మనిషి నిజంగానే మాయమైపోగలడా? వివేకానంద చెప్పిన ‘మాయ’ రహస్యం
—సూర్య ప్రకాష్ జోశ్యుల
అప్పట్లో వివేకానంద అమెరికాలోని న్యూయార్క్ సమీపంలో ఒక ఆశ్రమంలో కొంతకాలంగా బస చేస్తున్నారు. అక్కడ ఆయన యోగా గురించి, మాయ గురించి, బ్రహ్మజ్ఞానం గురించి తన శిష్యులతో గంటల తరబడి మాట్లాడేవారు. కానీ ఆయన చెప్పే ప్రతిదాన్నీ ఇక్కడ మన భక్తులలా కళ్లు మూసుకుని నమ్మేసే వాళ్లు కాదు.
వాళ్లకు ఒక అలవాటు ఉంది. ఏదైనా చెప్పారా… వెంటనే ప్రశ్నలు! “అది ఎలా సాధ్యం?”, “దానికి కారణం ఏమిటి?, “సైన్స్ ప్రకారం చెప్పగలరా?”
అలా ఒకరోజు మాటల్లో మాటగా యోగుల శక్తుల విషయం వచ్చింది. శిష్యులు వివేకానందను అడిగారట.
“యోగులకు నిజంగా అదృశ్యమయ్యే శక్తి ఉంటుందా?”
అలాగే “ఒక యోగి తనకు చాలా దూరంలో జరుగుతున్న విషయాలను ఎలా తెలుసుకోగలడు? సర్వాంతర్యామిత్వం అంటే అసలు ఏమిటి?” ఇలాంటి ప్రశ్నలతో వర్షం కురిపించారు.
ఈ ప్రశ్నలకు సాధారణంగా ఎవరైనా ఏమని సలహా చెప్తారు? “అది దైవశక్తి” అని అనేసి ఊరుకుంటారు. కానీ వివేకానంద అలా చెప్పలేదట. వాళ్లకు అర్థమయ్యే విధంగా… కాంతి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.
మనకు ఏదైనా వస్తువు ఎందుకు కనిపిస్తుంది? ఈ ప్రశ్నకు మనం సాధారణంగా పెద్దగా ఆలోచించం. ఎందుకంటే అది మన కళ్ల ముందే ఉంది కాబట్టి కనిపిస్తోందని అనుకుంటాం. కానీ అసలు విషయం అంత సింపుల్ కాదు. మన ముందు ఒక టేబుల్ ఉందనుకుందాం. దానిపై కాంతి పడుతుంది. ఆ కాంతి తిరిగి మన కంటికి చేరుతుంది. అప్పుడే మనకు ఆ టేబుల్ కనిపిస్తుంది.
సరే… ఆ కాంతి మన కంటికి చేరకుండా పోతే? టేబుల్ అక్కడే ఉన్నా మనకు కనిపించదు. దీన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ పుస్తకం కూడా అవసరం లేదు.
సపోజ్…రాత్రి కరెంటు పోయిందనుకోండి. మీ గదిలో ఉన్న ఆ టేబుల్, కుర్చీ, బీరువా కనపడవు. అంటే అవన్నీ ఎక్కడికీ వెళ్లలేదు. కానీ చీకట్లో మీకు కనిపించవు. అంటే అవి మాయమైపోయినట్లా? కాదు కదా..అక్కడే ఉన్నాయి. కేవలం మీ కంటికి కనిపించడం లేదు, అంతే. కనిపించకపోతే… అది లేనట్టుగా భావించలేం కదా?
ఈ పాయింట్ దగ్గరే వివేకానంద చెప్పిన ‘మాయ’ విషయం అర్దం అవటం మొదలవుతుంది. మనకు కనిపించనిది లేదని మనం చాలా సార్లు అనుకుంటాం. కానీ గాలిని మీరు ఎప్పుడైనా చూశారా? లేదు. అయినా గాలి ఉందని తెలుసు. మీ మొబైల్‌కు సిగ్నల్ వస్తుంది. కానీ ఆ సిగ్నల్‌ను మీరు కళ్లతో చూడగలరా? చూడలేరు. అయినా అది ఉంది. అంటే మన కళ్లకు కనిపిస్తున్న ప్రపంచమే మొత్తం ప్రపంచం కాదన్న మాట.
మన కళ్లు ఎంత వరకు చూడగలవో, మనం అంత వరకే చూస్తాం. మన చెవులు ఎంత వరకు వినగలవో, మనం అంత వరకే వింటాం. మనకు తెలియని, మన ఇంద్రియాలకు అందని ఎన్నో విషయాలు ఉండవచ్చు. అందుకే వివేకానంద చెప్పిన ‘మాయ’ను ఒక రకంగా ఇలా అర్థం చేసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నదే అంతా అని అనుకోవడమే అసలు పొరపాటు.
యోగులు నిజంగానే అదృశ్యమవుతారా?
ఆధ్యాత్మిక గ్రంథాలలో కొంతమంది మహాయోగులకు అసాధారణమైన శక్తులు ఉంటాయని ఉంటుంది. సాధారణ మనుషులు చేయలేని పనులు చేయగలరని, ప్రకృతిపై కూడా కొంత నియంత్రణ సాధించగలరని భారతీయ యోగ సంప్రదాయంలో విశ్వాసం ఉంది.
వివేకానంద కూడా మాయాశక్తి గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ కథలో మెలిక ఇక్కడే ఉంది. ఆయన కేవలం మాట్లాడి ఊరుకోలేదు.
తాను బస చేస్తున్న ఆశ్రమంలోని ఒక గదిలో తన శిష్యులతో మాట్లాడుతున్న సమయంలో, యోగశక్తి గురించి వివరిస్తూ ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూపించారు అని చెప్తారు.
అక్కడ ఉన్నవారి కళ్ల ముందే వివేకానంద కొద్దిసేపు కనిపించకుండా మాయమయ్యారని చెబుతారు.అలా శిష్యులకు మాయ గురించి ప్రాక్టికల్ గా చూపించారని చెప్తారు..








