వందేళ్ల తర్వాత కూడా ప్రాణాంతకమే, మేడం క్యూరీ నోట్‌బుక్స్‌లో అసలు ఏముంది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఈ ప్రపంచంలో ఒక లైబ్రరీ ఉంది.
అక్కడ ఒక మహిళ రాసిన నోట్‌బుక్స్ ఉన్నాయి. వాటిని చదవాలంటే…
సాధారణ లైబ్రరీ కార్డు సరిపోదు.
ముందుగా ఒక ఫారం మీద సంతకం చేయాలి.
ఎందుకంటే…
ఆ నోట్‌బుక్స్ ఇప్పటికీ మనిషిని చంపగలవు.
ఇది హారర్ సినిమా కథ కాదు. యుద్ధ రహస్యాల కథ అసలే కాదు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధానికి సంబంధించిన పత్రాలు కూడా కావు. మరేంటి అంటే… అవి… ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల సమయంలో చేతితో రాసుకున్న సాధారణ నోట్‌బుక్స్.
ఒక పెన్…
కొన్ని కాగితాలు…
కొన్ని లెక్కలు…
కొన్ని పరిశీలనలు…
అంతే.
కానీ కాలం వాటిని సాధారణ కాగితాలుగా వదిలిపెట్టలేదు. ఒక పుస్తకం అంత ప్రమాదకరంగా ఎలా మారింది?దాని సమాధానం కోసం మనం దాదాపు 130 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి.
1891
ఫ్రాన్స్‌లోని పారిస్. చలితో గడ్డకట్టే ఒక చిన్న అట్టిక్ గది. హీటర్ లేదు. ఆ గదిలో తపస్సు మధ్యలో వదిలేసి వచ్చిన యోగినిలా ఓ అమ్మాయి. సరైన భోజనం లేదు. కొన్నిసార్లు ఆకలితోనే నిద్రపోయేది. ఆ గదిలో ఉన్న ఆమెకి ఒక్కటే కల…
చదవాలి. శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ఆమె పేరు అప్పటికి “మార్యా స్క్లోడోవ్స్కా.” తర్వాత ప్రపంచం ఆమెను మరో పేరుతో పిలిచింది…
మేరీ క్యూరీ.
ఆమెకు అప్పటికి తెలియదు… తాను చేసే ఒక ఆవిష్కరణ లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని. అదే ఆవిష్కరణ ఒక రోజు తన ప్రాణాన్ని కూడా తీసుకుంటుందని.
ప్రేమ… పరిశోధన… ఒక కొత్త పదం పుట్టింది
పారిస్‌లోనే ఆమెకు మరో శాస్త్రవేత్త పరిచయమయ్యాడు. అతనే పియర్ క్యూరీ. ప్రేమ వారిని దగ్గర చేసింది.
శాస్త్రం వారిని విడదీయలేని భాగస్వాములుగా మార్చింది. వాళ్ల హనీమూన్ గమ్యం పర్యాటక ప్రదేశాలు కాదు. ప్రయోగశాల. రోజూ గంటల తరబడి ఒక విచిత్రమైన పదార్థాన్ని పరిశీలించేవారు.
యురేనియం.
అది ఎందుకో తనంతట తానే కిరణాలు విడుదల చేస్తోంది. ఆ విచిత్రమైన శక్తికి అప్పటివరకు పేరు లేదు.
ఆ పేరు పెట్టింది మేరీ క్యూరీయే.
“రేడియో యాక్టివిటీ.”
ఆ ఒక్క పదం తర్వాత ప్రపంచ వైద్యశాస్త్రం, అణు భౌతిక శాస్త్రం, క్యాన్సర్ చికిత్స… అన్నీ కొత్త దిశలో ప్రయాణించడం మొదలుపెట్టాయి.
మార్చింది శాస్త్రం కాదు. ఒక ప్రమాదం.
ఆ రోజు ఒక్క క్షణంలో అన్నీ మారిపోయాయి పారిస్ వీధి. ఒక గుర్రపు బండి. ఒక ప్రమాదం. పియర్ క్యూరీ అక్కడికక్కడే మరణించాడు. మేరీ ఒంటరిగా మిగిలింది. ఇద్దరు చిన్న పిల్లలు. అసంపూర్తిగా మిగిలిన పరిశోధన.
ఎవరైనా అయితే అక్కడితో ఆగిపోయేవారు. ఆమె మాత్రం కాదు. భర్త స్థానంలో సోర్బోన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరింది. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలో తొలి మహిళా ప్రొఫెసర్‌గా నిలిచింది.
కానీ…
ఇంకా ఆమె జీవితంలోని అతిపెద్ద అధ్యాయం ఇంకా మొదలుకాలేదు.
కొన్నిసార్లు…
విషాదం ఒక మనిషిని ఆపదు.
మరింత ముందుకు నెడుతుంది.
యుద్ధం… మరణం… ఒక మహిళ వేసిన ప్రశ్న
మొదటి ప్రపంచ యుద్ధం. వేలాది మంది సైనికులు గాయాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. డాక్టర్లకు ఒకే సమస్య. బుల్లెట్ శరీరంలో ఎక్కడ ఉంది? చూసి చెప్పలేరు. తప్పుగా ఆపరేషన్ చేస్తే… రోగి చనిపోతాడు. ఆ రోజుల్లో X-Ray యంత్రాలు ఉన్నాయి. కానీ అవి ఆస్పత్రుల్లోనే ఉన్నాయి. యుద్ధభూమి మాత్రం ఆస్పత్రికి చాలా దూరంలో ఉంది.
మేరీ క్యూరీ ఆ దూరాన్నే తొలగించింది.
