షుగర్ కంట్రోల్ కు మీ శరీరంలోనే మందు తయారి?! డయాబెటిస్‌కు కొత్త టెక్నాలజీ
డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఒక విషయం బాగా తెలుసు. షుగర్‌ను కంట్రోల్ చేయడం అంటే ఒకసారి మందు వేసుకుని మర్చిపోవడం కాదు. ఏం తిన్నాం, ఎప్పుడు తిన్నాం, షుగర్ ఎంత ఉంది, మందు ఎప్పుడు వేసుకోవాలి.. ఇలా రోజూ ఒక లెక్కే. ముఖ్యంగా షుగర్ పెరిగినప్పుడు దాన్ని అదుపులోకి తీసుకురావడానికి చికిత్స అవసరం. ఇప్పుడు ఈ మొత్తం విధానంలోనే ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చా అనే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగం చేస్తున్నారు. ఆ ప్రయోగం ఏమిటి…
ఆ ఆలోచనే …
షుగర్ పెరిగినప్పుడు మనమే మందు తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. శరీరంలో ఉండే బ్యాక్టీరియానే షుగర్ పెరిగిందని గుర్తించి, అవసరమైనప్పుడు మాత్రమే మందును తయారు చేస్తే?
ఇది సైన్స్ ఫిక్షన్ మేటర్ లా కనిపించినా, చైనాకు చెందిన పరిశోధకులు ఇప్పుడు అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేశారు. పేగుల్లో ఉండే ఒక ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను జన్యుపరంగా మార్చి, రక్తంలో షుగర్ పెరిగినప్పుడు మాత్రమే GLP-1 అనే హార్మోన్‌ను విడుదల చేసేలా రూపొందించారు. అంటే మందును ప్రతిసారీ బయట నుంచి ఇవ్వడం కాకుండా, అవసరమైనప్పుడు శరీరంలోనే తయారు చేసుకునేలాగ అన్నమాట.
ఈ ప్రయోగాత్మక చికిత్సకు GIFT (Glucose-responsive Insulin-Fostering Therapy) అని పేరు పెట్టారు. ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హైఫెంగ్ యే నేతృత్వంలోని బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది.
షుగర్ పెరిగిందని బ్యాక్టీరియాకు ఎలా తెలుస్తుంది?
GIFTలో ఉపయోగించిన బ్యాక్టీరియాను ఒక చిన్న ‘జీవ ఫ్యాక్టరీ’ లా అనుకోవచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగినప్పుడు, ఆ బ్యాక్టీరియా దాన్ని ఒక సంకేతంలా గుర్తిస్తుంది. వెంటనే దాని జన్యు వ్యవస్థ స్పందించి GLP-1ను తయారు చేసి విడుదల చేస్తుంది.
GLP-1 శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దాంతో రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంలో శరీరానికి సహకారం అందుతుంది. షుగర్ సాధారణ స్థాయికి వచ్చినప్పుడు బ్యాక్టీరియా నుంచి GLP-1 విడుదల కూడా తగ్గిపోతుంది.
సింపుల్‌గా చెప్పాలంటే..
షుగర్ పెరుగిన వెంటనే బ్యాక్టీరియా గుర్తిస్తుంది. GLP-1 విడుదల అవుతుంది. ఇన్సులిన్ స్పందన పెరుగుతుంది. షుగర్ కంట్రోలు లోకి వస్తుంది. అంటే మందు ఎప్పుడు పనిచేయాలో శరీరంలోని షుగర్ స్థాయే ఒక రకంగా నిర్ణయిస్తుంది.
Ozempicతో దీనికి సంబంధం ఏమిటి?
ఇక్కడ GLP-1 అనే పేరు కీలకం. ప్రస్తుతం డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో విస్తృతంగా చర్చకు వస్తున్న సెమాగ్లుటైడ్ వంటి మందులు కూడా ఇదే హార్మోన్ మార్గాన్ని లక్ష్యంగా చేసుకుంటాయి. Ozempic, Wegovy వంటి బ్రాండ్ పేర్లు అందుకే ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తున్నాయి.
అయితే GIFT విధానం భిన్నంగా పనిచేస్తుంది. బయట నుంచి GLP-1 ఆధారిత మందును ఇవ్వడం బదులు, షుగర్ పెరిగినప్పుడు పేగుల్లోని బ్యాక్టీరియాతోనే GLP-1 తయారు చేయించాలన్నది దీని ఆలోచన.
అంటే ఒక రకంగా చెప్పాలంటే.. మందును శరీరానికి ఇవ్వడం కాదు, శరీరంలోనే తయారు చేయించడం.
జంతువుల్లో వచ్చిన ఫలితాలు
ఈ సాంకేతికతను మొదట డయాబెటిస్ ఉన్న ఎలుకల్లో, ఆ తర్వాత కోతుల్లో పరీక్షించారు. ప్రయోగాల్లో రక్తంలో షుగర్ నియంత్రణ, ఇన్సులిన్‌కు శరీరం స్పందించే విధానం మెరుగుపడినట్లు పరిశోధకులు తెలిపారు. HbA1c వంటి దీర్ఘకాలిక షుగర్ నియంత్రణ సూచికలో కూడా మెరుగుదల కనిపించింది. అయితే ఇవి ప్రస్తుతానికి జంతువుల్లో వచ్చిన ఫలితాలు మాత్రమే. మనుషుల్లో ఇదే విధంగా పనిచేస్తుందని ఇప్పుడే చెప్పలేం.
మరి ఇది మనుషులకు ఎప్పుడు వస్తుంది?
ప్రస్తుతానికి GIFT మనుషులపై పరీక్షించలేదు. క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. పరిశోధకులు ఈ సాంకేతికతకు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసి, ఔషధ తయారీకి అవసరమైన స్థాయిలో ఉత్పత్తిని పెంచే పనిలో ఉన్నారు.
మనుషులపై పరీక్షలకు వెళ్లే ముందు దీని భద్రత, సరైన మోతాదు, దీర్ఘకాల ప్రభావాలు వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జన్యుపరంగా మార్చిన బ్యాక్టీరియాను మనిషి శరీరంలో ఉపయోగించడంలో మరింత జాగ్రత్త అవసరం.








