కంచికి చేరని సవాళ్ల పర్వం..!
“దమ్ముంటే చర్చకు రా.. నువ్వు వస్తావో.. నన్ను రమ్మంటావో తేల్చుకో!” తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట వినిపించే అత్యంత పాపులర్ డైలాగ్ ఇది. సవాల్ విసిరే వారు, దాన్ని స్వీకరించే వారు మైకుల ముందు చూపే రౌద్రం చూస్తే.. నిజంగానే ఇరుపక్షాలూ కూర్చుని తేల్చేసుకుంటాయేమో అని సామాన్యులు భావిస్తుంటారు. కానీ, ఇలాంటి పొలిటికల్ ఛాలెంజ్‌లలో ఒక్కటంటే ఒక్కటి కూడా చర్చ వరకు వెళ్లిన దాఖలాలు లేవు. ఎందుకంటే, ఇక్కడ చర్చల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ. ఒకరు వేదిక మార్చమంటారు, మరొకరు అంశం కుదరదంటారు.. ఇద్దరూ మొండికేసి రోడ్డుపైకి వస్తే పోలీసులు ఎలాగూ హౌస్ అరెస్టుల స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉంటారు. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మధ్య నడుస్తున్న హైడ్రామా కూడా ఇదే కోవకు చెందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక నిర్దిష్ట కుటుంబం తమ విచ్చలవిడి అవినీతితో యావత్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఆ నిరుపేద తెలంగాణను మా చేతుల్లో పెట్టింది అంటూ కేసీఆర్ కోటరీని నేరుగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే వేగంగా స్పందించారు. గత పదిహేనేళ్లుగా తెలంగాణ అప్పులు, జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. రేవంత్ రెడ్డే ప్లేస్, టైమ్, డేట్ ఫిక్స్ చేసి చెబితే తానే స్వయంగా వస్తానని సవాల్ విసిరారు.
కేటీఆర్ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సవాల్‌ను స్వీకరిస్తూ సంచలన ప్రకటన చేశారు. “వేదిక ఎక్కడో ఎందుకు.. మీ సొంత కార్యాలయమైన తెలంగాణ భవన్ లోనే చర్చకు మేం సిద్ధం” అని ప్రకటించారు. ఒక ప్రతిపక్ష నేత సవాల్ విసిరినప్పుడు అధికార పక్షం వారి సొంత గడ్డపైకే వచ్చి చర్చిస్తామని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
నిజానికి, ఇలాంటి సవాళ్లు కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఆడే మైండ్ గేమ్స్ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్, లేదా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య ఇలాంటి వందలాది సవాళ్లు వచ్చాయి. గన్ ఫౌండ్రి అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రమాణాలు, యాదగిరిగుట్టలో తడి బట్టలతో సవాళ్లు వంటివి తెలంగాణ సమాజం చాలానే చూసింది. కానీ తీరా ఆ రోజు వచ్చేసరికి.. “పోలీసులు అనుమతి ఇవ్వలేదు”, “ప్రతిపక్షం పారిపోయింది”, “అధికార పక్షం హౌస్ అరెస్టులు చేయించింది” అనే సాకులతో ఇరుపక్షాలూ పక్కకు తప్పుకుంటాయి.
రాజకీయ పార్టీలకు నిజంగానే తమ వాదనల్లో నిజాయితీ ఉంటే, రాష్ట్ర అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే తపన ఉంటే.. దానికి వీధులు, పార్టీ ఆఫీసులు వేదికలు కావు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన వేదిక శాసనసభ. అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాలూ పూర్తి స్థాయి శ్వేతపత్రాలు, అధికారిక గణాంకాలతో సమగ్రంగా చర్చించాలి. సభలో ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పే వీలుంటుంది.. ప్రతిపక్షానికి కూడా లైవ్ టెలికాస్ట్ ద్వారా తమ గళాన్ని వినిపించే పూర్తి సమయం, హక్కు ఉంటుంది. సభను పక్కనబెట్టి రోడ్లపై, ప్రెస్ మీట్లలో సవాళ్లు విసురుకోవడం వల్ల కాలయాపన తప్ప మరేమీ ఉండదు. నేటి తరం ఓటర్లు మునుపటి కంటే చాలా తెలివైన వారు. ఏ నాయకుడు నిజంగా మాట్లాడుతున్నాడు, ఎవరు కేవలం టాపిక్ డైవర్షన్ కోసం సవాళ్లు విసురుతున్నారనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో, కేటీఆర్-కాంగ్రెస్ నేతల తాజా సవాళ్లను కూడా సామాన్య ప్రజలు కేవలం ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ లేదా పొలిటికల్ డ్రామాగానే చూస్తున్నారు. ఈ సవాళ్లు కేవలం న్యూస్ ఛానెళ్ల రేటింగులకు, సోషల్ ఇండియా ట్రోల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. అసెంబ్లీ సాక్షిగా ఒక అర్థవంతమైన చర్చగా మారినప్పుడే తెలంగాణ అప్పుల అసలు గుట్టు, గత పదేళ్ల ప్రగతిపై ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుందన్నది జగమెరిగిన సత్యం.








