మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. మైక్రోసాఫ్ట్, టాటా కామ్స్ సముద్ర గర్భంలో ఏఐ కారిడార్..!
అంతర్జాతీయ టెక్నాలజీ మరియు టెలికాం రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతపు అగ్రగామి ఏఐ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్ ‘లైట్‌స్టార్మ్’ (Lightstorm)తో పాటు గ్లోబల్ టెక్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ (Microsoft), సింగపూర్‌కు చెందిన ‘సింగ్టెల్’ (Singtel), మరియు భారతీయ దిగ్గజం ‘టాటా కమ్యూనికేషన్స్’ (Tata Communications) ఒక్కటయ్యాయి. భారతదేశం, మలేషియా, మరియు సింగపూర్ దేశాలలోని ‘AI రీజియన్లను’ అనుసంధానించేలా అత్యంత ప్రతిష్టాత్మకమైన సబ్‌మెరైన్ (సముద్ర గర్భ) కేబుల్ వ్యవస్థ నిర్మాణానికి ఈ కంపెనీల కూటమి అధికారికంగా ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ ప్రాజెక్టుకు ‘I-2SEA’ అని పేరు పెట్టారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ భారతదేశ తూర్పు తీరంలో వేగంగా ఎదుగుతున్న ఎల్ఐ, హైపర్‌స్కేలర్ డేటా సెంటర్ హబ్‌లైన హైదరాబాద్ మరియు చెన్నై నగరాలను.. అటు సింగపూర్, మలేషియా (కౌలాలంపూర్)లోని ప్రధాన క్లౌడ్ ఇంటర్‌కనెక్ట్ జోన్లతో నేరుగా అనుసంధానించనుంది. భారత్ లో దీనికి రెండు ల్యాండింగ్ పాయింట్లు ఉంటాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం కాగా, రెండవది దక్షిణ చెన్నై. మచిలీపట్నం ల్యాండింగ్ పాయింట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐ క్లస్టర్లకు అత్యంత వేగవంతమైన, తక్కువ ల్యాటెన్సీ కలిగిన సబ్‌సీ కనెక్టివిటీ లభించనుంది.
దీనివల్ల లైట్‌స్టార్మ్ వినియోగదారులు భారతదేశంలోని 30,000 కిలోమీటర్లకు పైగా ఉన్న టెరెస్ట్రియల్ నెట్వర్క్ మరియు 80కి పైగా డేటా సెంటర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. దాదాపు 3,600 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ ‘I-2SEA’ కేబుల్ సిస్టమ్ 2029 నాల్గవ త్రైమాసికం నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. లైట్స్టార్మ్కు చెందిన ‘స్మార్ట్‌నెట్ ఏఐ ఫ్యాబ్రిక్’ సాంకేతికతను దీనికి అనుసంధానించడం ద్వారా లో-జిట్టర్, లాస్-ఆప్టిమైజ్డ్ డేటా రవాణా సాధ్యమవుతుంది. ఈ కేబుల్ వ్యవస్థకు సముద్రంలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకు అత్యంత సురక్షితమైన రూట్ ప్లానింగ్‌తో పాటు, ఏకంగా మూడు మీటర్ల లోతున కేబుల్‌ను పాతిపెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అంతర్జాతీయంగా పేరుగాంచిన ‘ఎన్ఈసీ కార్పొరేషన్’ ను సిస్టమ్ సప్లయర్‌గా, అలాగే ‘ఆసియాన్ కేబుల్‌షిప్’ కంపెనీని మెరైన్ ఇన్స్టాలేషన్ పార్ట్నర్గా నియమించుకున్నారు. గ్లోబల్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ మరియు ఇన్ఫరెన్స్ వర్క్‌లోడ్స్ రన్ చేసే భారీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇది ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్ కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కెపాసిటీ కమిట్మెంట్లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయని కంపెనీల కూటమి ప్రకటించింది.








