రివర్స్ ట్విస్ట్: చైనాకే భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతి.. నమ్మలేకపోతున్నారా? అయితే ఇది చదవండి
—సూర్య ప్రకాష్ జోశ్యుల
“అరే… ఎలక్ట్రానిక్స్ అంటే చైనావాళ్లేరా. వాళ్లతో మనం పోటీ పడగలమా?”
కొన్నేళ్ల క్రితం వరకు టీ షాపుల దగ్గరైనా, ఉద్యోగాల గురించి మాట్లాడుకునే యువతలోనైనా, టెక్నాలజీ చర్చల్లోనైనా తరచూ వినిపించిన మాట ఇదే. అలాగే మొబైల్ కొంటే చైనా… టీవీ కొంటే చైనా… ల్యాప్‌టాప్ కొంటే చైనా… పిల్లల బొమ్మల నుంచి పెద్ద పరిశ్రమల్లో వాడే పరికరాల వరకు “మేడ్ ఇన్ చైనా” కనిపించడం సహజమైపోయింది.
దీంతో చాలామందిలో మరో భావన కూడా బలపడింది. “మనవాళ్లు సాఫ్ట్‌వేర్‌లోనే టాప్… హార్డ్‌వేర్ తయారీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ మన వల్ల కాదు!” కానీ… చరిత్రలో కొన్ని మార్పులు నెమ్మదిగా వస్తాయి. వచ్చాక మాత్రం ప్రపంచం మొత్తం వెనక్కి తిరిగి చూసేలా చేస్తాయి.
ఇప్పుడు అలాంటి మార్పే భారత్‌లో కనిపిస్తోంది.
ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌ను… ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది.
అదొక్కటే కాదు…
ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామిగా పేరున్న చైనాకే గత ఏడాది రూ.35 వేల కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రానిక్ కంపోనెంట్లను భారత్ ఎగుమతి చేసిందని కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.
కొనేవాళ్లం… ఇప్పుడు అమ్మేవాళ్లం!
ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? రైల్వే ఎలక్ట్రానిక్స్ కావాలన్నా… అధునాతన PCBలు కావాలన్నా… చిప్స్ కావాలన్నా… విదేశాల వైపు చూడాల్సి వచ్చేది. అంటే… మనం కొనేవాళ్లం.
ఇప్పుడు?
ప్రపంచ మార్కెట్‌కు సరఫరా చేసే స్థాయికి భారత్ ఎదుగుతోంది. అంటే… ఇప్పుడు మనం అమ్మేవాళ్లం. అదే ఈ కథలోని అసలు రివర్స్ ట్విస్ట్.
రైలు మెదడే పెద్దది!
ఇప్పటి ఆధునిక రైలును కేవలం ఇంజిన్ లాగదు. దాన్ని నడిపించేది స్మార్ట్ ఎలక్ట్రానిక్స్.
ఆటోమేటిక్ బ్రేకింగ్…
సిగ్నలింగ్…
డ్రైవర్ అసిస్టెన్స్…
GPS…
కమ్యూనికేషన్…
ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్…
ఫైర్ సేఫ్టీ…
ఇవన్నీ కలిపి రైలుకు “మెదడు”లా పనిచేస్తాయి. అందుకే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన ప్రకారం, ఒక ఆధునిక రైలు తయారీ ఖర్చులో దాదాపు 40 శాతం ఇప్పుడు ఎలక్ట్రానిక్స్‌కే వెళ్తోంది.
అంటే… రైలుకు ఇంజిన్ గుండె అయితే… ఎలక్ట్రానిక్స్ దాని మెదడు. ఆ మెదడును తయారు చేసే సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది.
స్క్రూడ్రైవర్ నుంచి సూపర్ పవర్ వరకు!
అప్పట్లో … భారత్ కేవలం విదేశాల నుంచి వచ్చిన పార్ట్స్‌ను అసెంబుల్ చేసే దేశమే అన్న విమర్శలు వచ్చేవి.
దాన్నే “స్క్రూడ్రైవర్ టెక్నాలజీ” అని కూడా పిలిచేవారు. అయితే మంత్రి చెప్పిన వివరాల ప్రకారం తయారీ రంగంలో మూడు దశలు ఉంటాయి.
మొదటిది — పూర్తయిన ఉత్పత్తులను అసెంబుల్ చేయడం.
రెండోది — మాడ్యూల్స్ తయారు చేయడం.
మూడోది — కంపోనెంట్లు, మల్టీలేయర్ PCBలు, సెమీకండక్టర్లు వంటి డీప్ టెక్నాలజీ తయారీ.
భారత్ ఇప్పుడు ఈ మూడో దశలోకి వేగంగా అడుగుపెడుతోందని ఆయన పేర్కొన్నారు.
