మీ బిడ్డకు అమెరికా ప్రభుత్వం తొలి గిఫ్ట్… $1000! మీకూ దక్కుతుందా?
FCA (India), CPA; email: CPA@taxcircle.com
ఒక తండ్రి జీవితంలో తన పిల్లల పేరు మీద అందుకునే మొదటి బహుమతి ఏది?
బంధువులు ఇచ్చే బంగారమా…?
తాతయ్య తీసే ఫిక్స్డ్ డిపాజిటా…?
మామయ్య చేతిలో పెట్టే డబ్బులా…?
కాదు… ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చెబుతోంది…
“మీ బిడ్డ అర్హత కలిగి ఉంటే… మొదటి $1000 మేమే ఇస్తాం!”
వినడానికి సినిమా డైలాగ్‌లా అనిపించినా… ఇది ఇప్పుడు అమెరికాలో వేలాది కుటుంబాలు మాట్లాడుకుంటున్న నిజమైన విషయం.
ఒక్క ప్రకటనతో తెలుగు ఎన్ఆర్ఐల వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ కమ్యూనిటీలు, సోషల్ మీడియా అంతా ఒకే ప్రశ్నతో నిండిపోయాయి…
“మన బిడ్డకూ ఈ వెయ్యి డాలర్లు వస్తాయా?”
అమెరికాలో కొత్తగా బిడ్డ పుట్టిన కుటుంబాలు… త్వరలో పిల్లలు పుట్టబోతున్న దంపతులు… అక్కడ స్థిరపడిన తెలుగు కుటుంబాలు… ఇప్పుడు ఈ స్కీమ్ గురించి తెలుసుకోవడానికి పోటీ పడుతున్నాయి.
అయితే… ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతోంది.
ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా… ఊరికే డబ్బులు పంచుతుందా?ఒక్కో బిడ్డపేరుతో $1000 ఇవ్వాలనే నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి?
ఇది నిజంగా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చే బహుమతేనా…? లేక అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక పెద్ద వ్యూహంలో భాగమా?
ఇంకా ముఖ్యంగా…
ఈ స్కీమ్ నిజంగా ఎవరికీ వర్తిస్తుంది?
అమెరికాలో ఉన్న ప్రతి తెలుగు కుటుంబానికా…?
లేక కొన్ని అర్హతలు ఉన్నవారికేనా?
ఒకవేళ మీ బిడ్డ అర్హుడైతే… ఈ అవకాశాన్ని మిస్ అయితే ఏమి కోల్పోతారు?
అంతేకాదు… సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న “ఫ్రీ $1000” కథలో చాలా మంది చెప్పని మరో కోణం కూడా ఉంది. ఈ అకౌంట్ వల్ల వచ్చే ప్రయోజనాలే కాదు… భవిష్యత్తులో గుర్తుంచుకోవాల్సిన పన్ను నిబంధనలు, పరిమితులు కూడా ఉన్నాయి.
అసలు ఈ Trump Account స్కీమ్ ఏమిటి? ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? తెలుగు కుటుంబాలకు నిజంగా ఎంత లాభం? ఎవరెవరు వెంటనే అప్లై చేయాలి? ఎవరెవరు తొందరపడకూడదు? అధికారికంగా ఎలా నమోదు చేసుకోవాలి? తెలుసుకుందాం…
ఇవి కూడా చదవండి
అసలు ఈ స్కీమ్ ఏంటి?
అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన Trump Account అనే కొత్త సేవింగ్స్ పథకం ఇది. 2025 నుంచి 2028 మధ్య జన్మించిన అర్హత కలిగిన అమెరికా పౌర పిల్లల పేరుతో అకౌంట్ తెరిస్తే, ప్రభుత్వం ఒకసారి $1000 జమ చేస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఏడాది నిర్ణీత పరిమితి వరకు డబ్బు జమ చేయవచ్చు.