అప్పుడు మేరీ క్యూరీ ఒక ప్రశ్న వేసుకుంది.
“రోగిని X-Ray దగ్గరకు తీసుకెళ్లడం ఎందుకు? X-Rayనే రోగి దగ్గరకు తీసుకెళ్దాం కదా?”
ఆ ఒక్క ఆలోచన… వైద్య చరిత్రనే మార్చేసింది. ఆమె కారులోనే X-Ray యంత్రాన్ని అమర్చింది. ప్రపంచంలోని తొలి మొబైల్ X-Ray యూనిట్లు పుట్టాయి. వాటిని తర్వాత “లిటిల్ క్యూరీస్” అని పిలిచారు.
మేరీ…తన టీనేజ్ కుమార్తె ఐరీన్‌తో కలిసి… ఆ వాహనాలను స్వయంగా యుద్ధభూమికి నడిపించింది. వందలాది మహిళలకు శిక్షణ ఇచ్చింది. గాయపడిన సైనికుల శరీరాల్లో బుల్లెట్లు ఎక్కడున్నాయో చూపించింది. చరిత్రకారుల అంచనా ప్రకారం… ఈ మొబైల్ X-Ray యూనిట్లు పది లక్షల మందికిపైగా సైనికుల ప్రాణాలను కాపాడాయి.
ప్రపంచం ఆమెను హీరోగా చూసింది. కానీ… అదే సమయంలో ఇంకో శత్రువు ఆమె శరీరంలో నెమ్మదిగా పెరుగుతోంది.
ఆమెకు అది కనిపించలేదు. ఎవరికి కనిపించలేదు. ఆ రోజుల్లో రేడియేషన్ ప్రమాదాల గురించి ప్రపంచానికి తెలియదు. ఆమె రేడియో యాక్టివ్ పదార్థాలను చేతితో పట్టుకునేది. జేబులో పెట్టుకునేది. డెస్క్ డ్రాయర్లో ఉంచేది. చీకట్లో అవి వెలిగితే ఆశ్చర్యంగా చూసేది. ఆ అందమైన నీలి వెలుగు… నెమ్మదిగా ఆమె రక్తాన్ని మార్చేస్తోందని ఎవరికీ తెలియదు. ఆమెతో సహా. అదే ఈ కథలోని అత్యంత విషాదకరమైన నిజం.
ప్రపంచానికి వెలుగు ఇస్తూ… తన చీకటిని తానే గుర్తించలేకపోయింది. చివరికి ఆమెను చంపింది వ్యాధి కాదు… ఆమె జీవితమే. మనిషిగా ప్రపంచానికి వెలుగు ఇస్తూ… తన చీకటిని తానే గుర్తించలేకపోయింది.
1934
మేరీ క్యూరీ మరణించింది.
మరణానికి కారణం…
ఆమె జీవితమంతా కలిసి పనిచేసిన అదృశ్య శక్తే.
ఆమె లుకేమియాతో వెళ్లిపోయింది.
కానీ ఆమె వదిలిన నోట్‌బుక్స్ మాత్రం వెళ్లలేదు. ఇప్పటికీ అవి ప్రత్యేక లీడ్ బాక్సుల్లోనే ఉన్నాయి. అవి చదవాలంటే ఇప్పటికీ ప్రత్యేక అనుమతులు అవసరం. శతాబ్దం గడిచినా… ఆమె చివరి పరిశోధనలు ఇంకా నిశ్శబ్దంగా తమ ఉనికిని గుర్తు చేస్తూనే ఉన్నాయి.
అపూర్వమైన గుర్తింపు
ఆమె కెరీర్ ముగిసే సమయానికి, ఆమె 15 బంగారు పతకాలు, 19 గౌరవ డిగ్రీలు మరియు రెండు వేర్వేరు సైన్స్ రంగాలలో (1903లో ఫిజిక్స్, 1911లో కెమిస్ట్రీ) రెండు నోబెల్ బహుమతులను సాధించారు. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా ఆమె నేటికీ రికార్డు సృష్టించారు.
ఆమె మాటల్లోనే:
“మనలో ఎవరికీ జీవితం అంత సులభం కాదు. అయితే దానికి పరిష్కారం ఏంటి? మనం పట్టుదలను, అన్నింటికంటే మిన్నగా మనపై మనకు నమ్మకాన్ని కలిగి ఉండటమే.” “జీవితంలో దేనికీ భయపడకూడదు. దాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాలి.”
చివరగా…
ఈరోజు మనం X-Ray తీసుకుంటే… అది కొన్ని నిమిషాల వ్యవహారం. రిపోర్ట్ చేతిలోకి వస్తుంది. మన జీవితంలో అది ఒక చిన్న పరీక్ష మాత్రమే. కానీ… ఈ సాధారణ పరీక్ష వెనుక ఒక అసాధారణ జీవితం ఉంది. ఆకలిని భరించిన ఒక విద్యార్థిని. భర్తను కోల్పోయినా ఆగని ఒక శాస్త్రవేత్త. యుద్ధభూమిలో యంత్రాలను నడిపిన ఒక మహిళ.
తాను కనుగొన్న శక్తి తననే నెమ్మదిగా చంపుతోందని తెలియకుండానే చివరి వరకు పరిశోధన చేసిన ఒక మనిషి.
బహుశా… అందుకే ఆమెకు దక్కిన గొప్ప గుర్తింపు రెండు నోబెల్ బహుమతులు.
ప్రపంచంలోని ప్రతి X-Ray గదిలో…
ఆమె కనిపించకపోయినా…
ఆమె చేసిన త్యాగం మాత్రం ఇప్పటికీ ఉంది.








