వెలిగొండకి వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి: వైఎస్ షర్మిల..!
వెలిగొండ పై(Veligonda) చంద్రబాబువి కొండంత అబద్ధాలు అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అని వైఎస్ షర్మిల(Ys Sharmila) ఆరోపించారు. వెలిగొండ పనులు 82 శాతం పనులు పూర్తి చేసింది వైఎస్ హయాంలోనే అని ఆమె స్పష్టం చేసారు. కేవలం 10 శాతం పనులు చేసి సంకల్పం, సాకారం అని చంద్రబాబు డబ్బా కొట్టడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేసారు. 3 దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ.. ఇది శుభసూచకమేనన్నారు. తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకనైనా సాగు, త్రాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దాం అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు.
ఎటొచ్చి ఇక్కడ మరొక్క సారి నిర్ద్వంద్వంగా.. స్మరించుకోవలసింది మహానేత డాక్టర్ వైఎస్సార్ ఆశయం, కృషిని అన్నారు ఆమె. వెలిగొండకు వెలుగు ఆయనే అని.. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం అని స్పష్టం చేసారు. కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి వైఎస్ ఆర్ పాలనలోనే జరిగాయని తెలిపారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు నేడు అందుతుందంటే.. నాడు అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ ఫలితమే అని గుర్తు చేసుకున్నారు.
కట్టిన కష్టం వైఎస్ ది.. రాజకీయ ప్రచారం చంద్రబాబుది అంటూ విమర్శించారు. సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5 న, బాబు వేసింది కేవలం ఓ రాయి మాత్రమే అని అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా, అడ్వైజరీ కమిటీల పేరుతో, డీపీఆర్ ల ముసుగులో 9 ఏళ్ల కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదు అని విమర్శించారు. శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదు అని మండిపడ్డారు. రాయి నుంచి కరువు సీమకు జలవసంతం వెనుక వైఎస్ దే భగీరథ ప్రయత్నమన్నారు. 2004 లో అధికారంలో వచ్చిన వెంటనే మహానేత మొదలు పెట్టిన బ్రహోత్తర సంకల్పం అని, చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా.. రీ డిజైన్ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు అంటూ షర్మిల పేర్కొన్నారు.








