‘I Want Your Sex’ సినిమా వెనుక షాకింగ్ కథ.. తన జీవితాన్నే కథగా మార్చిన రచయిత్రి!
ఒలీవియా వైల్డ్ నటించిన ‘I Want Your Sex’ సినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. సినిమా టైటిల్ ఎంత బోల్డ్‌గా ఉందో.. దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే ఇంట్రస్టింగ్ గా ఉంది. విమర్శకుల్లో చాలామంది సినిమాను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఒలీవియా వైల్డ్ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రివ్యూ అగ్రిగేటర్ రాటెన్ టొమాటోస్‌లో విమర్శకుల స్కోర్ ప్రస్తుతం 91 శాతంగా ఉంది. అయితే అందరూ ఒకే మాట చెప్పలేదు.
కొందరికి సినిమా చాలా సరదాగా, తెలివైన సెటైర్‌గా అనిపిస్తే.. మరికొందరికి కథలో కొన్ని చోట్ల తేలిపోయిందని తేల్చారు. అవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమాకు ఇంతకంటే ఇంట్రస్టింగ్ గా ఉండే మరో కథ ఉంది. అదే ఈ సినిమా వెనుక ఉన్న రచయిత్రి కార్లీ సియోర్టినో కథ. ఏమిటా కథ.
ఈమె స్టోరీనే వేరు!
కార్లీకి రాయడం అంటే ఏదో కాలక్షేపం కాదు. అందరికీ ఇబ్బందిగా, ఎబ్బెట్టుగా అనిపించే విషయాలనే బయటకు లాగడం ఆమె నైజం. ఇరవై ఏళ్ల క్రితం లండన్‌లో కొందరు ఆర్టిస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటున్నప్పుడే ‘స్లూటెవర్’ అనే బ్లాగ్ స్టార్ట్ చేసింది. అప్పట్లో ఇప్పుడలా సోషల్ మీడియా జోరు లేదు. పర్సనల్ లైఫ్‌ను పబ్లిక్‌గా పెట్టడం అంటే పెద్ద సాహసమే.
కానీ కార్లీ లెక్కచేయలేదు. రూమ్మేట్స్ రిలేషన్షిప్స్, తన సొంత కబుర్లు అన్నీ బ్లాగ్‌లో పెట్టేసింది. ఆ తర్వాత ఏకంగా డామినాట్రిక్స్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసింది. క్యామ్ గర్ల్స్, ఎస్కార్ట్స్‌ను ఇంటర్వ్యూ చేసింది. డేటింగ్, లైంగిక విషయాలపై వరుసపెట్టి రాసుకుంటూ పోయింది. ఎవరైనా సరే.. ఏదైనా పని మొదట్లో కాస్త చెడ్డ ఆలోచనలా అనిపించినా, “అరే, ఇది మంచి కథగా మారుతుందేమో” అనిపిస్తే చాలు, అస్సలు వెనకాడేది కాదు. ఆ తెంపరే ఆమెను అందరిలా కాకుండా కాస్త ప్రత్యేకం చేసింది.
మహిళ రాస్తే ‘చీప్’ అనుకున్న రోజులు!
ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ నుంచి యూట్యూబ్ వరకు డేటింగ్, రిలేషన్షిప్స్ గురించి అందరూ ఓపెన్‌గానే మాట్లాడుతున్నారు. కానీ కార్లీ కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో పరిస్థితి వేరు. ఒక అమ్మాయి తన శృంగార జీవితం గురించి బహిరంగంగా రాస్తే చాలు.. సమాజం దాన్ని చీప్‌గా చూసేది. “ఇదేం రాతలు” అంటూ ముక్కున వేలేసుకునేది.
కార్లీ మాత్రం ఆ విమర్శలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆమె బ్లాగ్ కాస్తా పెద్ద వెబ్ సిరీస్ అయ్యింది. ఆ తర్వాత టీవీ షోగా మారింది. చివరకు 2012లో ఏకంగా ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’లో సెక్స్‌పై కాలమ్ రాసే అవకాశం దక్కించుకుంది. అక్కడ కూడా ఒక చిన్న కామెడీ జరిగింది. మ్యాగజైన్లో శృంగారం గురించి రాస్తున్నా, ఆఫీసులో దాన్ని నేరుగా ‘సెక్స్ కాలమ్’ అనడానికి మొహమాటపడి.. సరదాగా ‘ఎమోషనల్ హెల్త్ కాలమ్’ అని పిలిచేవారట! ఏదేమైనా పాఠకులు మాత్రం ఆమె రాతలకు అడిక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఆమె ఉద్దేశం ఎప్పుడూ చీప్ పబ్లిసిటీ కోరుకోవడం కాదు; మనం మాట్లాడటానికి జంకే విషయాలను కూడా చాలా సాధారణంగా, ముఖం మీదే మాట్లాడటం.అదే ఆమెకు సక్సెస్ తెచ్చిపెట్టింది.
అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది!
2013లో కార్లీ తన జీవితంలో జరిగిన ఒక సంబంధాన్ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాసింది. తనకంటే చాలా పెద్ద వయసున్న ఒక ఎడిటర్‌తో ఆమెకు ఏర్పడిన బంధం ఆమె ఆలోచనా సరళినే మార్చేసింది. తన అనుభవాన్ని సిగ్గుపడాల్సిన విషయంగా కాకుండా, తన పర్సనాలిటీలో ఓ భాగమనే ధైర్యంతో కథగా మలిచింది.
ఆ స్క్రిప్ట్ కాస్తా ప్రముఖ ఇండిపెండెంట్ డైరక్టర్ గ్రెగ్ అరాకీ చేతికి వెళ్లింది. ఇద్దరికీ కథ పిచ్చిగా నచ్చింది. సినిమా తీద్దామని తెగ ప్రయత్నించారు. కానీ ప్రొడ్యూసర్లు, బడ్జెట్ కుదరక ఆ ప్రాజెక్ట్ అలాగే ఆగిపోయింది. మన దగ్గర కూడా ఎన్నో మంచి కథలు “ఎప్పుడో సినిమా చేద్దాం లెండి” అని ఏళ్ల తరబడి బీరువాల్లో స్క్రిప్టులుగా పడిపోతుంటాయి కదా! ఈ కథ కూడా సరిగ్గా అలాగే పదేళ్లకు పైగా అలానే ఉండిపోయింది. ఫైనల్‌గా 2023లో ఆ ఫైల్ మళ్లీ తెరుచుకుంది.
తరం మారింది.. కథ మారదా?
ఈసారి డైరెక్టర్ గ్రెగ్ అరాకీ ఒక అదిరిపోయే ఐడియా చెప్పాడు. పాత కథలో ఉన్న యంగ్ అమ్మాయి, పెద్ద వయసు మనిషి కాన్సెప్ట్‌ను పక్కన పెట్టేద్దాం అన్నాడు. ఇప్పుడున్న మిలీనియల్ తరం మహిళకు, నేటి జెన్-జెడ్ కుర్రాడికి మధ్య జరిగే కథగా దీన్ని మార్చాలని సూచించాడు. అంటే కథలో పాత్రల ఏజ్ గ్రూప్స్‌తో పాటు జెండర్స్ కూడా రివర్స్ అయ్యాయి!
ఇది కేవలం సినిమా మ్యాజిక్ కోసం చేసిన మార్పు కాదు. ఈ కొద్ది సంవత్సరాల గ్యాప్‌లోనే మనుషుల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందనే నిజాన్ని తెరపై చూపించడానికి చేసిన ప్రయత్నం.
మిలీనియల్స్ వర్సెస్ జెన్-జెడ్
కార్లీ ఆలోచన ప్రకారం.. మిలీనియల్స్ తరం ఇంటర్నెట్ పోర్న్‌ను చూస్తూ, డేటింగ్ స్వేచ్ఛను ఆస్వాదిస్తూ పెరిగిన మొట్టమొదటి తరం. వీళ్లకు లైంగిక స్వేచ్ఛ అనేది ఒక రకమైన తిరుగుబాటు. సమాజం మనపై రుద్దిన పాత రూల్స్‌ను బ్రేక్ చేయడం వారికి ఒక కిక్ ఇచ్చేది. “లైఫ్ ఒక్కటే ఉంది, అనుభవించాలి, తప్పులు చేయాలి, మనకు నచ్చినట్టు బతకాలి” అనేది ఆ జనరేషన్ ఫిలాసఫీ.
కానీ ఇప్పడు జెన్-జెడ్ దగ్గరికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది!
ఈ కొత్త కుర్రకారు డేటింగ్‌కే దూరంగా ఉంటున్నారు. ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లోకి వెళ్లేముందు వందసార్లు ఆలోచిస్తున్నారు. సెక్స్ విషయంలో భద్రత (Safety), వ్యక్తిగత హద్దులు (Boundaries), మానసిక ప్రశాంతత వంటి విషయాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
ఇది చూసి కార్లీకి ఒక్కోసారి ఆశ్చర్యంగా, ఇంకోసారి చిన్న బాధగా అనిపిస్తుంటుంది. జీవితంలో మిగతా విషయాల్లో మాత్రం “ధైర్యంగా ముందుకు వెళ్లండి, తప్పులు చేసి నేర్చుకోండి” అని చెప్పే మనం.. శృంగారం విషయానికి వచ్చేసరికి మాత్రం “జాగ్రత్త.. చిన్న పొరపాటు జరిగినా మానసికంగా కుంగిపోతావు” అని అంతగా ఎందుకు భయపెడుతున్నాం? అని ఆమె ప్రశ్నిస్తుంది. ఒకప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడిన తరం.. ఇప్పుడు భద్రత గురించి మాట్లాడే కొత్త తరానికి ఎలా సర్దిచెప్పాలో అర్థం కాక చూస్తోంది.
