ఏపీలో విజిలిన్స్ దడ.. పెట్రోల్ బంకులపై గురి..!
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమార్కులు, బ్లాక్ మార్కెట్ దందా చేసే వారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ (Vigilance & Enforcement) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పుడు, ఏ నిమిషంలో, ఏ ప్రాంతంపై దాడులు చేస్తారో ఎవరికీ అర్థం కాకుండా అత్యంత రహస్యంగా వ్యూహాత్మక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో విజిలెన్స్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలు రేషన్ మాఫియా గుండెల్లో వణుకు పుట్టించాయి. కేవలం రేషన్ దుకాణాలే కాకుండా, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులు, నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ ఉంచే గోడౌన్లను లక్ష్యంగా చేసుకుని విజిలెన్స్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా విరుచుకుపడుతోంది.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం పరిధిలోని చోడిపాలెం, భవనంవారిపాలెం గ్రామాల్లోని చౌకధరల (రేషన్) దుకాణాలపై విజిలెన్స్ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలకు అందాల్సిన బియ్యం, ఇతర సరుకులను పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారంతో ఈ సోదాలు జరిగాయి. తనిఖీల్లో భాగంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లను, ఈ-పోస్ మిషన్ల డేటాను, భౌతికంగా ఉన్న నిల్వలను పరిశీలించగా.. భారీ ఎత్తున నిల్వల వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో, ఆ రెండు చౌకధరల దుకాణాలపై ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act) సెక్షన్ 6A కింద అధికారులు కఠినమైన కేసులు నమోదు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్, స్థానిక తహశీల్దార్ మాధవి, మరియు విజిలెన్స్ సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. పేదల పొట్ట కొట్టి రేషన్ సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే ఎంతటి వారైనా సరే వదిలేది లేదని, దుకాణాల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం ఏపీ విజిలెన్స్ విభాగం తన శైలిని పూర్తిగా మార్చేసింది. ఎక్కడా ముందస్తు సమాచారం లీక్ కాకుండా నేరుగా స్పాట్‌కు వెళ్లి షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులను మోసం చేస్తూ కొలతల్లో తక్కువ పోస్తున్న పెట్రోల్ బంకులపై, అలాగే మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేందుకు నిత్యావసర వస్తువులను అక్రమంగా దాచిపెడుతున్న పెద్ద పెద్ద హోల్‌సేల్ వ్యాపారుల గోడౌన్లపై విజిలెన్స్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ ముమ్మర తనిఖీల దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా అక్రమార్కులు భయంతో వణికిపోతున్నారు.








