ఈ నగరంలో మిడిల్ క్లాస్ వాళ్లకు ఇల్లు అమ్మరు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మహానగరం మీకు ఉద్యోగం ఇస్తుంది. జీతం ఇస్తుంది. మెట్రో ఇస్తుంది. ఫ్లైఓవర్ ఇస్తుంది. షాపింగ్ మాల్ ఇస్తుంది. వీకెండ్లో వెళ్లడానికి కేఫ్ కూడా ఇస్తుంది.
ఒక్క ఇల్లు మాత్రం ఇవ్వదు.
మహానగరాలు ఇప్పుడు పేదవాళ్లను మాత్రమే తరిమేయడం లేదు. మధ్యతరగతిని కూడా నెమ్మదిగా బయటికి పంపిస్తున్నాయి. తలుపు దగ్గరికి వచ్చి “వెళ్లిపోండి” అని చెప్పడం లేదు. అంతకంటే మర్యాదగా ఒక మాట చెబుతున్నాయి.
“మీ బడ్జెట్‌కు ఇక్కడ ఇల్లు లేదు.”
అవును…అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్తగా కడుతున్న ఇళ్లలో మధ్య తరగతి వెతికే రూ.40 లక్షలలోపు బడ్జెట్ లో ఉన్నవి ఇప్పుడు కేవలం 6 శాతం మాత్రమే.
మిగిలిన 94 శాతం ఇళ్లు అవి ఖాళీగా ఉండొచ్చు. అవి కొనటానికి ఎవరూ రాకపోవచ్చు.
కానీ మధ్య తరగతి వారికి మాత్రం అవి అందుబాటులో ఉండవు.ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ కు ఇల్లు కొనే సత్తా ఉండచ్చు. కానీ వారి బడ్జెట్ కు తగ్గ ఇళ్ల మాత్రం దొరకటం లేదు.అదే భారతీయ రియల్ ఎస్టేట్ లోని ఇంట్రస్టింగ్ విషయం. మిడిల్ క్లాస్ కు బిల్డర్లు చాలా మర్యాదగా ఓ సలహా చెబుతున్నారు. “ఇల్లు కావాలా? తప్పకుండా కొందురు గానీ. ముందు మీ ఆదాయాన్ని కొంచెం అప్‌గ్రేడ్ చేసుకోండి.”
నాలుగేళ్లలో మధ్యతరగతి ఎక్కడికి వెళ్లిపోయింది?
2022లో దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో కొత్తగా కడుతున్న ఇళ్లలో 85 శాతం రూ.1.5 కోట్లలోపే ఉండేవి. అంటే అప్పట్లో బిల్డర్‌కు మధ్యతరగతి కూడా ఒక కస్టమరే.
2026కి వచ్చేసరికి ఆ వాటా 47 శాతానికి పడిపోయింది. మధ్యతరగతి మార్కెట్లో సగం కంటే ఎక్కువ చోటు కోల్పోయింది. అదే సమయంలో రూ.1.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్య ఇళ్ల వాటా 14 శాతం నుంచి 44 శాతానికి పెరిగింది. రూ.4 కోట్లకు పైగా ఇళ్ల వాటా 1 శాతం నుంచి 9 శాతానికి పెరిగింది.
అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక గొప్ప పరిష్కారం కనుగొంది.
మధ్యతరగతికి కొనే స్దోమత లేకపోతే..వాళ్ల కోసం ఇళ్లు ఎందుకు కట్టాలి? ఇది వ్యాపారపరంగా అద్భుతమైన లాజిక్. మధ్యతరగతికి మాత్రం ఈ లాజిక్ నచ్చకపోవచ్చు.
ఇక్కడ బిల్డర్లను కూడా తప్పుపట్టలేం.
ఎందుకంటే రూ.3 కోట్లు పెట్టి ఇల్లు కొనేవాళ్లు ఉన్నారు. రూ.4 కోట్లు పెట్టి ఇల్లు కొనేవాళ్లు కూడా ఉన్నారు. స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్ లు , కంపెనీల ఉన్నతాధికారులు, అధిక ఆదాయం ఉన్న వృత్తి నిపుణులు, విదేశాల్లో ఉన్న భారతీయులు, ఎన్నారైలు.. వీళ్లకు ప్రీమియం ఇళ్లు కావాలి.
ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. అందుకే ధరలు పెరిగాయి!
ఇప్పుడు అసలు కామెడీ ఇక్కడ మొదలవుతుంది. 2026 రెండో త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 6 శాతం తగ్గాయి. సాధారణంగా ఏదైనా వస్తువు అమ్మకాలు తగ్గితే ఏం జరుగుతుంది? ధర తగ్గిస్తారు. రియల్ ఎస్టేట్ మాత్రం కొంచెం ప్రత్యేకమైన మార్కెట్. అమ్మకాలు తగ్గాయి. కొత్త ఇళ్ల ప్రారంభాలు 6-7 శాతం పెరిగాయి. అలాగే ధరలు? మరో 7 శాతం పెరిగాయి. అంటే కొనుగోలుదారు “ధర ఎక్కువగా ఉంది.. కొంచెం ఆగుతాను.” అన్నప్పుడల్లా మార్కెట్: “సరే. మీరు ఆగండి.ఈ లోగా మేము ధర పెంచుకుంటాం.” అంటుంది. ఇది కూడా ఒక వ్యాపార వ్యూహమే.
