకు అవసరం? ఆయుధాలు, గ్రెనేడ్లు, డ్రోన్లు, యుద్ధ గాయాలకు చికిత్స, కందకాలు, సైనిక శిబిరాలు, యుద్ధ వీరుల ప్రసంగాలు… ఇవన్నీ ఒకే విద్యా వాతావరణంలో కలిసినప్పుడు, దాని ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది?
ఎందుకంటే పిల్లల ప్రపంచంలో హీరో అనే పదానికి చాలా విలువ ఉంటుంది. సినిమా హీరో కావచ్చు. క్రికెటర్ కావచ్చు. ఫైటర్ పైలట్ కావచ్చు. ఒక దేశం పదేపదే సైనికుడిని హీరోగా, యుద్ధాన్ని దేశభక్తి పరీక్షగా, శత్రువును జాతీయ ముప్పుగా చూపిస్తే, యుద్ధం అనే పదం పిల్లల మనసులో క్రమంగా భయాన్ని కోల్పోయి ఒక సాధారణ భవిష్యత్తు ఎంపికగా మారవచ్చు. విమర్శకులు భయపడుతున్నది ఇదే.
మిలిటరైజేషన్
సోవియట్ కాలంలో కూడా పాఠశాలల్లో సైనిక శిక్షణ ఉండేది. కానీ అప్పటి ప్రచారంలో యుద్ధం అంటే దేశం ఎదుర్కొన్న ఒక మహా విషాదం. రెండో ప్రపంచ యుద్ధంలో కోట్లాది సోవియట్ ప్రాణాలు పోయిన జ్ఞాపకం దానికి నేపథ్యం. ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో అదే సైనిక భావనను కొత్త తరానికి పరిచయం చేస్తున్నారు. అందుకే రష్యా విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ మార్పును కొందరు “మిలిటరైజేషన్”గా, అంటే సమాజాన్ని సైనిక భావజాలం వైపు మళ్లించే ప్రక్రియగా చూస్తున్నారు.
ఫైనల్ గా..
పిల్లల బాల్యం సాధారణంగా భవిష్యత్తు గురించి కలలు కనడానికి ఉండాలి. ఎవరో డాక్టర్ కావాలని అనుకుంటారు. ఎవరో ఇంజనీర్ కావాలని అనుకుంటారు. ఇంకొకరు క్రికెటర్ కావాలని అనుకుంటారు. కానీ ఒక దేశం తన పిల్లల ముందుంచే భవిష్యత్తు ఎంపికల్లో “సైనికుడు” అనే పాత్రను పదేపదే పెద్దదిగా చూపిస్తే, ఆ సమాజం రేపటిని ఎలా ఊహిస్తోంది అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు పిల్లాడి స్కూల్ బ్యాగ్‌లో పెన్సిల్ బాక్స్ చూసి తల్లి “పెన్ ఉందా?” అని అడిగేది. ఇప్పుడు రష్యాలోని ఒక తల్లి తన పిల్లాడిని “పెన్సిల్ ఉందా?” అని అడిగిన తర్వాత, “డ్రోన్ బ్యాటరీ ఛార్జ్ చేశావా?” అని కూడా అడగాల్సిన రోజులు వస్తున్నాయా?








