పైకి పెట్రోలు డీల్, కానీ ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేరు –వెనిజులా ఒప్పందం వెనుక అసలు కథ
ఒక దేశాన్ని ఓడించాలంటే రాజధానిని ఆక్రమించక్కర్లేదు.. ఆ దేశం ఖజనాను, అంటే ఖరీదైన సంపదను చేతిలోకి తీసుకుంటే చాలు! అంటారు రాజనీతిజ్ఞులు. ఇప్పుడు వెనిజులా విషయంలో అమెరికా అదే చేస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెచ్చిన తాజా చమురు ఒప్పందం పైకి చూసేందుకు సాధారణ బిజినెస్ లా ఉన్నా, దాని వెనుక పెద్ద రాజకీయ గేమే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ డీల్ గురించే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఆ డీల్ ఏమిటి..ట్రంప్ కు కలిసొచ్చేదేమిటి, అమెరికా ఏ విధంగా లబ్ది పొందుతుందో చూద్దాం.
డీల్ ఏమిటి
వెనిజులా దగ్గర ఉన్న 65 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ నిల్వలపై అమెరికా కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవాలని చూడటమే ఈ డీల్ లో ప్రధానాంశం. అక్కడి ప్రైవేట్ కంపెనీతో కలిసి అమెరికా గవర్నమెంట్ ఒక కొత్త జాయింట్ వెంచర్ స్టార్ట్ చేస్తోంది. దీంతో ఏకంగా 17 ఆయిల్ ఫీల్డ్స్‌పై నూట యేళ్ల పాటు రైట్స్ దక్కబోతున్నాయి. అంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యే దాంట్లో 55% వాటా, అదీ కేవలం ప్రొడక్షన్ కాస్ట్‌కే కొనే పవర్ అమెరికా చేతిలో ఉంటాయి.
ఇక్కడ అసలైన విషయం ఏంటంటే.. వెనిజులా దగ్గర ప్రపంచంలోనే హైయెస్ట్ అంటే 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఆయిల్ ఉంది. ఇప్పుడు అమెరికా టార్గెట్ చేసిన 65 బిలియన్ బ్యారెళ్లు అందులోవే. అంటే ఇదొక మామూలు బిజినెస్ డీల్ కాదు, ఒక దేశం వనరులపై అమెరికా వేస్తున్న గట్టి మాస్టర్ ప్లాన్. ఆయిల్ ఇప్పుడేం అమెరికాకి వచ్చేయట్లేదు, అంతా అండర్‌గ్రౌండ్‌లోనే ఉంది. ఫ్యూచర్లో తీసే దానిపైనే ఈ కంట్రోల్ అంతా.
వెనిజులా ఎందుకు ఒప్పుకుంది
ఒక్కసారి ఊహించుకోండి. మీ ఇంటి కింద భారీగా బంగారం ఉందనుకోండి. కానీ దాన్ని బయటకు తీయడానికి మీ దగ్గర డబ్బు లేదు. యంత్రాలు లేవు. పనిచేసే వ్యవస్థ లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరో వచ్చి “నీ బంగారం నువ్వే ఉంచుకో.. నేను యంత్రాలు తెస్తా, డబ్బు పెడతా. కానీ దాంతో వచ్చే సంపదలో మెజారిటీ నాకే” అంటే ఒప్పుకుంటారా? ఇప్పుడు వెనిజులా విషయంలో జరుగుతున్న కథ దాదాపు ఇలాంటిదే.
వెనిజులా దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. భూమి కింద వందల బిలియన్ బ్యారెళ్ల చమురు దాగి ఉంది. కానీ విచిత్రమేంటంటే.. ఇంత చమురు ఉన్న దేశమే గత కొన్నేళ్లుగా ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. అంతేకాదు వెనిజులాలో ఆయిల్ ఇండస్ట్రీ ఎప్పుడో డ్యామేజ్ అయిపోయింది. పెట్టుబడులు తగ్గిపోయాయి. అవినీతి, రాజకీయ సంక్షోభం, అమెరికా ఆంక్షలు అన్నీ కలిసి పరిస్థితిని దారుణంగా మార్చేశాయి. అంటే ఇంటి కింద బంగారం ఉన్నా.. ఇంట్లో తినడానికి డబ్బులేని పరిస్థితి అన్నమాట.
దాంతో ఇప్పుడు రిఫైనరీలు, పైప్లైన్లు అన్నీ మళ్లీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి. దానికి వందల బిలియన్లు కావాలి. అంటే అమెరికా ఇప్పుడు నేల కింద ఉన్న చమురును తీసుకెళ్లడానికి మాత్రమే రావడం లేదు. చమురు బయటకు వచ్చేలా మొత్తం వ్యవస్థను తిరిగి నిర్మించడానికి కూడా రంగంలోకి దిగుతోంది.
అదీ మామూలుగా కాదు. “మీ చమురు పరిశ్రమను మళ్లీ నిలబెడదాం” అంటూ ఏకంగా భారీ భాగస్వామ్యంతో ముందుకొచ్చింది.దాంతో వెనిజులా వేరే దారిలేక సరే అంది. అంటే అమెరికా ఇప్పుడు ఏదో ఒక చిన్న చమురు క్షేత్రంపై కన్నేయ లేదు. ప్రపంచ చమురు పటంలో తనకు ఒక భారీ స్థానం సంపాదించుకునేంత పెద్ద అడుగు వేస్తోంది.
