మళ్లీ హర్మూజ్ లోకి సీమైన్స్.. ధ్వంసం చేసిన అమెరికా..!
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. హర్మూజ్ పై పట్టుకోసం .. అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల పర్వాన్ని కొనసాగించాయి. దాదాపు నెలరోజుల తర్వాత దాడులకు దిగాయి. హర్మూజ్ జలసంధిలో ఉన్న లారక్ ద్వీపంలోని ఇరాన్ రాకెట్ లాంచ్ సిస్టమ్స్‌పై అగ్రరాజ్యం దాడులు చేసింది. దాంతో టెహ్రాన్ ప్రతీకార దాడులు చేసింది. జోర్డాన్ దేశంలోని యూఎస్ సైనిక స్థావరాలపైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
హర్మూజ్‌లోని కీలక రవాణా మార్గాల్లో ఇరాన్ (Iran) మరోసారి సీమైన్స్ పరిచేందుకు సిద్ధమవుతోందని తమ బలగాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా అమెరికా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దాంతో సీమైన్స్‌ను మోసుకెళ్లే రాకెట్లను ప్రయోగించే రెండు లాంచ్ సిస్టమ్స్‌ను లక్ష్యంగా చేసుకుంది. ప్రధాన నౌకా మార్గాల్లోని సీమైన్స్‌ను ఇప్పటికే తొలగించామని ఇటీవల అమెరికా (USA) సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ మరోసారి వాటిని పరిచేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
సీమైన్స్ తొలగించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. కొత్తగా మందుపాతరలు అమర్చితే వెంటనే వాటిని ధ్వంసం చేస్తామన్నారు. ఆ క్రమంలోనే తాజాగా దాడి జరిగింది. అమెరికా దళాలు హర్మూజ్ మార్గాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, స్వేచ్ఛా వాణిజ్యాన్ని పరిరక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధికారి వెల్లడించారు.
ఈ దాడుల్ని ఐఆర్జీసీ ధ్రువీకరించింది. యూఎస్ దాడుల వల్ల ఇరాన్ సైనికులు, ప్రజలు మరణించారని చెప్పింది. అయితే ఆ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ఈ దాడులకు గట్టిగా బదులిస్తామని చెప్పింది. జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్ , అల్ అజ్రఖ్ స్థావరాలపై ప్రతీకారదాడి చేసింది.








