AI ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుంది? పరిశోధనలో బయటపడిన విషయం ఇదే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“దేవుడు ఉన్నాడా?”
“నా జీవితానికి అసలు అర్థం ఏమిటి?”
“నేను చేస్తున్నది తప్పా? ఒప్పా?”
ఇలాంటి సందేహాలు వస్తే ఒకప్పుడు మనిషి పెద్దవాళ్లను, గురువులను, పూజారులను లేదా మత పెద్దలను అడిగేవాడు. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. ఫోన్ తీసి ChatGPTని అడిగే వారి సంఖ్య పెరుగుతోంది.
కానీ ఇక్కడే అందరికీ ఒక డౌట్ వస్తోంది. ఈ టెక్నాలజీ బాస్… ఏ మతాన్నయినా ప్రత్యేకంగా సపోర్ట్ చేస్తుందా? లేక అందరినీ ఒకేలా చూస్తోందా? అసలు ఈ డిజిటల్ గురువుల వెనుక కథేంటి!
ఏఐకి దేవుడి మీద నమ్మకం ఉంటుందా?
ముందు మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఏఐకి ఏ మతం మీదా ప్రేమ లేదు, పగ లేదు. దానికి గుడికి వెళ్లే అలవాటూ లేదు, ప్రార్థనలు చేసేటంత సీనే లేదు. అది కేవలం మనం ఇచ్చిన డేటా నుంచి, మనుషులు నేర్పించిన లెక్కల ప్రకారమే మనకు ఆన్సర్లు ఇస్తుంది.
కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది! ఏఐకి సొంత మతం లేకపోయినా, అది ఇచ్చే సమాధానాలు మాత్రం పూర్తిగా న్యూట్రల్‌గా ఉంటున్నాయా అంటే కొంచెం డౌటే. దానికి ఏ పుస్తకాలు చదివించారు, ఎటువంటి రూల్స్ పెట్టి కోడింగ్ చేశారనే దాన్నిబట్టి దాని మాటతీరు మారుతుంటుంది. అంటే ఏఐ ఏ మతాన్ని ఇష్టపడుతుందనేది ముఖ్యం కాదు… దాని వెనుక ఎవరి ఆలోచనలు, ఏ లాజిక్స్ పనిచేస్తున్నాయనేదే అసలు పాయింట్!
“బాధగా ఉంది భయ్యా” అంటే… మతం గుర్తురాదా?
రీసెంట్గా ‘CEFE AI’ అనే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొన్ని పెద్ద ఏఐ మోడళ్లను పట్టుకుని ఓ టెస్ట్ చేసింది. మనుషులకు వచ్చే దుఃఖం, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, నైతికత లాంటి కష్టాల మీద ప్రశ్నలు వేసి చూశాయి.
అప్పుడు ఆసక్తికరమైన నిజం బయటపడింది! మనుషులను అడిగితే “దేవుడి మీద భారం వేయండి, పూజలు చేయండి, ఆధ్యాత్మిక మార్గం వెతకండి” అని చాలామటుకు మతాన్ని ముడిపెట్టి చెబుతారు. కానీ ఏఐ మాత్రం ఆ మతాల జోలికి పెద్దగా వెళ్లట్లేదు. “బాధగా ఉందా? అయితే సెల్ఫ్-హెల్ప్ బుక్స్ చదవండి, కొత్త గోల్స్ పెట్టుకోండి, లైఫ్‌లో ముందుకుపోండి” అంటూ ఒక లౌకిక (Secular) సలహా ఇచ్చేస్తోంది.
అందుకే మన మత పెద్దలకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! రోజుకో కోటిమంది ఏఐతో మాట్లాడుతుంటే, అది వీళ్ల మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేస్తుందేమోనని వాళ్లు తెగ టెన్షన్ పడుతున్నారు.
అన్ని మతాలను ఒకేలా చూస్తోందా?
అస్సలు లేదు! కొన్ని స్టడీస్‌లో తేలిందేంటంటే, కొన్ని నిర్దిష్ట మతాల గురించి లేదా మత మార్పిణుల గురించి అడిగినప్పుడు ఏఐ కొంత బయాస్‌గా (ఒక వైపు మొగ్గుచూపుతూ) రెస్పాండ్ అవుతోందట. ఇది చూశాక “అరే, ఏఐ ఇస్తున్న సమాధానాలు నిజంగానే నిష్పక్షపాతంగా ఉన్నాయా, లేక దీన్ని తయారుచేసిన కంపెనీల ఐడియాలజీ ఇందులో లీకవుతుందా?” అనే పెద్ద డిబేట్ నడుస్తోంది.
ఇప్పుడు సీన్ రివర్స్… మతాలే ఏఐని మారుస్తున్నాయి!
