23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత ప్రభుత్వం
ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దానిలో భాగంగా పాక్ కేంద్రంగా నడుస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయబా, దాని అనుబంధ సంస్థలకు చెందిన 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద వారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నామని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
వీరిపై ఉగ్రవాద నియామకాలు, చొరబాటు, శిక్షణ, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, జమ్మూకశ్మీర్‌లో దాడుల ప్రణాళికలో పాల్గొన్నారనే ఆరోపణలున్నట్టు హోంశాఖ తెలిపింది. తాజా ప్రకటనతో కేంద్రం గుర్తించిన పాక్ ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.
హోంశాఖ ప్రకటించిన జాబితాలో లష్కర్ వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్‌కు అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న అబ్దుల్ రవూఫ్, హఫీజ్ ఖలీద్ వలీద్, రానా ఇఫ్తిఖార్ పేర్లు ఉన్నాయి. అలాగే 2016 నాగ్రోటా ఆర్మీ క్యాంప్‌పై జరిగిన ఉగ్రదాడి, 2018 సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్‌పై దాడులతో సంబంధమున్న మరికొందరూ ఈ జాబితాలో ఉన్నారు.








