భారత్ కు అమెరికా పెట్టుబడుల వరద…!
భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. తీవ్ర అనిశ్చితి కాలంలోనూ తనదైన పనితీరుతో ప్రపంచవ్యాప్త ఆర్థిక నిపుణులు, విమర్శకులను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో పెట్టుబడిదారులు సైతం భారత్ వైపు పెట్టుబడుల వరద పారిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా నుంచి భారత్ కు పెట్టుబడులు తరలివస్తున్నాయి.
భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ మరింత పెరిగింది. 2025 చివరి నాటికి భారత సెక్యూరిటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 390 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.33 లక్షల కోట్లకు సమానం. అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా విడుదల చేసిన ప్రాథమిక గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా పెట్టుబడుల విలువ 383 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాదిలో మరో 7 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే దాదాపు 1.8 శాతం వృద్ధి నమోదైంది. అమెరికా పెట్టుబడులను ఎక్కువగా భారత స్టాక్ మార్కెట్లోనే పెట్టింది. 2025 చివరికి భారత ఈక్విటీల్లో అమెరికా పెట్టుబడుల విలువ 380 బిలియన్ డాలర్లుగా ఉంది. 2024లో ఇది 373 బిలియన్ డాలర్లు.
భారత దీర్ఘకాలిక రుణ పత్రాల్లో అమెరికా పెట్టుబడులు 11 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇవి 10 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్వల్పకాలిక రుణ పత్రాల్లో పెట్టుబడులు 500 మిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయి.
అమెరికా పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కూడా ఇదే ర్యాంక్‌లో ఉంది. భారత్‌లో అమెరికా పెట్టుబడులు 390 బిలియన్ డాలర్లు కాగా.. చైనాలో 318 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చైనాతో పోలిస్తే భారత్‌లో అమెరికా పెట్టుబడులు 72 బిలియన్ డాలర్లు అధికం. దక్షిణ కొరియాలోని 384 బిలియన్ డాలర్ల కంటే కూడా భారత్ స్వల్పంగా ముందుంది.