రచయిత్రి జీవితంలోనూ ఓ బ్రేక్!
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ మలుపు ఉంది. ఇతరుల శృంగార జీవితాల గురించి పుస్తకాలకు పుస్తకాలు రాసిన కార్లీ జీవితంలో కూడా ఒక పెద్ద విరామం వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఆమె తన డేటింగ్, శృంగార జీవితానికి కొద్దికాలం పాటు ఫుల్స్టాప్ పెట్టినట్లు రాసుకొచ్చింది. అప్పటికి ఆమె వయసు 40. ఒంటరిగా ఉంటోంది. పిల్లలు లేరు. ఏకంగా ఏడు నెలలుగా శృంగారం కు పూర్తిగా దూరంగా ఉంది!
ఇంత పర్సనల్ విషయాన్ని కూడా ఆమె తనదైన సెటైరికల్ స్టైల్లో చెప్పింది. “చరిత్రలో ఏ కాలంలో చూసినా ఇది నన్ను చాలా డిప్రెస్ అయిన వ్యక్తిలా చూపించేది. కానీ 2026లో చూస్తే.. ఇదేదో ట్రెండ్‌లో ఉన్నట్టు, చాలా కూల్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది” అని నవ్వుతూ చెప్పింది. శృంగారం గురించి నిరంతరం రాస్తూ వచ్చిన ఒక మహిళ కూడా చివరికి తన జీవితంలో దానికి అసలు అర్థం ఏమిటో కొత్త కోణంలో వెతుక్కోవాల్సి వచ్చింది.
అందుకే ఈ సినిమా కేవలం రొమాన్స్ కాదు!
‘ఐ వాంట్ యువర్ సెక్స్’ అనే పేరు వినగానేదో బోల్డ్ సినిమా అనుకోవచ్చు. కానీ దాని లోపలికి వెళ్తే అసలు సిసలైన మానవ సంబంధాల కహానీ కనిపిస్తుంది. ఒకప్పుడు స్వేచ్ఛకు ప్రతీకగా ఉన్న శృంగారం.. ఇప్పుడు కొత్త తరానికి ఎందుకు అంత ఆచితూచి అడుగుపెట్టే విషయంగా మారింది? మిలీనియల్స్ “అనుభవించండి” అని ఎందుకు చెప్పారు? జెన్-జెడ్ “ముందు ఆలోచించుకోండి” అని ఎందుకు అంటోంది? ఈ రెండు తరాల ఆలోచనల మధ్య ఉన్న గ్యాపే ఈ సినిమాని అంత ఆసక్తికరంగా మారుస్తుంది.
సినిమాలో ఒలీవియా వైల్డ్ నటించిన ఎరికా పాత్ర ఒక దశలో.. శృంగారం అనేది మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయగల శక్తి ఉన్న అద్భుతం అంటుంది. కానీ కొద్దిసేపటి తర్వాతే మరో కోణాన్ని చూపిస్తూ.. “శృంగారం జీవితంలో అన్నీ.. అదే సమయంలో ఏమీ కాదు” అని తేల్చిచెప్తుంది.
కార్లీ సియోర్టినో కథను కూడా సరిగ్గా ఇలాగే అర్థం చేసుకోవచ్చు. ఇతరుల పర్సనల్ లైఫ్ కథలను వేటాడుతూ తిరిగిన ఆ రచయిత్రి.. చివరికి తన సొంత జీవితంలోని ఒక సంబంధాన్ని సినిమాగా మలచడానికి 13 ఏళ్లు పట్టింది. కానీ ఆ ప్రయాణంలో మారింది కేవలం ఒక సినిమా కథ మాత్రమే కాదు.శృంగారంను చూసే సమాజ దృక్పథం మారింది.
సంబంధాలను అర్థం చేసుకునే యువత ఆలోచన మారింది. ఒకప్పుడు కేవలం స్వేచ్ఛలా కనిపించినదే.. ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి అడుగుపెట్టాల్సిన విషయంగా మారింది. అందుకే కార్లీ రాసిన ఈ కథ ఇప్పుడు కేవలం ఆమె ఒక్కరి కథగా మిగిలిపోలేదు. ఒక తరం నుంచి మరో తరానికి మారుతున్న ఆలోచనల అద్దంలా నిలిచింది!








