మధ్య ఆసియాతో సహకారం మరింత విస్తృతం… ఉజ్బెకిస్తాన్ కీలక మిత్రదేశమన్న మోడీ..!
మధ్య ఆసియా దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా భారత ప్రధాని మోడీ ఉజ్బెకిస్తాన్ లో పర్యటించారు. ముఖ్యంగా రక్షణ, వాణిజ్యం, పర్యాటకం సహా పలు అంశాలపై ఇరుదేశాలు
ఒప్పందాలు చేసుకున్నాయి.ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.47,690 కోట్లు) పెంచుకోవాలని భారత్-ఉజ్బెకిస్థాన్ నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఇది 100 కోట్ల డాలర్లుగా ఉంది. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌తో భారత ప్రధాని నరేంద్రమోడీ… తాష్కెంట్లో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకువెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చారు.
వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అరుదైన ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్ వ్యవస్థలు, విద్య.. ఈ రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. 11 ఒప్పందాలకు సంబంధించిన అవగాహన పత్రాలను ఇరు దేశాల బృందాలు పరస్పరం మార్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంతో మధ్య ఆసియా ప్రాంతంలో శాంతి, పురోగతి, సుసంపన్నతలకు బలం లభిస్తుందని మోడీ తెలిపారు. ఆయుధ ఉత్పత్తిలో రెండుదేశాల రక్షణరంగ పరిశ్రమలు పరస్పరం సహకరించుకుని సంయుక్త భాగస్వామ్యంతో పనిచేసేందుకు వీలుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. యురేనియం సరఫరాకు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. విదేశీ నేతలకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం (ఒలియ్ దరలి దోస్త్లిక్)ను మోదీకి ప్రదానం చేశారు. దీనిని ఆయన ఇరు దేశాల సంబంధాలకు, 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేశారు. ప్రవాస భారతీయులతో మోడీ భేటీ అయ్యారు.
భారత పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్ 30 రోజుల వీసా రహిత (వీసా-ఫ్రీ) విధానాన్ని ప్రకటించింది. మిర్జియోయెవ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రెండురోజుల పాటు జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొనేందుకు మోడీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, కిర్గిస్థాన్ అధ్యక్షుడు ఝపరోవ్లతో ఆయన చర్చలు జరపనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా అక్కడకు చేరారు.
ఉజ్బెకిస్థాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1992 మార్చి 18న భారత్‌తో దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. 2011లో ఈ బంధం వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది. ప్రధాని మోడీ.. 2015 తర్వాత ఉజ్బెకిస్థాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి.








