భారత్‌కు అమెరికా భారీ గుడ్ న్యూస్!… ట్రంప్ టీమ్ కీలక ప్రకటన!
–సూర్య ప్రకాష్ జోశ్యుల
కొడుకుకు ఉద్యోగం…
వ్యాపారానికి కొత్త మార్కెట్…
మన దేశానికి లక్షల కోట్ల పెట్టుబడులు.
వినడానికి ఇవన్నీ వేర్వేరు విషయాల్లా అనిపించినా… వీటి వెనుక ఒకే బంధం ఉంది.
అదే భారత్-అమెరికా సంబంధం.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తితో మన బంధం బలపడితే… దాని ప్రభావం కేవలం ఢిల్లీలోని అధికారుల మీద కాదు. హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువకుడి నుంచి, విజయవాడలో చిన్న పరిశ్రమ నడుపుతున్న వ్యాపారి వరకు అందరిపైనా పడుతుంది.
కానీ… గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా భిన్నమైన కథ వినిపించింది.
“అమెరికా ఇక ఇండియాను పట్టించుకోవడం లేదు.”
“ట్రంప్ వచ్చాక భారత్‌కు డోర్ క్లోజ్ అయిపోయింది.”
“చైనానే ఇప్పుడు అమెరికాకు ముఖ్యం.”
యూట్యూబ్ వీడియోలు… సోషల్ మీడియా పోస్టులు… రాజకీయ చర్చలు… ఎక్కడ చూసినా ఇదే ప్రచారం. ఈ వార్తలు చూసి చాలామంది నిజంగానే ఒక డైలమోలో పడ్డారు. “అమెరికా నిజంగానే భారత్‌కు దూరమవుతోందా?” అని. అయితే… ఇప్పుడు అమెరికానే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. అదీ రాజకీయ నాయకుడి ద్వారా కాదు… భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ ద్వారా.
“సోషల్ మీడియాలో కనిపించే ప్రచారాన్ని కాదు… వాస్తవాలను చూడండి. భారత్-అమెరికా సంబంధాలు ఎప్పటికంటే బలంగా ఉన్నాయి” అని ఆయన స్పష్టంగా ప్రకటించారు.
అంతేకాదు… ఈ మాటలకు బలం చేకూర్చేలా ట్రేడ్ డీల్, AI, రక్షణ, పెట్టుబడులు, రెండు దేశాల భవిష్యత్ భాగస్వామ్యంపై కీలక సంకేతాలు కూడా ఇచ్చారు.
అసలు అమెరికా ఎందుకు ఇంత స్పష్టంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది? సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారంలో నిజమెంత? భారత్-అమెరికా బంధం మరింత బలపడితే… దాని వల్ల సామాన్య భారతీయుడికి నిజంగా కలిగే లాభమేంటి?
ఇంత అకస్మాత్తుగా ఎందుకీ క్లారిటీ?
“సోషల్ మీడియాలో ఏమి రాస్తున్నారో కాదు… వాస్తవాలు చూడండి. భారత్-అమెరికా సంబంధాలు ఎప్పటికంటే బలంగా ఉన్నాయి.” ఈ ఒక్క వ్యాఖ్య… ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే ఇంత అకస్మాత్తుగా ఎందుకీ క్లారిటీ? అనే ప్రశ్న మాత్రం అందరి ముందు నిలిచింది. దీనికి ఒకటే కారణం ఉంది. ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… భారత్‌పై టారిఫ్‌ల చర్య . ట్రేడ్ ఒప్పందం ఆలస్యం. రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాలు. చైనాతో అమెరికా వ్యూహాత్మక పోటీ…ఇలా వరసపెట్టి సోషల్ మీడియాలో ఒక కథను బలంగా నెట్టాయి.
“అమెరికా ఇప్పుడు భారత్‌ను పక్కన పెడుతోంది.”
యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్టులు, రాజకీయ చర్చలు… ఎక్కడ చూసినా ఇదే నారేటివ్. ఇప్పుడు అదే ప్రచారానికి అమెరికా అధికారికంగా కౌంటర్ ఇచ్చింది.
మాటలు కాదు… అమెరికా చూపించిన లెక్కలు ఇవే!
“సంబంధాలు బాగున్నాయి” అని చెప్పడం ఒక విషయం. కానీ సెర్జియో గోర్ చెప్పింది మాత్రం సంఖ్యలు.
