సింధూజలాల వాటా కోసం ప్రయత్నాలు..! పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ..!
సింధూ జలాల ఒప్పందాన్ని (IWT) భారత్ పక్కనబెట్టడంతో .. పాకిస్తాన్ లో జలయుద్ధాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా సింధు, పంజాబ్, సహా పలు రాష్ట్రాలు నీటికొరతతో ఇక్కట్లు పడుతున్నాయి. దీంతో ఇది తమకు జీవనాడి అని.. దీన్ని రద్దు చేసే అధికారం భారత్ కు లేదని వాదిస్తోంది పాకిస్తాన్. ఇటీవలి కాలంలో పాక్ మంత్రులు .. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకరేమో యుద్ధం చేస్తామంటే.. మరొకరేమో చేతులు, కాళ్లు నరికేస్తామంటున్నారు. అయితే వీటిని భారత్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఈ పరిణామంతో పాక్ ఆర్మీ సీన్ లోకి ఎంటరైంది. ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన సింధూ జలాల వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని 276వ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ (Pakistan Army) తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఆసిమ్ మునీర్ (Asim Munir) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధూ జలాల కోసం పోరాడుతామని సైన్యం తెలిపింది. 2025 ఏప్రిల్ 24 నాటి జాతీయ భద్రతా కమిటీ (NSC) ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సింధూ జలాలను ఆపే ఎటువంటి ప్రక్రియనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని తెలిపింది.
నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని..సింధూ జలాల ఒప్పందం (Indus Treaty) చట్టబద్ధంగా అమల్లోనే ఉందని, దాన్నెవరూ రద్దు చేయలేరని భారత్‌పై అక్కసు వెల్లగక్కింది. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ (India), పాకిస్థాన్‌ల మధ్య 1960లో ఈ ఒప్పందం (Indus Treaty) జరిగింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది. 2028 జూన్ నాటికి సింధు నదీ జలాల ప్రవాహాన్ని పాకిస్థాన్‌కు పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పాక్ మంత్రులు, అధికారులు దీనిపై స్పందిస్తూ.. భారత్‌పై ఆరోపణలు చేస్తున్నారు.








