గుంటూరులో తలనొప్పిగా రేషన్ మాఫియా..!
గుంటూరు(Guntur) జిల్లాలో పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ డీలర్లను లక్ష్యంగా చేసుకుని ‘బియ్యం మాఫియా’ బెదిరింపులకు దిగుతుండటంతో డీలర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా, బ్లాక్ మార్కెట్ తరలించేందుకు తమకే అప్పగించాలంటూ కొంతమంది మాఫియా ముఠా నాయకులు డీలర్లపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ అక్రమాలకు సహకరించని రేషన్ డీలర్లపై భౌతిక దాడులు, ప్రాణాపాయ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అక్రమ దందా వెనుక తిరుమలశెట్టి అనిల్ అనే వ్యక్తి, అతని అనుచరులు ఉన్నారని గుంటూరు జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అనిల్ మరియు అతని గ్యాంగ్ నుంచి తమకు తీవ్ర ప్రాణహాని ఉందంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడైన అనిల్‌పై ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, బెదిరింపులకు సంబంధించిన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని సంఘం నేతలు గుర్తు చేస్తున్నారు.
గతంలో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలను స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి(Galla Madhavi) స్వయంగా పట్టుకుని అధికారులకు అప్పగించిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అయినప్పటికీ రేషన్ మాఫియా ఆగడాలు తగ్గకపోవడంతో, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు గుంటూరు జిల్లా ఎస్పీ (SP) ని కలిసి వినతిపత్రం సమర్పించారు. క్షేత్రస్థాయిలో డీలర్లపై దాడులకు తెగబడుతున్న రౌడీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాను పూర్తిగా కట్టడి చేసి డీలర్లకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని వారు ఎస్పీని కోరారు. పేదల బియ్యాన్ని దోచుకుంటూ, డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ రేషన్ మాఫియా వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలని గుంటూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