వెనిజులా ప్రభుత్వం ఏమంటోంది
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ మాత్రం ఈ ఒప్పందాన్ని “చారిత్రాత్మకం” అంటున్నారు. చమురు ప్రాజెక్టుల ద్వారా తమ దేశానికి సుమారు 209 బిలియన్ డాలర్ల పన్నుల ఆదాయం రావచ్చని చెబుతున్నారు. ఆమె కోణంలో చూస్తే.. పాడైపోయిన పరిశ్రమలోకి డబ్బు వస్తుంది. ఉత్పత్తి పెరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఊపిరి పీల్చుకోవచ్చు.
సరే…ట్రంప్‌కు ఇంత చమురు ఎందుకు?
ఈ డీల్ విషయంలో ట్రంప్ ఒకేసారి ఐదు గేమ్స్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
మొదటి గేమ్
అమెరికా ఇంధన భద్రత. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, చమురు సరఫరా దెబ్బతిన్నా.. చివరికి దాని ప్రభావం అమెరికా పెట్రోల్ ధరలపై పడుతుంది. ఇరాన్ యుద్ధం తర్వాత ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాలపై ఆందోళనలు పెరిగాయి. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు కూడా బలహీనపడ్డాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ ఏం చేస్తున్నారు? భారీ చమురు నిల్వలున్న దేశాన్ని అమెరికా ఇంధన వ్యవస్థలోకి లాగుతున్నారు. అంటే ట్రంప్ లెక్కలో వెనిజులా కేవలం చమురు దేశం కాదు. అమెరికా కోసం ఒక భారీ ఇంధన రిజర్వ్.
రెండో గేమ్ — పెట్రోల్ ధరలు
ఇది ట్రంప్‌కు ఇంకా ముఖ్యమైన విషయం. అమెరికా ప్రజలకు విదేశాంగ విధానం కంటే పెట్రోల్ ధర ముఖ్యం. గ్యాస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు లీటర్, గ్యాలన్ ధర పెరిగితే.. అధ్యక్షుడి మీదే కోపం వస్తుంది. నవంబర్ మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇంధన ధరలు రాజకీయంగా చాలా సున్నితమైన అంశం. అందుకే ట్రంప్‌కు వెనిజులా చమురు మరో అర్థాన్ని ఇస్తుంది. “చమురు సరఫరా నా నియంత్రణలో ఉంది. ధరలను అదుపులో పెట్టడానికి నా దగ్గర కొత్త వనరు ఉంది” అని అమెరికన్ ఓటర్లకు చెప్పే అవకాశం.
మూడో గేమ్ — చైనాకు చెక్
ఇది ఇంకా పెద్ద విషయం. గత కొన్నేళ్లుగా చైనా… లాటిన్ అమెరికాలో తన ప్రభావాన్ని విస్తరించింది. పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాల్లోకి వెళ్లింది. ముఖ్యంగా వెనిజులాతో చమురు సంబంధాలను బలపరిచింది. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఏం చేస్తున్నారు?..చైనా బలంగా ఉన్న చోటే అమెరికా మరింత బలంగా అడుగుపెడుతోంది. వెనిజులా చమురు రంగంలో అమెరికా మెజారిటీ నియంత్రణ సాధిస్తే.. అది కేవలం అమెరికాకు చమురు దొరికిన విషయం కాదు. చైనా భవిష్యత్తు ప్రభావానికి కూడా ఒక పెద్ద దెబ్బ.
నాలుగో గేమ్ — వెనిజులా అంటే కేవలం చమురు కాదు
వెనిజులా దగ్గర చమురు మాత్రమే లేదు. బంగారం, సహజ వాయువు, ఇతర ఖనిజ సంపద కూడా ఉంది. అందుకే చమురు రంగంలో అమెరికా బలమైన పట్టు సాధించడం వల్ల భవిష్యత్తులో వెనిజులా సహజ వనరులపై అమెరికా వ్యాపార సంస్థలకు మరిన్ని అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. అంటే ట్రంప్ లెక్కలో.. చమురు మొదటి తలుపు కావచ్చు. తలుపు తెరిచిన తర్వాత లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో చూడొచ్చు.
ఐదో గేమ్ — ట్రంప్‌కు కావాల్సిన “విజయ కథ”
ఇది పూర్తిగా రాజకీయ కోణం. ట్రంప్ తన రాజకీయ శైలిలో ఒక విషయాన్ని పదే పదే చూపిస్తారు. “నేను వచ్చాను. సమస్యను పట్టుకున్నాను. డీల్ చేశాను. అమెరికాకు లాభం తెచ్చాను.” వెనిజులా విషయంలో కూడా అదే కథను చెప్పుకునే అవకాశం ఆయనకు ఉంది. ఒకప్పుడు అమెరికాతో తీవ్రంగా విభేదించిన దేశం వెనిజులా. దాంతో ముందుగా అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత వెనిజులా చమురు రంగంపై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు అదే దేశం నుంచి అమెరికాకు చౌకగా చమురు వచ్చేలా, అమెరికా మెజారిటీ నియంత్రణలో ఉండే భారీ భాగస్వామ్యం.
ట్రంప్ దీన్ని తన అభిమాన రాజకీయ భాషలో చెప్పాలంటే..
“అమెరికా మళ్లీ గెలుస్తోంది.”
అదే అసలు కథ.








