చికెన్ నెక్ పై చైనా కన్ను.. ‘తీస్తా’ పునరుద్ధరణలో చైనా అడుగు..!
భారత్ చుట్టూ డ్రాగన్ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికై చైనా చేతుల్లోకి పాక్ వెళ్లిపోయింది. అటు నేపాల్ సైతం చైనా వైపు అడుగులేస్తోంది. శ్రీలంకలో ఏకంగా ఓ షిప్ యార్డును వాడుకుంటోంది. ఇక అత్యంత కీలకం, భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లోనూ చైనా వేళ్లూనుకుంటోంది. దీనికి నిదర్శనమే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ చైనా పర్యటన. ఈ పర్యటనలో ‘తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు’ (టీఆర్‌సీఎంఆర్‌పీ) సాధ్యాసాధ్యాల అధ్యయనం (ఫీజిబిలిటీ స్టడీ) కోసం ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
తూర్పు హిమాలయాల్లో ఉద్భవించి సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లో ప్రవహించే 414 కిలోమీటర్ల తీస్తా నది నీటి పంపకాలపై భారత్, బంగ్లాదేశ్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, భారత రక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చైనా ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ సమయంలో ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చేందుకు భారత్ కూడా ప్రతిపాదించింది.
కానీ హసీనా హఠాత్తుగా గద్దె దిగడం, ఆ తర్వాత వచ్చిన మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కాలంలో చర్చలు నిలిచిపోవడంతో భారత్ ప్రతిపాదన మూలన పడింది. తాజాగా అధికారంలోకి వచ్చిన బీఎన్పీ ప్రభుత్వం మళ్లీ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 140 మిలియన్ క్యూబిక్ మీటర్ల పూడికతీత, 171 చదరపు కిలోమీటర్ల భూసేకరణ, 224 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో కూడిన ఈ భారీ ప్రాజెక్టును చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘పవర్ చైనా’ చేపట్టబోతోంది. ఈ సంస్థకు చైనా సైన్యంతోనూ, కమ్యూనిస్ట్ పార్టీ భౌగోళిక రాజకీయ లక్ష్యాలతోనూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
భారత సరిహద్దుకు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల లోపే ఉన్న ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల మోహరింపు భారత్‌కు రక్షణ ముప్పుగా పరిణమించనుంది. చైనా జోక్యంతో తీస్తా నది కేవలం సాంకేతిక నీటి వివాదంగా మిగలకుండా తీవ్రమైన భద్రతా సమస్యగా మారుతుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్, చైనాల నుంచి భారత్ ఇప్పుడు ఈశాన్య సరిహద్దుల్లో ఒకేసారి రెండు వైపుల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. తీస్తా ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్‌కు తెలియజేశామని, సరిహద్దుల్లో జరుగుతున్న అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటూనే తమ తదుపరి వ్యూహాలు ఉంటాయని స్పష్టం చేశారు.








