సీడ్ గణేశుడిని పూజించండి : మెగాస్టార్ చిరంజీవి
ప్రకృతి సంరక్షణ కోసం, పచ్చదనం పెంపుకోసం ఈ సారి అందరూ సీడ్ గణేశుడి (Seed Ganesha)ని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను మెగాస్టార్ తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు. సీడ్ గణేశుడిని పూజించి ఆ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేయడం వల్ల, వినాయకుడు మొక్కై ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తాడని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green India Challenge)ను ఓ యజ్ఞంలా భావించి ఇప్పటికే 20 కోట్ల మొక్కలు నాటేలా లక్షల మందిని ప్రోత్సహించిన సంతోష్, అభినందనీయుడని, ఆయన దీక్షకు తమ వంతు తోడ్పాలు ఉంటుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ (Santosh Kumar) పాల్గొన్నారు.








