భారత IT రంగానికి కౌంట్‌డౌన్ మొదలైందా?… సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇక సేఫ్ కాదా?
సూర్య ప్రకాష్ జోశ్యుల..
“మా అబ్బాయి సాఫ్ట్వేర్ TCSలో ఉద్యోగం చేస్తున్నాడు…” “మా అమ్మాయి Infosysలో సెలెక్ట్ అయింది…” గత రెండు దశాబ్దాలుగా తెలుగు కుటుంబాల్లో గర్వంగా వినిపించిన మాటలివి. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఒక మంచి IT కంపెనీలో ఉద్యోగం వస్తే జీవితమే సెట్ అయిపోయిందని చాలామంది నమ్మారు. మంచి జీతం, బ్యాంక్ లోన్, సొంత ఇల్లు, విదేశాలకు వెళ్లే అవకాశం… ఇవన్నీ IT ఉద్యోగంతో ముడిపడ్డ కలలే. కానీ ఇప్పుడు అదే రంగం గురించి వినిపిస్తున్న వార్తలు ఆ నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నాయి.కారణం కంపెనీలు నష్టాల్లో ఉన్నాయనే కాదు… ప్రాజెక్టులు తగ్గాయనే కాదు… ఇకపై ఈ రంగం ఇప్పటివరకు ఉన్న రూపంలో కొనసాగుతుందా?. హైదరాబాద్, బెంగళూరు, పుణే… ఇలా భారతదేశంలోని వేలాది IT కుటుంబాల్లో నిశ్శబ్దంగా కొత్త ఆందోళన మొదలైంది.
అసలు ఏమైంది?
ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభంగా నిలిచిన IT రంగం… ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లలో ఒత్తిడిని ఎదుర్కొంటోంది? అనే వివరాల్లోకి వెళితే…
భారత IT రంగానికి ముఖచిత్రాలుగా భావించే TCS, Infosys, Wipro, LTIMindtree వంటి దిగ్గజ కంపెనీలు గత కొంతకాలంగా భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వాటి షేర్లు గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 50 శాతం వరకు పడిపోయాయి. దేశంలోని ప్రధాన IT కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో సుమారు రూ.19 లక్షల కోట్లకు పైగా క్షీణించింది. ఇది కేవలం మార్కెట్ ఒడిదుడుకులా? లేక దీని వెనుక మరింత పెద్ద కథ ఉందా?
ఈసారి శత్రువు మరో కంపెనీ కాదు… AI!
గతంలో భారత IT కంపెనీలకు పోటీ అమెరికా లేదా యూరప్ కంపెనీల నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈసారి ప్రత్యర్థి ఒక కంపెనీ కాదు… Artificial Intelligence. కొన్ని నెలల క్రితం వరకు ఒక టీమ్ రోజులు పట్టి చేసే కోడింగ్ పనిని… ఇప్పుడు AI గంటల్లో పూర్తి చేస్తోంది.
కస్టమర్ సపోర్ట్… టెస్టింగ్… డాక్యుమెంటేషన్… రిపోర్టులు… ఇలాంటి ఎన్నో పనుల్లో AI వేగంగా మనుషుల పనిని భర్తీ చేస్తోంది. అందుకే ప్రపంచ కంపెనీలు ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాయి. “అదే పని తక్కువ ఖర్చుతో AI చేస్తుంటే… గతంలా వేలాది మంది ఉద్యోగులు ఎందుకు?” ఇదే ప్రశ్న భారత IT రంగంపై పెద్ద నీడలా మారింది.
ఇవి కూడా చదవండి
అమెరికా కూడా మరో దెబ్బ
భారత IT కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికా. అక్కడి కంపెనీలు ఖర్చులు తగ్గిస్తే… మొదట తగ్గేది కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్టులే. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై అనిశ్చితి, వ్యాపార సంస్థలు పెట్టుబడులను వాయిదా వేయడం వంటి కారణాలతో కొత్త ప్రాజెక్టులు నెమ్మదిస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా భారత IT కంపెనీల ఆర్డర్లపై పడుతోంది. కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు వాయిదా పడుతూండటంతో… దాని ప్రభావం నేరుగా హైదరాబాద్, బెంగళూరు, పుణే, చెన్నై వంటి IT నగరాలపై పడుతోంది. అందుకే అమెరికాలోని ఆర్థిక అనిశ్చితి భారత IT కంపెనీలను కూడా కుదిపేస్తోంది.
