ఐఐటీ, నీట్ కలలకు బ్రేక్ పడుతోందా? చిన్న నగరాల్లో మొదలైన ‘నిశ్శబ్ద విప్లవం’!
సూర్య ప్రకాశ్ జోశ్యుల..
“చదువు ఉంటే చాలు… జీవితం మారిపోతుంది.”
ఈ మాట ప్రతి భారతీయ కుటుంబంలో తరతరాలుగా వినిపిస్తోంది. కానీ… జీవితాన్ని మార్చే చదువు ఏది?
అనే ప్రశ్నకు వచ్చే సమాధానం మాత్రం ఇప్పుడు మారుతోంది.
ఒకప్పుడు…
చిన్న టౌన్ లలో పుట్టిన పిల్లల కల ఒక్కటే.
డాక్టర్ లేదా… ఇంజినీర్.
అందుకే…
మంచి స్కూల్….మంచి కోచింగ్. JEE. NEET. ర్యాంక్. సీట్. నీట్ ఉద్యోగం. ఈ రోడ్‌మ్యాప్‌ను విజయానికి షార్ట్‌కట్‌గా నమ్మిన కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఉంటున్నాయి.
కానీ…
ఇప్పుడు అదే రోడ్డులో మరో మలుపు కనిపిస్తోంది. అది IIT కలను వదిలేయడం కాదు. “విజయానికి ఇంకో దారి కూడా ఉందేమో…” అని వెతకడం. అక్కడి నుంచే మొదలవుతోంది ఈ కథ. మారింది పిల్లలు కాదు… ‘విజయం’ అనే పదానికి అర్థం
ఒకప్పుడు…
“మంచి మార్కులు వస్తే చాలు.” అనుకునేవారు.
ఇప్పుడు…
“మంచి స్కిల్స్ కూడా ఉండాలి.” అని భావిస్తున్నారు.
ఒకప్పుడు…
మంచి స్కూల్ అంటే… 100% ఫలితాలు. టాప్ ర్యాంకులు. IIT సెలక్షన్లు.
ఇప్పుడు…
మంచి స్కూల్ అంటే… పిల్లవాడికి ఆత్మవిశ్వాసం వచ్చిందా? సొంతంగా ఆలోచించగలుగుతున్నాడా? ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాడా? అనే ప్రశ్నలు కూడా చేరాయి. తల్లిదండ్రులు స్కూల్‌ను మాత్రమే ఎంచుకోవడం లేదు… పిల్లల భవిష్యత్తును ఎంచుకుంటున్నారు.
ర్యాంకుల పరుగు… ఎందుకు అలసిపోతున్నాయి కుటుంబాలు?
“అతి సర్వత్ర వర్జయేత్.”
ఏదైనా మితిమీరితే సమస్యే. పోటీ కూడా అంతే. ఒకప్పుడు ఇంటర్లో మొదలయ్యే పోటీ… ఇప్పుడు ఐదో, ఆరవ తరగతికే చేరింది. ఫౌండేషన్ కోర్సులు. వీకెండ్ పరీక్షలు. మాక్ టెస్టులు. కోచింగ్. ర్యాంకులు. ఈ ప్రయాణంలో పిల్లలు మాత్రమే కాదు… తల్లిదండ్రులు కూడా అలసిపోతున్నారు. అందుకే ఇప్పుడు చాలా కుటుంబాలు ఒక ప్రశ్న వేసుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
“మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయిస్తాయా?”
ఈ ప్రశ్నే విద్యా మార్కెట్లో కొత్త మార్పుకు కారణమవుతోంది. మెట్రోల నుంచి చిన్న నగరాలకు… గ్లోబల్ చదువులు వైపు ప్రయాణం మొదలకు శ్రీకారం చుడుతోంది.
ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటే…
ముంబై. ఢిల్లీ. బెంగళూరు. అంతే. అది కూడా కొద్దిమంది డబ్బుకన్న కుటుంబాల ఎంపిక. ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారత్‌లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) స్కూళ్ల సంఖ్య 195 నుంచి 280కి పెరిగింది. అందులో మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కొత్తగా ప్రారంభమవుతున్న ఐబీ స్కూళ్లలో దాదాపు 44 శాతం మెట్రో నగరాల్లో లేవు. జైపూర్, సూరత్, లక్నో… కోయంబత్తూర్, మదురై, కొచ్చి, మైసూర్… విశాఖపట్నం, నాగ్‌పూర్… ఈ ప్రాంతీయ కేంద్రాల నుంచే ఇప్పుడు డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ స్పీడ్ చూస్తుంటే, త్వరలోనే కెనడాని దాటేసి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐబీ మార్కెట్‌గా ఇండియా అవతరించబోతోంది.
అంటే…
గ్లోబల్ చదువు కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన రోజులు నెమ్మదిగా మారుతున్నాయన్న మాట.
అసలు IB అంటే ఏమిటి?
చాలా సింపుల్‌గా చెప్పాలంటే… ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో నడిచే అంతర్జాతీయ విద్యా విధానం. ఇది స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక లాభాపేక్ష లేని సంస్థ నిర్వహించే అంతర్జాతీయ బోర్డు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒకే స్టాండర్డ్ ఉంటుంది. మీరు అమెరికాలో ఉన్నా, లండన్‌లో ఉన్నా, లేదా ఇండియాలోని ఒక చిన్న నగరంలో ఉన్నా… ఐబీ సిలబస్, పరీక్షల శైలి ఒకేలా ఉంటాయి.
ఇక్కడ… బట్టీ పట్టడం కంటే… అర్థం చేసుకోవడం ముఖ్యం. జవాబులు రాయడం కంటే… ప్రశ్నలు అడగడం ముఖ్యం. పుస్తకం చదవడం కంటే… పరిశోధించడం ముఖ్యం. అందుకే విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం ప్లాన్ చేసే కుటుంబాలు దీనిపై ఆసక్తి చూపుతున్నాయి.
CBSE… IB… తేడా ఎక్కడ?
CBSEలో ప్రధాన లక్ష్యం…
పరీక్షల్లో మంచి ఫలితాలు.
IBలో ప్రధాన లక్ష్యం…
పిల్లల వ్యక్తిత్వం, కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం.
అంటే…
ఒకటి పరీక్షకు సిద్ధం చేస్తే…
మరొకటి జీవితంలోని అనేక సవాళ్లకు సిద్ధం చేయాలని ప్రయత్నిస్తుంది.
అయితే రెండింటికీ తమ తమ ప్రయోజనాలు ఉన్నాయి.
ఫీజు వింటే షాక్ అవుతారు!
ఈ చదువు అందరికీ అందుబాటులో ఉందా? లేదనే చెప్పాలి. సాధారణంగా… CBSE ప్రైవేట్ స్కూళ్లలో ఏడాదికి ₹60 వేల నుంచి ₹2 లక్షల వరకు ఖర్చవుతుంది. IB స్కూళ్లలో మాత్రం… ₹4 లక్షల నుంచి ₹15 లక్షల వరకు ఫీజు ఉండొచ్చు. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా. అయినా… చిన్న నగరాల్లోని కొత్త సంపన్న కుటుంబాలు ఈ ఖర్చును పెట్టుబడిగా చూస్తున్నాయి.
గోల్డ్‌మన్ సాక్స్ అంచనా ప్రకారం ఇండియాలో సంపన్నుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ కొత్త సంపన్న వర్గానికి డబ్బు కంటే పిల్లల మానసిక ప్రశాంతత, గ్లోబల్ భవిష్యత్తే ముఖ్యం.
కేవలం విదేశాలకు వెళ్లేవాళ్ల కోసమేనా?
కాదు. ఇదొక పెద్ద అపోహ. ఒకప్పుడు ఐబీ అంటే కేవలం విదేశీ చదువులకే అనుకునేవారు. కానీ ఇప్పుడు భారతదేశంలోనే ఉండి ఉన్నత చదువులు చదవాలనుకునే వారు కూడా ఐబీ వైపు మొగ్గు చూపుతున్నారు.
