‘Inception’ సినిమానే నిజమవుతోందా? ప్రపంచాన్ని కుదిపేస్తున్న AI ‘తెలివి’ దొంగతనం కథ!
సూర్య ప్రకాష్ జోశ్యుల..
‘Inception’లో కలలను దొంగిలించారు… ఇప్పుడు AI ‘తెలివి’ని కాపీ చేస్తున్నారనే ఆరోపణలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి!
2010లో వచ్చిన Inception సినిమాలో దొంగలు బ్యాంకులను దోచుకోరు. వాళ్లు మనుషుల మెదళ్లలోకి చొరబడి… ఆలోచనలను దొంగిలిస్తారు. ఆ సినిమా చూసినప్పుడు…
“ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం…” అనుకున్నాం. కానీ పదహారు సంవత్సరాల తర్వాత… నిజ జీవితంలో కూడా దానికి దగ్గరగా వినిపించే ఆరోపణలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.
ఈసారి దొంగిలించిందీ బంగారం కాదు.
డబ్బు కాదు.
డేటా కాదు.
ఏకంగా Artificial Intelligence ‘ఆలోచించే విధానం’నే కాపీ చేస్తున్నారంటూ అమెరికాలోని ప్రముఖ AI కంపెనీలు ఆరోపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే… ఎవరూ సర్వర్‌ను హ్యాక్ చేయలేదు. రహస్య కోడ్లను ఎవరూ దొంగిలించలేదు. డేటాబేస్లు లీక్ కాలేదు. అయినా… వందల బిలియన్ డాలర్లు ఖర్చు చేసి నిర్మించిన AIకి దగ్గరగా ఉండే మరో AI ఎలా పుట్టింది? ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది.
ఒక తాత్విక ప్రశ్నతో మొదలుపెడదాం.
“జ్ఞానానికి యజమాని ఎవరు?” దాన్ని మొదట సృష్టించినవాడా? లేక… దాన్ని చూసి నేర్చుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లినవాడా? మానవ నాగరికత మొత్తం ఈ రెండు శక్తుల మీదే నిర్మించబడింది. ఒకరు కనిపెడతారు. మరొకరు నేర్చుకుంటారు. అలాంటప్పుడు నేర్చుకోవడం ఎప్పుడు దొంగతనంగా మారుతుంది? ఇప్పుడు AI ప్రపంచం అదే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ..ఒక చిన్న ఉదాహరణ. మీరు పదేళ్లు కష్టపడి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని ఎవరూ కాపీ చేయలేదు. మీ కంప్యూటర్ను ఎవరూ హ్యాక్ చేయలేదు. మీ ఫైల్‌ను ఎవరూ దొంగిలించలేదు. కానీ… ఎవరో ఆ పుస్తకాన్ని వందలసార్లు చదివి… మీ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని… అదే స్థాయిలో మరో పుస్తకం రాశారు.
ఇప్పుడే అసలైన ప్రశ్న…
అది స్ఫూర్తా?
లేక మేధోసంపత్తి దొంగతనమా?
సరిగ్గా ఇదే…ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ AI కంపెనీలు కూడా ఇలాంటి ప్రశ్ననే లేవనెత్తుతున్నాయి.
వాటి ఆరోపణ ఏమిటంటే… కొన్ని కంపెనీలు శక్తివంతమైన AI మోడళ్లను లక్షల, కోట్ల సార్లు ప్రశ్నలు అడిగి, వాటి సమాధానాల నుంచే నేర్చుకుని తమ సొంత AI మోడళ్లను తయారు చేస్తున్నాయనేది. ఈ విధానాన్ని టెక్నికల్‌గా AI Distillation అంటారు. పేరు వినటానికి,పలకటానికి కాస్త క్లిష్టంగా ఉన్నా, అర్దం అవ్వటం సులభమే.
ఇవి కూడా చదవండి
ఒక విషయం గమనించారా?
మళ్లీ Inception సినిమా దగ్గరకు వద్దాం. ఆ సినిమాలో దొంగలు మెదడులోకి వెళ్లి… ఒక ఆలోచనను దొంగిలించరు. ముందు… ఆ మనిషి ఎలా ఆలోచిస్తాడో అర్థం చేసుకుంటారు. అతని భయాలు… అలవాట్లు… ఆలోచించే విధానం… అన్నీ గమనిస్తారు. ఆ తర్వాతే అతని మెదడులో ఒక కొత్త ఆలోచనను నాటుతారు.
AI ప్రపంచంలో కూడా దాదాపు ఇదే జరుగుతోందని అమెరికా కంపెనీలు ఆరోపిస్తున్నాయి. అవి చెబుతున్న కథ ప్రకారం… ఎవరూ ChatGPT లేదా Claude మెదడును తెరిచి చూడలేదు. లోపల ఉన్న కోడ్‌ను కూడా తీసుకోలేదు.
బదులుగా…
రోజుకు వేల ప్రశ్నలు.
వారానికి లక్షల ప్రశ్నలు.
నెలలకు కోట్ల ప్రశ్నలు.
“ఈ ప్రశ్నకు నువ్వు ఏమంటావు?”
“అదే ప్రశ్నను ఇలా అడిగితే?”
“ఇలా మార్చితే?”
“ఇక్కడ తప్పు చూపించు.”
“ఇప్పుడు మళ్లీ రాయ్.”
