అజెండా సంక్షోభంలో తెలంగాణ రాజకీయాలు!
తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నాటి ఉద్వేగాలను దాటి పుష్కరం దాటిపోయింది. గ్లోబల్ సిటీగా మారిన హైదరాబాద్ అభివృద్ధిని అందుకోవడం, నిరుద్యోగ నివారణ, ఉపాధి అవకాశాల సృష్టి, ఆర్థిక స్వావలంబన వంటివి నేటి తరం ఓటర్ల అసలు సిసలైన ప్రాధాన్యతలు. కానీ, దురదృష్టవశాత్తూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం నేటికీ పాత చింతకాయ పచ్చడి లాంటి ‘తెలంగాణ సెంటిమెంట్’ అస్త్రాన్నే నమ్ముకుని రాజకీయం చేయాలని చూడటం ఒక విచిత్రమైన అజెండా సంక్షోభాన్ని కళ్ళకు కడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునే బలమైన సామాజిక, ఆర్థిక అజెండాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే పార్టీలు మళ్లీ ప్రాంతీయ విభేదాలను రాజేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ పార్టీల సెంటిమెంట్ పిచ్చి ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా వస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా వివాదమే ఒక తాజా ఉదాహరణ. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌పై సోషల్ మీడియాలో ఎవరో ఇద్దరు నెటిజన్లు “దీనికి ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ అవసరమా?” అంటూ అజ్ఞానంతో, వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. నిజానికి తెలంగాణ యాసలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల దరఖాస్తు లేదా భార్యాభర్తలు విడిపోయేటప్పుడు రాసుకునే అంగీకార పత్రం అని అర్థం.
ఇవి కూడా చదవండి
కొందరు నెటిజన్ల వెకిలి చేష్టలను, అజ్ఞానపు ట్రోల్స్‌ను పట్టుకుని.. ఇక్కడి రాజకీయ పార్టీలు, మేధావుల బృందాలు దానిని ఏకంగా తెలంగాణ అస్థిత్వంపై, యాసపై ఆంధ్రా వాళ్ళు చేస్తున్న దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం హాస్యాస్పదం. ఒక సినిమా టైటిల్ లేదా యూట్యూబర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత పెద్ద పొలిటికల్ డ్రామా నడపడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని సగటు ఓటరు సులభంగానే గ్రహిస్తున్నాడు.
ఉద్యమ సమయంలో ‘ఆంధ్రా పాలకులు – వలసవాదం’ అనే నినాదం ప్రజలను విపరీతంగా కదిలించింది. ఎందుకంటే నాడు అధికారం, నిధులు, నియామకాలు అన్నీ ఇతరుల చేతుల్లో ఉండేవి. కానీ రాష్ట్రం ఏర్పడి పుష్కరం ముగిసిన ఈ తరుణంలో ఇక్కడి సీఎం, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలే. తెలంగాణలో జరుగుతున్న తప్పులకు లేదా పాలనా వైఫల్యాలకు ఇక్కడి పాలకులదే పూర్తి బాధ్యత తప్ప.. ప్రతి చిన్న విషయానికి ఆంధ్రా ప్రాంతాన్ని లాగడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు.
ఒకప్పుడు ఇక్కడ చక్రం తిప్పిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఇప్పుడు కనీసం ఉనికిలో లేవు. వైఎస్ షర్మిల పార్టీ కూడా కాంగ్రెస్‌లో విలీనమైపోయింది. అధికారం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీల అగ్రనేతలంతా తెలంగాణ వారే. మరి ఇక్కడ శత్రువే లేనప్పుడు, “తెలంగాణ అస్థిత్వం ప్రమాదంలో పడింది.. ఆంధ్రా వాళ్లు దోచుకుంటున్నారు” అనే నినాదాన్ని ఎత్తుకోవడం ముమ్మాటికీ పార్టీల వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది.
తెలంగాణ సమాజం ఉద్యమ కాలం నాటి భావోద్వేగాల నుండి ఎప్పుడో బయటకు వచ్చేసింది. నేటి ఓటర్లు నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఐటీ వృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి క్షేత్రస్థాయి ఫలితాలను చూస్తున్నారే తప్ప.. సెంటిమెంట్ రొట్టె దంచితే వినే పరిస్థితిలో లేరు.
కల్పిత శత్రువును సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే పాత వ్యూహాలు ఇకపై పనిచేయవు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం ఈ సెంటిమెంట్ రాజకీయాలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా ఈ పాత సెంటిమెంట్ కార్డును పక్కనబెట్టాలి. నిరుద్యోగ నివారణ, పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయ సంక్షేమం వంటి కంటికి కనిపించే ప్రగతి అజెండాతో వస్తేనే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు. లేదంటే, రాబోయే ఎన్నికల్లో ప్రజలే ఆయా రాజకీయ పార్టీలకు ‘ఇడుపు కాయితం’ రాసి పంపించడం ఖాయంగా కనిపిస్తోంది.