20 ఏళ్ల క్రితం రెండు దేశాల వాణిజ్యం 20 బిలియన్ డాలర్లు.
ఇప్పుడు అది 220 బిలియన్ డాలర్లకు చేరింది.
ఇక లక్ష్యం… 500 బిలియన్ డాలర్లు.
ఒక్కసారి ఆలోచించండి… ఎవరితోనైనా సంబంధం చెడిపోతుంటే… వాణిజ్యం 11 రెట్లు పెరుగుతుందా? అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు.
సామాన్యుడికి దాంతో లాభమేంటి?
ఇదే అసలు విషయం. అమెరికా-భారత్ బంధం బలపడితే లాభం కేవలం ఢిల్లీకి కాదు… మీ ఇంటికీ వచ్చే అవకాశం ఉంది. ఎలా?
అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడితే… కొత్త కంపెనీలు వస్తాయి. కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఐటీ మాత్రమే కాదు… ఎలక్ట్రానిక్స్, ఫార్మా, డేటా సెంటర్లు, చిప్ డిజైన్ వంటి రంగాల్లో కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది.
AIలో భారత్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్
ప్రపంచం మొత్తం ఇప్పుడు AI చుట్టూనే తిరుగుతోంది. ఇలాంటి సమయంలో… భారత్‌ను అమెరికా నమ్మకమైన AI భాగస్వామిగా ప్రకటించడం సాధారణ విషయం కాదు. దీని అర్థం… రాబోయే టెక్నాలజీ యుద్ధంలో భారత్‌ను అమెరికా కీలక భాగస్వామిగా చూస్తోందన్న మాట.
ట్రేడ్ డీల్ పూర్తైతే…
ఈ ఒప్పందం చివరి దశకు చేరిందని అమెరికా చెబుతోంది. ఇది పూర్తయితే… భారత ఎగుమతులు పెరగొచ్చు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవకాశాలు పెరగొచ్చు. విదేశీ పెట్టుబడులు మరింత ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. అంటే…దేశ ఆర్థిక వ్యవస్థ బలపడితే… దాని ప్రభావం ఉద్యోగాలు, జీతాలు, వ్యాపారాలపై కూడా కనిపించే అవకాశం ఉంటుంది.
ట్రంప్ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పారు?
సెర్జియో గోర్ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. ట్రంప్‌కు భారత్‌పై ఇప్పటికీ ప్రత్యేక అభిమానం ఉందని…
మళ్లీ భారత్‌కు రావాలనే ఆసక్తి కూడా ఉందని వెల్లడించారు. ఇది కేవలం మర్యాద మాట కాదు. ట్రంప్ పరిపాలనలో కూడా భారత్‌కు ప్రాధాన్యం కొనసాగుతుందనే రాజకీయ సంకేతంగా చాలామంది విశ్లేషిస్తున్నారు.
అలాగే భారత్‌తో అమెరికా… ప్రపంచంలో ఏ దేశంతోనూ చేయనన్ని రక్షణ ఒప్పందాలు చేస్తోంది. అంటే…
సంబంధం కేవలం వ్యాపారంతో ఆగిపోలేదు. టెక్నాలజీ… రక్షణ… AI… పెట్టుబడులు… ప్రతి రంగంలోనూ రెండు దేశాలు మరింత దగ్గరవుతున్నాయని అమెరికా చెప్పే ప్రయత్నం చేసింది.
ఏదైమైనా…
ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు… శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. ఈరోజు అమెరికాకు భారత్ అవసరం కావచ్చు. రేపు భారత్‌కు అమెరికా అవసరం కావచ్చు. కానీ అసలు ప్రశ్న అది కాదు.
నిజంగా ఈ స్నేహం నిజంగానే 500 బిలియన్ డాలర్ల ఆర్థిక భాగస్వామ్యంగా మారితే… గెలిచేది కేవలం రెండు ప్రభుత్వాలు కాదు… ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువకుడు, ఎగుమతులపై ఆధారపడిన చిన్న పరిశ్రమ, కొత్త అవకాశాల కోసం కలలు కంటున్న భారత ఆర్థిక వ్యవస్థ కూడా.
అందుకే… ఇది ఇద్దరు నాయకుల కథ కాదు. రాబోయే దశాబ్దంలో భారతదేశం ఎక్కడ నిలబడబోతోందో చెప్పే కథ.