కొనేవాళ్లు ఆలోచిస్తున్నారు.. బిల్డర్లు టవర్లు కడుతున్నారు
ఇల్లు కొనేవాడు ఇప్పుడు చాలా క్లారిటీగా ఉన్నాడు. “ఇప్పుడే కొనాలా?”, మరి కొన్ని నెలలు ఆగుదామా?”, ఉద్యోగం పరిస్థితి ఎలా ఉంటుంది?”, “AI నా ఉద్యోగాన్ని ఏం చేస్తుంది?”, “పశ్చిమాసియా పరిస్థితులు ఎలా మారతాయి?” ఇలా అనేక లెక్కలు వేస్తూ, ఇలా ఆలోచిస్తూ ఉండగా..
బిల్డర్ కూడా కొన్ని ఆలోచనలు చేస్తున్నాడు. “భూమి కొన్నాం.”, “అనుమతులు తెచ్చాం.”, “నిర్మాణం మొదలుపెట్టాం.”, “ఇప్పుడు ఆపితే ఖర్చు.”
ఇలా ఇద్దరూ తమ తమ ఆలోచనలు తాము చేసుకుంటున్నారు. ఒకరు EMI గురించి ఆలోచిస్తున్నారు. మరొకరు ROI గురించి ఆలోచిస్తున్నారు. ఇళ్లు అమ్ముడవ్వడం లేదు. అయినా ఇళ్లు చాలానే ఉన్నాయి. అందుకే మార్కెట్లో మరో అద్భుతమైన సంఖ్య వచ్చింది.
అమ్ముడుకాని, అందుబాటులో ఉన్న ఇళ్ల నిల్వ ఏడాదిలో 10 శాతం పెరిగి 6.16 లక్షలకు చేరింది. ఇన్ని ఇళ్లు ఉన్నప్పుడు సాధారణ మనిషి అడగొచ్చు: “అయితే మా బడ్జెట్లో ఒక్కటి ఇవ్వొచ్చుగా?”. కానీ అదే కష్టం. అమ్ముడవటం లేదని మీ బడ్జెట్ దిగి నష్టపోయి ఇచ్చేయలేము కదా అంటున్నారు.
ఇళ్లు ఉన్నాయి.
మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు సరిపోయేవి లేవు. ఇదో కొంచెం కొత్త రకం కొరత. హైదరాబాద్‌ను తీసుకోండి. కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. భూముల ధరలు పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. ప్రీమియం ప్రాజెక్టులు వస్తున్నాయి. అమ్ముడుకాని ఇళ్ల నిల్వ కూడా ఉంది. అలాగని రూ.40-50 లక్షల బడ్జెట్‌తో వెళ్లి “కొత్త 2BHK ఉందా?” అని అడిగితే..మాత్రం మొండి చేయే.
ఫైనల్ గా..
నగరాలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి బయటకు వెళ్తోంది. ఇది ఇండియన్ రియల్ ఎస్టేట్ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం. నగరాల్లో ఉద్యోగాలు పెరుగుతున్నాయి
కంపెనీలు వస్తున్నాయి. మెట్రోలు వస్తున్నాయి. ఫ్లైఓవర్లు వస్తున్నాయి. ఐటీ పార్కులు వస్తున్నాయి. మాల్స్ వస్తున్నాయి. కొత్త అపార్ట్మెంట్లు వస్తున్నాయి. అన్నీ వస్తున్నాయి. ఒక్క విషయం మాత్రం కొంచెం కష్టమవుతోంది.
ఇక్కడే అదే సిటీలో పనిచేసే వ్యక్తి ఇక్కడే ఇల్లు కొనడం. అందుకే నగరం ఒక కొత్త పరిష్కారం చూపుతోంది. ఇల్లు నగరంలో కొనలేకపోతున్నారా? పర్లేదు. నగరం బయట కొనండి. ఆఫీసు నగరంలోనే ఉంటుంది. పిల్లల స్కూల్ నగరంలోనే ఉంటుంది. మీ ఇల్లు మాత్రం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా ఒక రకమైన పట్టణ ప్రణాళికే.
అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ కి సొంత ఇల్లు ఉంటుంది. దాన్ని ఆస్వాదించడానికి ఇంటికి చేరేసరికి రాత్రి అవుతుంది.
సో…నగరానికి ఇళ్లు కావాలి. ఇళ్లకు మాత్రం మధ్యతరగతి వాళ్ళు అక్కర్లేదు.








