హాలీవుడ్లో టాక్సిక్ ప్రయోగం.. ఆశించిన స్థాయిలో స్పందన కరవు!
ఇండియన్ సినిమా పరిధి రోజురోజుకూ విస్తరిస్తూ పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలో కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను రూపొందించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. ఈ తరహాలోనే శాండిల్‌వుడ్ రాకింగ్ స్టార్ యష్(Yash) నటించిన భారీ యాక్షన్ సినిమా టాక్సిక్(Toxic) కూడా ప్రత్యేకమైన ప్రయోగంగా నిలిచింది. గీతు మోహన్‌దాస్(Geethu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందించి, రెండు వెర్షన్లను అంతర్జాతీయ మార్కెట్లో రిలీజ్ చేశారు. హాలీవుడ్ ఆడియన్స్ ఆకట్టుకునే టార్గెట్ తో ప్రముఖ సంస్థ లయన్స్‌గేట్(Lionsgate) ద్వారా అక్కడ సినిమాను రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.
అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత అమెరికన్ మార్కెట్లో టాక్సిక్ కు వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్ట్ ఇంగ్లీష్ వెర్షన్లో రూపొందిన ఈ సినిమాకు హాలీవుడ్లో చెప్పుకోదగ్గ ఆదరణ లభించలేదని ట్రేడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.150 కోట్ల గ్రాస్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న ఈ సినిమాకి భారత్‌లో హిందీ, తెలుగు, కన్నడ మార్కెట్ల నుంచి మంచి ఓపెనింగ్స్ లభించినప్పటికీ, ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం అమెరికన్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని తెలుస్తోంది. ఈ వెర్షన్‌కు ఒక మిలియన్ డాలర్ల గ్రాస్ కూడా దక్కలేదనే సమాచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇండియన్ సినిమా నుంచి ఒక భారీ సినిమాను నేరుగా ఇంగ్లీష్‌లో రూపొందించి హాలీవుడ్ మార్కెట్లోకి తీసుకెళ్లడం మాత్రం ఇండస్ట్రీ పరంగా డేరింగ్ స్టెప్ గానే చెప్పాలి. అయితే ప్రయోగానికి తగ్గ స్థాయిలో బాక్సాఫీస్ రిజల్ట్ రాకపోవడం మేకర్స్‌కు నిరాశ కలిగించే అంశమే. అదే సమయంలో థియేట్రికల్ ఫలితాలకే ఈ ప్రయత్నాన్ని పరిమితం చేయకుండా, డిజిటల్ రిలీజ్ తర్వాత అంతర్జాతీయ ప్రేక్షకుల్లో టాక్సిక్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓటీటీ ద్వారా సినిమా మరింత విస్తృతమైన గ్లోబల్ ఆడియన్స్‌కు చేరే అవకాశం ఉండటంతో, అక్కడైనా ఈ ప్రయోగాత్మక చిత్రానికి మెరుగైన ఆదరణ లభిస్తుందేమో చూడాలి.