H1B / గ్రీన్ కార్డ్ హోల్డర్ల పిల్లలకు వస్తుందా?
H1B లేదా L1 వీసాపై ఉన్నవారికి: మీరు గ్రీన్ కార్డ్ లేని ఎన్ఆర్ఐలైనా సరే… మీ పిల్లలు అమెరికాలోనే పుట్టి ఉంటే, వారికి యుఎస్ సిటిజెన్షిప్ ఉంటుంది కాబట్టి ఈ $1,000 బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుంది. ocial Security Number తప్పనిసరి.
ఎవరికి రాదు?:
ఒకవేళ మీ పిల్లలు ఇండియాలో పుట్టి, అమెరికాకు డిపెండెంట్ వీసా (H4 వంటివి) మీద వస్తే వారికి ఈ అర్హత లేదు.
తెలుగు కుటుంబాలకు ఉన్న అదనపు లాభాలేంటి?
ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్: కేవలం తల్లిదండ్రులే కాదు.. ఇండియాలో ఉండే తాతయ్యలు, నానమ్మలు కూడా పిల్లల పేరు మీద ఏటా కొంత డబ్బు (గరిష్టంగా $5,000 వరకు) గిఫ్ట్ గా డిపాజిట్ చేయవచ్చు.
బిజినెస్ ఓనర్లకు లూప్‌హోల్: ఒకవేళ మీకు అమెరికాలో సొంతంగా కన్సల్టెన్సీ, ఐటీ ఫర్మ్ లేదా ఏదైనా బిజినెస్ ఉంటే… మీ కంపెనీ ద్వారా మీ పిల్లల అకౌంట్ కి ఏటా $2,500 వరకు ‘టాక్స్-ఫ్రీ’గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. దీన్ని మీ బిజినెస్ ఖర్చుగా చూపిస్తూనే ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
IRS గుడ్ న్యూస్ :
ఈ అకౌంట్లలో డబ్బులు దాచడానికి ఎలాంటి ‘గిఫ్ట్-ట్యాక్స్’ ఫారాలు (Gift Tax Returns) ఫైల్ చేయాల్సిన తలనొప్పి లేదు. ఏడాదికి $19,000 (గిఫ్ట్ ట్యాక్స్ లిమిట్) లోపు ఉండే ఇన్వెస్ట్మెంట్లకు ఎలాంటి పేపర్‌వర్క్ అవసరం లేదని IRS స్పష్టం చేసింది.
ఎందుకు ఇంత చర్చ?
ఈ అకౌంట్లోని డబ్బు చిన్నప్పటి నుంచే పెట్టుబడిగా పెరుగుతుంది. ఇటీవల ఈ స్కీమ్‌కు సంబంధించిన గిఫ్ట్ ట్యాక్స్ పేపర్‌వర్క్‌ను అమెరికా పన్ను శాఖ సులభతరం చేయడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది.
అసలు ట్విస్ట్ ఇదే…
సోషల్ మీడియాలో ఎక్కువగా “ఫ్రీ $1000” గురించే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ అకౌంట్లో పెట్టుబడి పెరిగిన తర్వాత దానిపై వర్తించే పన్ను నిబంధనలు, డబ్బు ఉపసంహరణకు సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. అందుకే కేవలం “ఫ్రీ మనీ” అని చూసి నిర్ణయం తీసుకోవడం కంటే, దీర్ఘకాలిక ప్రయోజనాలు, పన్ను ప్రభావం రెండూ అర్థం చేసుకోవడం అవసరం.
ఇది సాంప్రదాయ IRA (Traditional IRA) లాంటిది. అంటే… మీరు దాచే సొమ్ము (Principle) వెనక్కి తీసుకునేటప్పుడు ట్యాక్స్ ఉండదు కానీ, ప్రభుత్వం ఇచ్చిన ఆ $1000 ఫ్రీ మనీ, మరియు దశాబ్దాలుగా ఆ అకౌంట్లో వచ్చే లాభాలు (Growth) భవిష్యత్తులో విత్‌డ్రా చేసినప్పుడు ‘సాధారణ ఆదాయపు పన్ను’ (Ordinary Income Tax) కట్టాలి!
