ఇజ్రాయెల్ ను అదుపులో పెట్టండి…. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..!
పశ్చిమాసియాలో శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికాకు ఇరాన్ వార్నింగిచ్చింది.తమ అధినేత , సుప్రీంలీడర్ మొజ్తబాను.. మరణశిక్షకు అర్హుడంటూ.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తాను పెంచి పోషిస్తున్న, తన పెంపుడు శక్తి అయిన ఇజ్రాయెల్‌ను అదుపులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. లేకపోతే ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.
పశ్చిమాసియాలో ఘర్షణలకు ముగింపు పలికేందుకు కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత అమెరికాపైనే ఉందన్నారు అరాగ్చీ. ఇజ్రాయెల్ చర్యల్ని నియంత్రించడం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా మాట వినకపోతే ఇరానే ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెబుతుందని అరాగ్చీ ఓ పోస్టులో స్పష్టం చేశారు.
అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ఖతార్ రాజధాని దోహాలో ఇరు దేశాల అధికారులు చర్చలు నిర్వహిస్తున్నారు. ఖతార్, పాకిస్థాన్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారు కుష్నర్ నేరుగా చర్చల్లో పాల్గొనడం లేదు. అయితే, చర్చలకు ముందు ఖతార్ ప్రధానితో సమావేశమై, తదుపరి సమావేశాలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం.








