సెప్టెంబర్ 9న గ్లోబల్ ఎన్నారై టీడీపీ కేంద్ర కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం : అధ్యక్షుడు డా. పిల్ గురురాజా వెల్లడి
గ్లోబల్ ఎన్నారై టీడీపీ కేంద్ర కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సెప్టెంబర్ 9న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎన్నారై తెదేపా కేంద్ర కమిటీ అధ్యక్షుడు డా. పిల్ గురురాజా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనఆరఐ టీడీపీ విభాగాల సమన్వయాన్ని బలోపేతం చేయడం, పార్టీ అంతర్జాతీయ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కేంద్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎన్నారై సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారు.
కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ పిల్ గురురాజా, జనరల్ సెక్రటరీలుగా డాక్టర్ కిషోర్ బాబు చలసాని (ఐర్లాండ్), గంగాధరరావు బొడ్డు (యూకె), డాక్టర్ తులసీకుమార్ ముక్కు (యుఎఇ), వైస్ ప్రెసిడెంట్లుగా జయరామ్ కోమటి(అమెరికా), సురేష్ పుట్టగుంట(అమెరికా), ఇంద్రసేన నాయుడు మద్దిపట్ల(జర్మనీ), శ్యామ్ ప్రసాద్ కోడూరి(ఆస్ట్రేలియా), రషీదా షేక్(కువైట్) తదితరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు కార్యదర్శులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ప్రతినిధుల రిజిస్ట్రేషన్, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు నివాళి, తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రసంగాల అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.