ఎక్కడ, ఎలా అప్లై చేయాలి?
అర్హత ఉన్న తల్లిదండ్రులు అధికారిక Trump Accounts విధానం ద్వారా నమోదు చేసుకోవచ్చు. అవసరమైన వివరాలతో అధికారిక పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి.
ఈ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్, ఉచితం మరియు కేవలం 10 నిమిషాలు పడుతుంది:
మీ పిల్లాడి SSN వివరాలతో అఫీషియల్ వెబ్సైట్ trumpaccounts.gov కి వెళ్లి ID.me ద్వారా లాగిన్ అవ్వండి.
అక్కడ IRS Form 4547 ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ($1000 ఫ్రీ మనీ బాక్స్ టిక్ చేయడం మర్చిపోకండి).
అఫీషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి డిపాజిట్ ప్రారంభించవచ్చు.
జాగ్రత్త: ఫేక్ లింకులు నమ్మకండి. కేవలం trumpaccounts.gov ద్వారానే వెళ్ళండి. ప్రభుత్వం మీకు ఫోన్ కానీ, వాట్సాప్ కానీ చేయదు.
అలాగే సందేహాలు ఉంటే అనుభవజ్ఞులైన CPA లేదా ట్యాక్స్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.
ఈ స్కీమ్ నిజంగా లాభదాయకమేనా?
లాభదాయకమే… కానీ ఒక స్ట్రాటజీ ఉండాలి!
ప్రభుత్వం మీ బిడ్డ పేరు మీద ఇచ్చే మొదటి బహుమతి $1,000 ని వదులుకోవడం ముమ్మాటికీ అమాయకత్వమే అవుతుంది. కాబట్టి వెంటనే అకౌంట్ ఓపెన్ చేయడం మంచి నిర్ణయం.
అయితే, మీ పిల్లాడి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం భారీగా డబ్బు దాచాలి అనుకుంటే మాత్రం కేవలం దీనిపైనే ఆధారపడకండి. ఎందుకంటే చదువు కోసం వాడే ‘529 కాలేజీ ప్లాన్’ లో లాభాలపై రూపాయి పన్ను ఉండదు. కాబట్టి స్మార్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే… ప్రభుత్వం ఇచ్చే ఉచిత సొమ్ము కోసం ‘ట్రంప్ అకౌంట్’ ఓపెన్ చేయండి, కానీ మీ పిల్లల చదువుల కోసం ‘529 ప్లాన్’ ని కూడా కలిపి వాడుకోండి. రెండు అకౌంట్లను బ్యాలెన్స్ చేస్తేనే మీ పిల్లల ఆర్థిక భవిష్యత్తు సేఫ్!
అసలు
‘529 ప్లాన్’ ఏమిటి, దాని బెనిఫిట్స్ ఏమిటి…… ఈ ట్రంప్ ఎక్కౌంట్ స్కీమ్ కు ఉన్న తేడా ఏమిటి..ఏది ఎక్కువ లాభదాయకం వంటి విషయాలు మనం నెక్ట్స్ ఆర్టికల్ లో పరిశీలిద్దాం…
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వ్యక్తిగత ట్యాక్స్, చట్టపరమైన లేదా ఆర్థిక సలహా కాదు. Trump Account నిబంధనలు కొత్తవి, ఇంకా మారే అవకాశం ఉంది. కాబట్టి మీ పరిస్థితికి సరిపోయే నిర్ణయం తీసుకునే ముందు ఒక అర్హత కలిగిన CPA లేదా ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి
Shiva Duvvuru, FCA (India), CPA, is the founder of Tax Circle, Inc., advising NRI families and business owners on U.S.–India tax and financial planning. Reach out at CPA@taxcircle.com.