“చదువు మీద పెట్టిన ఖర్చు… పిల్లల భవిష్యత్తులో పెట్టిన పెట్టుబడి.” అనే నమ్మకం పెరుగుతోంది.
ఇంత డిమాండ్ ఎందుకు?
దీనికి ఒక్క కారణం లేదు. చాలా కారణాలు కలిసి ఈ మార్పును తీసుకొచ్చాయి.
పరీక్షల ఒత్తిడిపై పెరుగుతున్న ఆందోళన.
విదేశీ యూనివర్సిటీల్లో చదవాలనే ఆసక్తి.
చిన్న నగరాల్లో పెరిగిన సంపద.
సోషల్ మీడియా ద్వారా ప్రపంచ విద్యా విధానాలపై వచ్చిన అవగాహన.
దేశీయ బోర్డులపై కొంతమంది తల్లిదండ్రుల్లో పెరుగుతున్న అసంతృప్తి.
ఈ మార్పులన్నీ కలిసి విద్యా మార్కెట్‌ను కొత్త దిశగా తీసుకెళ్తున్నాయి.
అయితే… ఇదే అందరికీ సరైన దారినా?
కాదు. ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి. “అన్ని దారులు ఒకే గమ్యానికి తీసుకెళ్లవు.”
మీ పిల్లవాడి లక్ష్యం…
IIT.
NIT.
AIIMS.
NEET.
అయితే ప్రస్తుతం CBSE లేదా ఇతర దేశీయ బోర్డులే మరింత అనుకూలంగా ఉండొచ్చు.
కానీ…
విదేశీ యూనివర్సిటీలు, గ్లోబల్ కెరీర్, విభిన్న నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉంటే…
IB వంటి అంతర్జాతీయ విద్యా విధానం కూడా ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.
రథం బాగుంది… కానీ తోలే సారథి ఎక్కడ?
ఈ ఐబీ మోడల్ వినడానికి, చదవడానికి చాలా బాగుంది. కానీ దీని విస్తరణకు పెద్ద బ్రేకులు ఉన్నాయి.
మొదటిది: ఖర్చు (దీని కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌లు పెట్టాలని ఐబీ యోచిస్తోంది).
రెందోది మరియు అతి పెద్దది: ఉపాధ్యాయుల కొరత.
“గురువు బాగుంటేనే… గురి తప్పుకుండా ఉంటుంది.”
కానీ ఐబీ విధానంలో టెక్స్ట్‌బుక్స్ చూసి పాఠాలు చెప్పడం కుదరదు. పిల్లవాడి చేత ప్రాజెక్టులు చేయించాలి. వాడి ఆలోచనను రేకెత్తించాలి. మన చిన్న నగరాల్లో ఐబీ స్థాయి శిక్షణ పొందిన టీచర్లు దొరకడం చాలా కష్టం. అందుకే ఉపాధ్యాయులను తయారుచేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఐబీ డైరెక్టర్ జనరల్ ఓల్లి-పెక్కా హైనోనెన్ చెప్తున్నారు.
ఫైనల్ గా…
ఒక ఆఫ్రికన్ సామెత ఉంది. “ఒక పిల్లవాడిని పెంచడానికి ఒక ఊరు కావాలి.”
ఈ రోజుల్లో… ఒక పిల్లవాడి భవిష్యత్తును నిర్మించడానికి… కుటుంబం మాత్రమే కాదు… చదువు కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కథ IB స్కూళ్ల గురించి మాత్రమే కాదు. భారతీయ తల్లిదండ్రులు ‘విజయం’ అనే పదానికి కొత్త అర్థం వెతుకుతున్న కథ.
“ప్రపంచం మారినప్పుడు… పాత మ్యాప్‌తో కొత్త గమ్యానికి చేరుకోలేం.”
భారత విద్యా వ్యవస్థలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు కూడా బహుశా అదే చెబుతోంది.








