ఒబామా టార్గెట్ గా ట్రంప్ వివాదాస్పద పోస్ట్.. !
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి మాజీ అధ్యక్షుడు ఒబామాను టార్గెట్ చేశారు. ఒబామా దంపతులు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఎక్కుతున్నట్లు మార్ఫింగ్ చేసిన ఫోటోను ట్రంప్.. తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో పంచుకున్నారు. ఆ చిత్రంలో విమానంపై గ్రాఫిటీ, రాజకీయ నినాదాలు, ఇతర పదాలను చేర్చడం చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ షేర్ చేసిన చిత్రంలో ఒబామా దంపతులు నవ్వుతూ విమాన మెట్లపై నిలబడి చేతులు ఊపుతున్నట్లుగా కనిపిస్తారు. వారి వెనక ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానంపై ‘యెస్ వి క్యాన్’, ‘ఒబామా’, ‘బీఎల్ఎం’ (బ్లాక్ లైవ్స్ మ్యాటర్) వంటి పదాలను గ్రాఫిటీ రూపంలో చూపించారు. అలాగే అరబిక్ భాషలో ‘అల్హమ్దులిల్లాహ్’ అనే పదాన్ని కూడా చేర్చారు. అంటే దేవునికి ధన్యవాదాలు అని అర్ధం. ఈ చిత్రం పూర్తిగా మార్ఫింగ్ చేసినదిగా అమెరికా మీడియా తెలిపింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టు విస్తృత చర్చకు దారితీసింది. జాతి వివక్షను ప్రోత్సహించే సంకేతాలు ఉన్నాయంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా గ్రాఫిటీని నేరాలు, పట్టణాల క్షీణతతో ముడిపెడుతూ గతంలో నల్లజాతి ప్రజలపై వివక్షపూరిత ప్రచారంలో ఉపయోగించారని విమర్శకులు గుర్తుచేస్తున్నారు.
ట్రంప్ చేసిన తాజా పోస్టు, ఇటీవల ఆయన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఉపయోగించడం ప్రారంభించిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఖతార్ బహుమతిగా అందించిన బోయింగ్ 747-800 విమానాన్ని ప్రత్యేకంగా మార్పులు చేసి అధ్యక్ష విమానంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే విమానాన్ని మార్ఫింగ్ చేసి పోస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
గతంలోనూ ఒబామాపై వివాదాస్పద పోస్టులు
బరాక్ ఒబామాపై ట్రంప్ గతంలోనూ పలుమార్లు వ్యక్తిగత విమర్శలు చేశారు. ఒబామా అమెరికాలో జన్మించలేదంటూ నిరాధార ఆరోపణలు చేయడం నుంచి, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేయడం వరకు అనేక సందర్భాల్లో ఆయన విమర్శలకు గురయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘బ్లాక్ హిస్టరీ మంత్’ సందర్భంగా ఒబామా దంపతులను కోతుల రూపంలో చూపించిన మార్ఫింగ్ చిత్రాన్ని కూడా ట్రంప్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టుపై తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు. అయితే ఆ పోస్టు తన సిబ్బంది పొరపాటున ప్రచురించారని తర్వాత వివరణ ఇచ్చారు.








