ముస్లిం దేశాలు ఐక్యంగా పోరాడాలి.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ పిలుపు..!
పశ్చిమాసియా యుద్ధం రావణ కాష్టంలా కొొనసాగుతోంది. ఇరాన్ ను పూర్తిగా విధ్వంసం చేస్తే తప్ప , తాము రణరంగం నుంచి తప్పుకోమని అగ్రరాజ్యం పబ్లిగ్గా ప్రకటిస్తోంది. ఓవైపు అమెరికాకు యుద్ధరంగంలో షాకిస్తున్నా.. దేశంలో పరిస్థితి దారుణంగా తయారైన విషయం టెహ్రాన్ నాయకత్వానికి తెలుసు. దీంతో ఈ యుద్ధంలో అమెరికాను ఒంటరి చేయాలన్న తలంపుతో .. గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్నేహహస్తం చాచింది.
ముస్లిం దేశాలన్నీ ఐక్యతతో మెలగాలని పిలుపునిచ్చింది.
ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమ నిజమైన శత్రువుకు వ్యతిరేకంగా ఒకటి కావాలని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాల మధ్య సమైక్యత లేని కారణంగా పాలస్తీనీయులు అంతులేని వ్యథకు గురికావడంతోపాటు పశ్చిమాసియాలో నిరంతర ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాల మధ్య అనైక్యత వాటి శత్రువులకు ప్రయోజనం కలిగిస్తోందని ఖమేనీ అన్నారు. మొహమ్మద్ ప్రవక్త జయంతి వారోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు తన టెలిగ్రామ్ అకౌంట్ నుంచి ఒక సందేశాన్ని విడుదల చేశారు.
ముస్లింల మధ్య ఐక్యత, వివిధ రంగాల్లో వారి మధ్య సహకారం పెంపొందాలని పిలుపునిచ్చారు మొజ్తబా. ‘‘ముస్లింలు ఐక్యంగా ఉంటే పాలస్తీనా ప్రజల్ని అలా నిస్సహాయ స్థితిలో వదిలేసేవారా? గల్ఫ్ ప్రాంత ప్రజలూ, ప్రభుత్వాలూ ఇస్లాం జెండా నీడలో ఏకతాటిపై నిలుచుంటే దుర్మార్గులు వారి భూభాగాలపై కన్నేసేవారా? ఇస్లామిక్ దేశాలను ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలను నేను కోరేది ఒక్కటే. మీ నిజమైన శత్రువు ఎవరో గుర్తించండి. ఆ శత్రువు ప్రణాళికల్ని అర్థం చేసుకొని వాటికి ఎదురు నిలవండి’’ అని మొజ్తబా ఖమేనీ అన్నారు.








