ఏపీ మంత్రి నియోజకవర్గంలో వైసీపీ షాక్..!
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జామి మండలం మొఖాస కొత్తవలస గ్రామానికి చెందిన అధికార తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వైపు మొగ్గు చూపడం గమనార్హం. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత బొత్స అప్పలనరసయ్య సమక్షంలో జామి మండలంలో టీడీపీకి చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
మొఖాస కొత్తవలసకు చెందిన స్థానిక నాయకులు గొర్లి రవికుమార్, పాండ్రంకి సంజీవ్ ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ప్రదీప్నగర్లోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నివాసానికి చేరుకున్న ఆయా కుటుంబాల సభ్యులకు ఆయన స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అంతా కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, గజపతినగరం నియోజకవర్గంలో ఈ స్థాయిలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీలోకి వలసలు సాగడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బొత్స అప్పలనరసయ్య నేతృత్వంలో జామి మండలంలో ఒకేసారి 50 కుటుంబాలు పార్టీలో చేరడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న మండలాల్లో జామి మండలం ఒకటి. ఏకంగా మంత్రి నియోజకవర్గం నుంచే ఈ చేరికలు జరగడం సంచలనంగా మారింది.