ఇలా మళ్లీ…
మళ్లీ…
మళ్లీ…
అదే AIతో మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి సమాధానాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. చివరికి… “ఈ పరిస్థితిలో ఇలా ఆలోచించాలి…” “ఆ పరిస్థితిలో అలా సమాధానం చెప్పాలి…” అనే ఒక భారీ మ్యాప్ తయారవుతుంది. ఆ మ్యాప్‌తో… మరో AIకి శిక్షణ ఇస్తారు.
గమనించండి..
మనిషి మెదడును దొంగిలించలేదు. అతను ఎలా ఆలోచిస్తాడో నేర్చుకున్నారు. ఇదే ఇక్కడా జరిగింది. టెక్నాలజీ ప్రపంచంలో AI Distillationగా పిలవబడుతోంది. ఇటీవల అమెరికాకు చెందిన Anthropic, చైనాకు చెందిన Alibaba, DeepSeek, MiniMax వంటి కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు చేసింది. తమ AIతో భారీ స్థాయిలో సంభాషణలు జరిపి, వాటి సమాధానాలను ఉపయోగించి మోడళ్ల అభివృద్ధికి ప్రయత్నించారని పేర్కొంది.
అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ ఆరోపణలు ఇప్పటికీ నిరూపితమైన వాస్తవాలు కావు. సంబంధిత కంపెనీలు వాటిని బహిరంగంగా అంగీకరించలేదు. కాబట్టి తుది నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది.
అమెరికా కంపెనీల భయం కేవలం “కాపీ” కాదు. వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి. ఏళ్ల తరబడి పరిశోధనలు. భారీ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు. ఇవన్నీ కలిపి తయారైన టెక్నాలజీకి, చాలా తక్కువ ఖర్చుతో సమానమైన పోటీ రావచ్చనే ఆందోళన. అందుకే ఈ వివాదం ఒక కంపెనీ సమస్య కాదు.
ప్రపంచ AI ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ప్రశ్న.
ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. “Imitation is the sincerest form of flattery.” అంటే… అనుకరించడం కూడా ఒక రకమైన ప్రశంస. కానీ… ఆ అనుకరణ వల్ల వందల బిలియన్ డాలర్ల పరిశ్రమ కదిలిపోతే? అప్పుడు అదే అనుకరణ… చట్టపరమైన, నైతిక, వ్యాపారపరమైన యుద్ధంగా మారుతుంది. భారత్‌కు ఈ కథ ఒక హెచ్చరిక కూడా. ఒక అవకాశం కూడా.
తక్కువ ఖర్చుతో శక్తివంతమైన AIలను అభివృద్ధి చేసే మార్గాలు పెరిగితే భారత స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు. అదే సమయంలో, మేధోసంపత్తిని ఎలా కాపాడాలి? AI ఒక AI నుంచి ఎంత వరకు నేర్చుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిందే.
చరిత్రలో ప్రతి యుగం ఒక వనరు కోసం పోరాడింది.
భూమి కోసం. బంగారం కోసం. చమురు కోసం. డేటా కోసం. బహుశా… AI యుగంలో ప్రపంచాన్ని నిర్ణయించే తదుపరి యుద్ధం… “తెలివి”ని ఎవరు సృష్టించారు అన్నదాని కోసం కాదు. “తెలివి”ని ఎవరు నేర్చుకున్నారు… ఎంత వరకు నేర్చుకోవచ్చు… అన్న దాని కోసం జరిగే అవకాశం ఉంది.
ఒకప్పుడు మనిషి యంత్రాలకు నేర్పించాడు.
ఈరోజు… యంత్రాలు ఒకదానినొకటి నేర్చుకుంటున్నాయి. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు AI కంపెనీల మధ్య పోటీ… “ఎవరు అత్యంత తెలివైన AIని తయారు చేస్తారు?” అనేదానిపై ఉండేది.
కానీ ఇప్పుడు యుద్ధం మారిపోయింది. “ఎవరు అత్యంత తెలివైన AIని… మళ్లీ నిర్మించగలరు?” అనేదానిపై మొదలైంది. ఇదే కారణంగా అమెరికా AI కంపెనీలు అలారం మోగిస్తున్నాయి. ఎందుకంటే… వారి భయం కేవలం చైనా కాదు.
రేపు AI ఒక AIకి నేర్పిస్తే…
ఎల్లుండి ఆ AI ఇంకో AIని నేర్పితే…
మరో పదేళ్ల తర్వాత మొదటి AI ‘టీచర్’ ఎవరో కూడా ప్రపంచం మర్చిపోతుందా? అదే ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రశ్న.
ఒక చైనా సామెత ఉంది.
“గురువు తలుపు చూపిస్తాడు… లోపలికి నడిచేది శిష్యుడే.”
కానీ AI యుగంలో… ఆ తలుపు ఎవరు తెరిచారు? లోపలికి మొదట ఎవరు నడిచారు? ఆ జ్ఞానం అసలు ఎవరిది?
అనే ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత సులభం కాదు. బహుశా… ఇది AI గురించి కథ కాదు. “జ్ఞానానికి యజమాని ఎవరు?” అనే మానవ నాగరికతలోనే అత్యంత పాత ప్రశ్నకు… Artificial Intelligence ఇచ్చిన కొత్త పరీక్ష.
“Inception మనిషి కలల్లోకి వెళ్లింది. AI మాత్రం మరో AI ఆలోచనల్లోకి వెళ్తోంది. ఈ కథ ఇప్పుడే మొదలైంది.








