రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ :మంత్రి లోకేష్
జెఎస్ డబ్ల్యు సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తాం
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపడుతున్నాం
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే 3శాతం రిజర్వేషన్
ఎలైట్ ప్లేయర్స్ తో మంత్రి లోకేష్ విందు సమావేశం
అమరావతి: రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జెఎస్ డబ్ల్యు సంస్థ ముందుకు వచ్చిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కామన్ వెల్త్, ఆసియా గేమ్స్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో శుక్రవారం రాత్రి డిన్నర్ మీట్ నిర్వహించారు. ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై క్రీడాకారుల నుంచి సలహాలను స్వీకరించారు. క్రీడాకారుల కుటుంబ నేపథ్యం, ప్రారంభంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం వంటి వాటిపై క్రీడాకారులను వాకబుచేశారు. పలువురు క్రీడాకారులు మాట్లాడుతూ… గతంలో ఆంధ్రప్రదేశ్ లో మంచి కోచ్ లు ఉండేవారని, 2019లో ప్రభుత్వం మారాక వారందరినీ తొలగించారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అప్పట్లో గుంటూరులో చంద్రబాబుగారు విదేశీ కోచ్ లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఏర్పాటుచేశారని అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ… పాలకులు మారినా పాలసీలు మారకూడదన్నారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచస్థాయి అత్యుత్తమ కోచ్ లను ఏపీలో ఏర్పాటుచేసి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తామని అన్నారు. రాష్ట్ర అత్యుత్తమ క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు జెఎస్ డబ్ల్యు సంస్థ అంగీకారం తెలిపింది. ఇందుకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో గ్రిఫిత్ యూనివర్సిటీ విద్యతో క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందిస్తోందని తెలిపారు. అక్కడ కరిక్యులమ్‌ను అథ్లెటిక్స్‌కు అనుగుణంగా రూపొందించారని అన్నారు.
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నామని అన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ ఎరెనా ఉండాలన్నది తమ అభిమతంగా పేర్కొన్నారు. స్పోర్ట్స్ ను ప్రోత్సహించడంపై తల్లిదండ్రుల్లో కూడా అవేర్ నెస్ రావాల్సి ఉందని అన్నారు. ఇందులో భాగంగానే గతఏడాది నిర్వహించిన డీఎస్సీలో తొలిసారిగా క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్ అమలుచేశామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళా క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అన్నారు. విశాఖ క్రికెట్ స్టేడియంలో ఒక స్టాండ్ కు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ పేరుపెట్టామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థుల ఆసక్తిమేరకు వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ… కొరియాలో ఆర్చరీ క్రీడాకారులకు రోబోతో ముందస్తు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో క్రీడాకారులు గాయపడినపుడు రికవరీ చాలా ముఖ్యమని, దీనిపై దేశంలో కొన్నిచోట్ల మాత్రమే రికవరీ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది భారత అథ్లెట్లు 26 జాతీయ రికార్డులను బ్రేక్ చేశారని క్రీడాకారులు చెప్పగా, లోకేష్ అభినందనలు తెలిపారు. సింగపూర్ స్పోర్ట్స్ కాలేజిలో ఎఐ ద్వారా బౌలింగ్ ను కోచ్ లు పర్యవేక్షించడం చూశానని అన్నారు. ఎఐ సాంకేతికతకు ఉపయోగించుకొని అందుకు అనుగుణంగా మారాలని క్రీడాకారులకు సూచించారు. తాము తమ కేడర్ శిక్షణలో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితులు, ఫిట్ నెస్ ను ఎఐ ద్వారా ఎసెస్ చేస్తున్నామని అన్నారు.
ఈ డిన్నర్ మీట్ లో కామన్ వెల్త్, ఆసియా గేమ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు…పివి సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), భవానీ కార్తీక్ (పారా స్విమ్మింగ్), వెంకటరామిరెడ్డి (అథ్లెటిక్స్), ఆర్.స్వాతి (అథ్లెటిక్స్), భవానీ యాదవ్ (అథ్లెటిక్స్), కుసుమ రావాడ (అథ్లెటిక్స్), గణేష్ మణిరత్నం (ఆర్చరీ), రష్మి (అథ్లెటిక్స్), మల్లల అనూష (అథ్లెటిక్స్), శిరీష (అథ్లెటిక్స్), కుంజా రజిత (అథ్లెటిక్స్), యుక్తశ్రీ (ఆర్చరీ), తీర్థుసామదేవ్ (స్విమ్మింగ్) పాల్గొన్నారు.
క్రీడాకారులకు ఆర్థికసాయం మంజూరు
ఈ ఏడాది ఆసియన్ గేమ్స్, కామన్ వెల్త్ గేమ్స్, పారా కామన్ వెల్త్ గేమ్స్ కు ఎంపికైన 18మంది అథ్లెట్ల శిక్షణ కోసం ప్రభుత్వం రూ.2,23,25,000లను విడుదల చేసింది. క్రీడాకారుల అవసరాన్ని బట్టి మరింత సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి రాష్ట్రాన్ని ప్రపంచ క్రీడాపటంలో నిలపాలని మంత్రి లోకేష్ కోరారు.








