అప్పులపై లడాయి… ఎవరి మాట నిజం?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల లెక్కలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. అసలు రాష్ట్ర అప్పులు రూ.1.86 లక్షల కోట్లా? లేక రూ.8.21 లక్షల కోట్లా? అనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. ఇరు పార్టీలు సాక్ష్యాధారాలు, ఆర్బీఐ లెక్కలను తెరపైకి తెస్తూ తామే కరెక్ట్ అని వాదిస్తున్నాయి.
మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆర్బీఐ గణాంకాలను, స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటనలను ఉటంకిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వాదన ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు భారీగా అప్పులు చేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు వాట్సాప్ లేఖ ప్రకారం ఈ అప్పు రూ.1,77,058 కోట్లు కాగా, 2026 జూన్ 30 నాటికి ఆర్బీఐ అధికారిక లెక్కల ప్రకారం అది రూ.1,86,067 కోట్లకు చేరింది. వివిధ మార్గాల ద్వారా ఈ ప్రభుత్వం మొత్తంగా రూ.4.5 లక్షల కోట్ల వరకు అప్పులు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో నేరుగా తీసుకున్న రుణాలు, ప్రభుత్వ గ్యారెంటీతో పొందిన కార్పొరేషన్ రుణాలు కలిపి మొత్తం రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని అసెంబ్లీ వేదికగా తాము నిరూపించామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 2026 మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఎఫ్ఆర్బీఎం, ఇతర అన్ని రకాల రుణాలు కలిపి రాష్ట్ర అప్పులు రూ.3,47,294 కోట్లుగా ప్రకటించారని, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏకంగా రూ.8.21 లక్షల కోట్లు అని ఏ విధంగా చెప్తారని హరీశ్‌రావు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సందర్భాన్ని బట్టి అబద్ధపు లెక్కలు మారుస్తున్నారని ఆయన విమర్శించారు.
మరోవైపు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టారు. గత ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నడిచిందని, సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ బ్యాంకులు, సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలు, చెల్లించాల్సిన బకాయిలు అన్ని కలిపి రాష్ట్రంపై ఏకంగా రూ.8,21,651 కోట్ల భారీ భారాన్ని మోపిందిని చెప్పారు. గత ప్రభుత్వం దాదాపు 10 శాతం వరకు అధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తెచ్చిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.34 వేల కోట్లుగా ఉన్న వార్షిక వడ్డీ భారాన్ని ప్రణాళికాబద్ధంగా రూ.11 వేల కోట్లకు తగ్గించామని, ఇప్పటికే రూ.2.08 లక్షల కోట్ల పాత అప్పుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు.
ఇరుపక్షాల వాదనలను పరిశీలిస్తే, లెక్కల వైరుధ్యం ఎక్కడ వస్తోందో స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ కేవలం బడ్జెట్ పరిధిలోని అప్పులు, ఎఫ్ఆర్బీఎం పరిమితులను మాత్రమే ప్రామాణికంగా చూపిస్తోంది. అందుకే వారి లెక్క రూ.3.47 లక్షల కోట్ల నుంచి రూ.4.17 లక్షల కోట్ల మధ్య ఉంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బడ్జెటేతర రుణాలు, అంటే కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం వివిధ కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పులు, సివిల్ సప్లైస్ బకాయిలు, పవర్ డిస్కామ్‌ల నష్టాలు, ఇతర పెండింగ్ బిల్లులన్నింటినీ కలిపి సుమారు రూ.8.21 లక్షల కోట్లుగా లెక్కిస్తోంది.
సాంకేతికంగా ఆర్బీఐ నిబంధనల ప్రకారం నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ఉన్న అప్పుల విషయంలో బీఆర్ఎస్ చూపిస్తున్న రూ.1.86 లక్షల కోట్ల తాజా అప్పుల గణాంకాలు, గత అంచనాలు వాస్తవమే అయినప్పటికీ.. కార్పొరేషన్ల గ్యారెంటీల ద్వారా రాష్ట్రంపై పడిన పరోక్ష అప్పుల భారాన్ని పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ చెబుతున్న రూ.8.21 లక్షల కోట్ల సంఖ్య కూడా వాస్తవ ఆర్థిక భారాన్ని ప్రతిబింబిస్తోంది. ఎవరు కరెక్ట్ అన్నది వారు ఏ అప్పులను ప్రామాణికంగా తీసుకుంటున్నారనే దానిపైనే ఆధారపడి ఉంది. ఏదేమైనా, ఈ లెక్కల లడాయి తేలాలంటే ఇరుపక్షాలు సవాళ్లకు పరిమితం కాకుండా, ఒకే వేదికపై శ్వేతపత్రాలతో బహిరంగ చర్చకు రావలసి ఉంది.








