బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్.. ఆగిపోయిన బెజవాడ ఫ్లైట్..!
బెంగళూరు(Bengaluru) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా విమానయాన సంస్థ తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకే బయల్దేరాల్సిన ఈ విమానం, గంటలు గడుస్తున్నా బోర్డింగ్ ఊసే లేకపోవడంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
ఈ విమానంలో ప్రయాణించాల్సిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డితో(Mandipalli Ramprasad Reddy) పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. అత్యవసర అధికారిక పనుల నిమిత్తం విజయవాడ చేరుకోవాల్సిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డితో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఎయిరిండియా నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం విమానం ఎప్పుడు బయల్దేరుతుందనే కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ప్రయాణికులను గంటల తరబడి వేచి చూసేలా చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైందా లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను వెల్లడించడంలో విమానయాన సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎయిర్‌పోర్ట్‌లోనే ప్రయాణికులు సిబ్బందిని నిలదీశారు. విమాన సంస్థల ఇలాంటి అలసత్వం వల్ల అత్యవసర ప్రయాణాలు చేసే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల పని తీరుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.