వందే భారత్… దేశం మారిన దారిది!
ఈ మార్పుకు అతిపెద్ద ఉదాహరణ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. భారత ఇంజినీర్లు రూపొందించిన ఈ రైలులో భారీ స్థాయిలో దేశీయ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఉపయోగించారు. ఇది కేవలం ఒక రైలు కాదు… “ఇక్కడే డిజైన్ చేయగలం… ఇక్కడే తయారు చేయగలం” అని ప్రపంచానికి చెప్పిన భారత సామర్థ్యానికి ప్రతీక.
ఫ్యాక్టరీల జోరు… ఉద్యోగాల హోరు!
ఎలక్ట్రానిక్స్ రంగం విస్తరణతో దేశంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం…
ప్రస్తుతం ఈ రంగంలో సుమారు 25 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.
75కు పైగా ఎలక్ట్రానిక్స్ కంపోనెంట్ ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయి.
వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో మరో 250 ఫ్యాక్టరీలు ప్రారంభం కానున్నాయి.
దీంతో లక్షలాది మంది యువతకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
చిన్న బోర్డు… పెద్ద మార్పు!
మీ మొబైల్ ఓపెన్ చేస్తే కనిపించే ఆకుపచ్చ రంగు బోర్డు గుర్తుందా? అదే PCB… Printed Circuit Board.
రైలు నుంచి రాకెట్ వరకు…
కారు నుంచి కంప్యూటర్ వరకు…
PCB లేకుండా ఏ ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరం పనిచేయదు. ఇన్నాళ్లూ వీటిలో పెద్ద భాగం విదేశాల నుంచే దిగుమతి అయ్యేది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ వంటి ప్రాంతాల్లో అత్యాధునిక మల్టీలేయర్ PCB తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.
దీంతో సుమారు రూ.40 వేల కోట్ల విలువైన దిగుమతులను దేశీయ ఉత్పత్తితో భర్తీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
చిప్‌లో చైతన్యం… భవిష్యత్తులో భారతం!
మొబైల్‌కు మెదడు చిప్. కారుకు మెదడు చిప్. రైలుకు మెదడు కూడా చిప్. అందుకే India Semiconductor Mission కింద సుమారు రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులతో 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ చిప్స్ భవిష్యత్తులో రైల్వే, ఆటోమొబైల్, రక్షణ, పారిశ్రామిక రంగాలకు కీలకంగా మారనున్నాయి.
అమెరికా నుంచి చైనా వరకు… భారత్ వైపు చూపు!
ఒకప్పుడు ప్రపంచం చైనాను చూసేది. ఇప్పుడు ప్రపంచం మరో ప్రత్యామ్నాయాన్ని వెతుకుతోంది. అలాంటి సమయంలో అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలకు రైల్వే ఎలక్ట్రానిక్స్ ఎగుమతి చేస్తూ…
చైనాకే ఎలక్ట్రానిక్ కంపోనెంట్లు సరఫరా చేసే స్థాయికి భారత్ చేరడం… దేశీయ తయారీ రంగంలో వచ్చిన మార్పుకు నిదర్శనంగా ప్రభుత్వం పేర్కొంటోంది.
ఇది కేవలం ఎగుమతి కాదు… భారత ఆత్మవిశ్వాసానికి చిరునామా!
ఒకప్పుడు…
“ఇది మన వల్ల కాదు.” “చైనాతో పోటీ అసాధ్యం.” “హార్డ్‌వేర్ తయారీ వాళ్లదే.” అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు… భారత ఇంజినీర్లు ప్రపంచ స్థాయి రైళ్లకు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ రూపొందిస్తున్నారు. భారత ఫ్యాక్టరీలు అత్యాధునిక కంపోనెంట్లు తయారు చేస్తున్నాయి. భారత కంపెనీలు ప్రపంచ సరఫరా గొలుసులో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి.
అవును… ప్రయాణం ఇంకా చాలా ఉంది. చైనా ఇప్పటికీ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో అతిపెద్ద శక్తుల్లో ఒకటి. కానీ ఒకప్పుడు పూర్తిగా దిగుమతులపై ఆధారపడిన భారత్, ఇప్పుడు అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్ కంపోనెంట్లను ప్రపంచ మార్కెట్లకు — చైనా సహా — ఎగుమతి చేసే స్థాయికి రావడం మాత్రం చిన్న విషయం కాదు.
ఒకప్పుడు ప్రపంచం “మేడ్ ఇన్ చైనా” గురించి మాట్లాడేది.
ఇప్పుడు…
“మేడ్ ఇన్ ఇండియా” కూడా ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌పై తన ముద్ర వేస్తోంది.