అసలు కారణం AIనా? అమెరికా ఎకానమీనా?
దీనికి కారణం రెండూ కలిసిన “డబుల్ ఇంపాక్ట్” అని చెప్పాలి.
Accenture హెచ్చరిక ఎందుకు అంత కీలకం?
ప్రపంచంలోని అతిపెద్ద IT సేవల సంస్థల్లో ఒకటైన Accenture కూడా రాబోయే రోజుల్లో వృద్ధి ఆశించినంతగా ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చింది. అంటే ప్రపంచ కంపెనీలు ఇప్పటివరకు చేసినంత ఖర్చు ఇకపై చేయకపోవచ్చనే అర్థం. ఆ సంకేతంతోనే భారత IT కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారులు మరింత అప్రమత్తమయ్యారు.
మరి ఉద్యోగాలు పోతాయా?
ఇది ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి మనసులో ఉన్న ప్రశ్న.దీనికి నిపుణులు చెప్పే సమాధానం ఒకటే. “ఉద్యోగాలు పూర్తిగా మాయమవ్వవు… కానీ ఉద్యోగాల స్వభావం మాత్రం పూర్తిగా మారుతుంది.” AIతో పని చేయగలిగిన వారికి అవకాశాలు పెరుగుతాయి. పాత నైపుణ్యాలపైనే ఆధారపడేవారికి మాత్రం పోటీ మరింత కఠినమవుతుంది.
AI వల్ల కొన్ని సంప్రదాయ పనులకు డిమాండ్ తగ్గినా… మరోవైపు AI డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. అంటే మార్పును అందిపుచ్చుకున్న కంపెనీలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్న ఉద్యోగులకు ఇదే పెద్ద అవకాశంగా కూడా మారవచ్చు.
ఉద్యోగాలు, జీతాలు, పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?
ఈ మార్పుల ప్రభావం కేవలం షేర్ మార్కెట్ నంబర్లకే పరిమితం కాదు. ఇది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఐటీ ఉద్యోగి, విద్యార్థి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొత్త నియామకాలు (Hiring): కంపెనీలు కేవలం సంప్రదాయ కోడింగ్ తెలిసిన వారి కంటే, ఏఐ టూల్స్ వాడటం తెలిసిన వారిని, మల్టీ-టాస్కింగ్ చేయగల వారిని ఎంచుకునే అవకాశం ఉంది. క్యాంపస్ సెలక్షన్స్ వేగం తగ్గవచ్చు.
జీతాల వృద్ధి: ప్రాజెక్టుల మార్జిన్లు తగ్గడం వల్ల రాబోయే 12 నుండి 24 నెలల పాటు ఐటీ రంగంలో జీతాల పెంపు (Appraisals) మునుపటిలా ఆశాజనకంగా ఉండకపోవచ్చు.
పెట్టుబడులు: ఐటీ రంగం పూర్తిగా మునిగిపోలేదు, కానీ కంపెనీల వ్యాల్యుయేషన్లు తగ్గుతున్నాయి. ఐటీ దిగ్గజాలు తమ వ్యాపార శైలిని క్లౌడ్, డేటా సెంటర్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వేగంగా మార్చుకోవాల్సి ఉంటుంది.
భయపడాల్సిన టైమ్ వచ్చేసిందా?
చరిత్ర చెబుతోంది…ప్రతి టెక్నాలజీ విప్లవం కొన్ని ఉద్యోగాలను తగ్గించింది.అదే సమయంలో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించింది. ఇప్పుడూ అదే జరగొచ్చు. AIని శత్రువుగా చూసేవారు వెనుకబడే అవకాశం ఉంది. AIని కొత్త నైపుణ్యంగా నేర్చుకునేవారే ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువ.
ఏదైమైనా…
భారత IT రంగం గత 25 ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచింది. లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించింది. కోట్లాది మంది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. కానీ ఇప్పుడు ప్రపంచం మారుతోంది. AI అనే కొత్త శక్తి ఆట నియమాలనే మార్చేస్తోంది. ఈ మార్పును భారత IT దిగ్గజాలు మరో అవకాశంగా మార్చుకుంటాయా? లేక ఒకప్పుడు తిరుగులేని విజయానికి కారణమైన పాత వ్యాపార విధానానికే ఇది ముగింపు సంకేతమా?
ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే రెండేళ్లలోనే తేలే అవకాశం ఉంది.








