NBK112లో పవర్ఫుల్ పోలీస్ రోల్.. తమిళ హీరోతో కొరటాల డిస్కషన్స్
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కనున్న NBK112పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతోంది. రాజకీయ నేపథ్యానికి యాక్షన్ అంశాలను జోడించి ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణకు సరిపోయే పవర్ఫుల్ పాత్రలతో పాటు కథకు కీలకంగా నిలిచే ఇతర క్యారెక్టర్లను కూడా కొరటాల శివ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళ నటుడు ఆర్య(Arya)ను ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కోసం సంప్రదించినట్లు సమాచారం. కథలో కీలకంగా కనిపించే పోలీసాఫీసర్‌గా ఆయనను చూపించే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు టాక్. అయితే ఈ పాత్రకు ఆర్య ఇంకా ఓకే చెప్పలేదని, ప్రస్తుతం ఇరువురి మధ్య డిస్కషన్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
ఇటీవల వెంకటేష్(Venkatesh) నటించిన సైంధవ్(Saindhav)లో కనిపించిన ఆర్య.. ప్రస్తుతం తమిళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని(Gopichand Malineni) సినిమా పూర్తైన తర్వాతే NBK112 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. బాలకృష్ణకు ఇటీవల గాయం కావడంతో ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దడంతో పాటు నటీనటులు, సాంకేతిక బృందం ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri), సుధాకర్ మిక్కిలినేని(Sudhakar mikkilineni) నిర్మించనున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నెక్ట్స్ ఇయర్ షూటింగ్ ను ప్రారంభించి, 2027 సెకండాఫ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్‌తో మేకర్స్ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.








