వెయ్యి రోజుల రేవంత్ మార్క్ పాలన! మైలేజ్ ఎవరికి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు పాలనా సంస్కరణలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలతో సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనను దాటుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు.. అటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూనే, ఇటు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టే ద్వంద్వ వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2025-26 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరి జాతీయ సగటు కంటే 91 శాతం అధికంగా నమోదు కావడం ద్వారా తమ ఆర్థిక క్రమశిక్షణను కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద, ప్రజల ముందు గట్టిగా చాటుకుంటోంది.
రాష్ట్రంలో కీలకమైన గ్రామీణ, రైతు ఓటుబ్యాంకును నిలుపుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు కీలక నిర్ణయాలు అమలు చేసింది. 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయడంతో పాటు, రైతు భరోసా కింద రూ. 36,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇవ్వడం, గత యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టింది.
మహిళా సాధికారత ద్వారా శాశ్వత ఓటుబ్యాంకును నిర్మించుకునే క్రమంలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఇప్పటివరకు 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు జరగగా, పేద మహిళలకు సుమారు రూ. 11,000 కోట్ల మేర ప్రయాణ ఖర్చులు ఆదా అయ్యాయి. దీనికితోడు 43 లక్షల కుటుంబాలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లకు ఒక్కో లబ్ధిదారునికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం, 15 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ ద్వారా మొత్తం 3.38 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించడం రేవంత్ రాజకీయ పునాదిని మరింత బలోపేతం చేశాయి.
కులగణన సర్వే నిర్వహణ, ఎస్సీ వర్గీకరణ అమలు, విద్య – ఉద్యోగాలు – రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేయడం ద్వారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సంప్రదాయ బహుజన సామాజిక సమీకరణాలను తిరిగి జోడించే వ్యూహాత్మక రాజకీయ అడుగు వేశారు. నిరుద్యోగుల అసంతృప్తి గత ప్రభుత్వ ఓటమికి కారణమన్న స్పృహతో.. డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయ కొలువులతో సహా మొత్తం 72,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 65 ఐటీఐలు, 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను తెరపైకి తెచ్చారు. విద్యా ప్రమాణాల సూచీలో తెలంగాణను 28వ స్థానం నుంచి 18వ స్థానానికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం, కొత్తగా 2,000 పడకల ఉస్మానియా ఆస్పత్రి, 3 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, డ్రగ్స్‌పై పోరుకు ఈగల్, కల్తీ నిరోధానికి టీజీ-సేఫ్, మండల స్థాయికి ప్రజావాణి విస్తరణ వంటివి పరిపాలనపై పట్టును చాటాయి.
ఇక అభివృద్ధి రంగంలో 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డు, 6,092 కి.మీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్లు, 122.9 కి.మీ మేర హైదరాబాద్ మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవనం ద్వారా బ్రాండ్ హైదరాబాద్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. టీజీ-ఐపాస్ ద్వారా రూ. 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ద్వారా రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్, భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ హబ్‌ల దిశగా రేవంత్ సర్కారు దూకుడు పెంచింది.
మొత్తంగా చూస్తే.. మొదటి వెయ్యి రోజుల్లో సంక్షేమ పథకాలు, భారీ మౌలిక వసతుల ద్వారా ప్రభుత్వం మైలేజ్ సాధించినప్పటికీ, పెరిగిన సంక్షేమ వ్యయం, నిధుల సర్దుబాటు, ప్రాజెక్టుల భూసేకరణ, అమలులో వేగం వంటివి రానున్న రోజుల్లో రేవంత్ ప్రభుత్వానికి ప్రధాన రాజకీయ, ఆర్థిక సవాళ్లుగా నిలవనున్నాయి. ఈ వెయ్యి రోజుల ప్రగతి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పార్టీలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ ఎదురులేని ఆధిపత్యాన్ని తెచ్చిపెడుతుందా లేదా అనేది విపక్షాల ప్రతిఘటన, రాబోయే ఫలితాలే తేల్చనున్నాయి.