ఇన్నాళ్లూ “ఏఐ మన మతాలను పక్కన పెడుతోంది” అని భయపడ్డ మత సంస్థలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. ఊరుకుంటాయా మరి? వాటి వాల్యూస్‌ని, నమ్మకాలను ఏఐ మోడళ్లలో ఇమిడ్చే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. వాటికోసం ప్రత్యేకంగా కొన్ని మతపరమైన చాట్‌బాట్స్‌ను కూడా తయారుచేస్తున్నాయి!
భవిష్యత్తులో ఆఫీస్ వర్క్‌కి ఒక ఏఐ, కోడింగ్‌కి ఒక ఏఐ ఉన్నట్టే… ఆధ్యాత్మిక సందేహాలు తీర్చడానికి, మత గ్రంథాలు వివరించడానికి సెపరేట్‌గా “రిలీజియస్ ఏఐ”లు రాబోతున్నాయి. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి కూడా.
ఏఐ గురువు స్థానాన్ని భర్తీ చేయగలదా?
ఖచ్చితంగా లేదనే చెప్పాలి! ఏఐ అనేది వేల పేజీల పుస్తకాలను క్షణంలో వెతికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. కానీ అది మనిషిలాగా అనుభూతి చెందలేదు, మన బాధను పంచుకోలేదు. పైగా కొన్నిసార్లు పిచ్చి పిచ్చి ఆన్సర్లు ఇచ్చి, లేనిపోని తప్పులు కూడా చెప్పేస్తుంది.
అందుకే ఏఐని కేవలం ఒక ఇన్ఫర్మేషన్ టూల్‌గా వాడుకోవడం వరకు ఓకే. కానీ అది చెప్పే ప్రతి మాటే అంతిమ సత్యమని గుడ్డిగా నమ్మేస్తే మాత్రం గోవిందానే!
ఇవన్నీ గమనించిన కాథలిక్ చర్చి, ఇస్లామిక్ సంస్థలు సహా అనేక మతాలకు చెందిన నాయకులు ఇప్పుడు AI కంపెనీలతో మాట్లాడుతున్నారు. వారి అడిగేది ఒక్కటే. “భవిష్యత్తులో ప్రపంచాన్ని AI ప్రభావితం చేయబోతుంటే, అందులో మా విలువలకు చోటు ఉంటుందా?”
ఇదెందుకు అంటే…రోజుకు ఒక్కసారి ఇచ్చే సమాధానం మనిషిని మార్చకపోవచ్చు. కానీ ప్రతిరోజూ మాట్లాడే AI మాత్రం అతని ఆలోచనా విధానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే మత నాయకుల అసలు భయం.
చివరికి AI ఏ మతాన్ని సపోర్ట్ చేస్తుంది?
ఈ ప్రశ్నకు ఇప్పటికైతే ఒకే సమాధానం లేదు. AIకి సొంత మతం లేదు. కానీ అది ఇచ్చే సమాధానాలు పూర్తిగా తటస్థంగా ఉంటాయని కూడా చెప్పలేం. ఎందుకంటే AI ఎలా తయారైంది, దానికి ఏ సమాచారం ఇచ్చారు, ఎలాంటి నియమాలు పెట్టారు అన్నదాన్ని బట్టి దాని సమాధానాలు మారవచ్చు. అందుకే ఇప్పుడు అసలు పోరాటం మొదలైంది.
AI కంపెనీలకు కూడా ఒక పెద్ద సమస్య ఉంది.
ఒక మతం చెప్పే నైతికతను AIలో పెట్టడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా AIని ఉపయోగించే వారిలో… హిందువులు ఉంటారు. ముస్లింలు ఉంటారు.
క్రైస్తవులు ఉంటారు. బౌద్ధులు ఉంటారు. అలాగే ఏ మతాన్ని నమ్మని వారు కూడా ఉంటారు. అయితే… AI ఎవరి విలువలను పాటించాలి? ఇదే అసలు చిక్కు.
AI మతాన్ని మార్చుతుందా? లేక… మతాలే AIని తమకు తగ్గట్టుగా మార్చుకుంటాయా?
ఇవన్ని ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం ఇప్పటికే మారిపోయింది. ఒకప్పుడు దేవుడిని, గురువులను అడిగిన కొన్ని ప్రశ్నలను ఇప్పుడు మనిషి AIని అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలకు AI ఏం సమాధానం చెబుతుందన్నదే… రాబోయే రోజుల్లో మనిషి ఏమి నమ్ముతాడనే విషయంపై కూడా ప్రభావం చూపవచ్చు.
మరి రాబోయే రోజుల్లో టెక్నాలజీ మతాన్ని మారుస్తుందా? లేక మతాలే టెక్నాలజీని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటాయా? కాలమే సమాధానం చెప్పాలి! ఏదేమైనా, ఒకప్పుడు పెద్దలను, పూజారులను అడిగిన ప్రశ్నలను ఇప్పుడు గూగుల్ తల్లినో, ChatGPTనో అడుగుతున్నాం అన్నది మాత్రం పచ్చి నిజం!








