భారత్ మ్యాప్‌ను మార్చే ప్లాన్ మొదలైంది… జపాన్ వేల కోట్ల మాస్టర్ ప్లాన్ వెనుక అసలు కథ!
సూర్య ప్రకాష్ జోశ్యుల..
భారత్ మ్యాప్‌లో ఒక చిన్న ముక్క ఉంది… అది కనిపించడానికి చాలా చిన్నది… కానీ మన దేశానికి అది పెద్ద తలనొప్పి! ఆ దారి పొడవు కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే. కానీ, ఆ ఒక్క చిన్న ముక్క గనుక మూసుకుపోతే… భారతదేశంలోని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు (Northeast States) ఒక్కసారిగా ఒంటరిగా మారిపోతాయి. దేశంలోని మిగతా ప్రాంతాలతో వాటికి ఉన్న బంధం తెగిపోతుంది. వ్యూహాత్మకంగా భారత్‌కు ఉన్న ఈ అతిపెద్ద బలహీనతనే సైనిక భాషలో “చికెన్స్ నెక్” (కోడి మెడ) లేదా సిలిగురి కారిడార్ అంటారు.
భారత్‌పై దాడి చేయాలనుకునేవారి దృష్టి ముందుగా కేవలం ఈ 20 కిలోమీటర్ల భూభాగం మీదే వెళ్ళకుండా చూసుకోవాల్సి వస్తోంది. చాలా భద్రతా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. వినడానికి షాకింగ్‌గా అనిపించినా… భారత రక్షణ వ్యూహంలో దశాబ్దాలుగా చర్చ జరుగుతున్న అంశం ఇదే. ఎందుకంటే దేశంలో ఎనిమిది రాష్ట్రాల భవిష్యత్తు… కోట్లాది మంది రవాణా… వందల కోట్ల రూపాయల వాణిజ్యం… ఇవన్నీ ఇప్పటికీ ఒకే ఇరుకైన దారిపై ఆధారపడి ఉన్నాయి. అందుకే… దశాబ్దాలుగా భారత్ దీనికి ఒక ప్రత్యామ్నాయ దారి కోసం వెతుకుతోంది. అయితే ఇన్నాళ్లకు జపాన్ ఆ దారిని చూపిస్తోంది. అంతేకాదు, ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది. జులై 1న జపాన్ కొత్త ప్రధానమంత్రి సనాయ్ తకైచి (Sanae Takaichi) భారత్‌కు రావడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఇదే అంటున్నారు! కోడి మెడంత ఇరుకు దారి… సముద్రం అంత పెద్ద పరిష్కారం!
ఇంతకీ…
జపాన్ ఎందుకు బంగ్లాదేశ్‌లో పోర్టు కడుతోంది?
భారత్‌కు దానివల్ల ఏం లాభం?
చైనా ఎందుకు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది?
ముందు సమస్య ఏంటో చూద్దాం.
భారత్‌లోని అస్సాం, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం…ఈ ఎనిమిది రాష్ట్రాలను మిగతా భారతదేశంతో కలిపేది సిలిగురి కారిడార్ అనే ఇరుకైన భూభాగం మాత్రమే. దీనినే ప్రపంచం “చికెన్ నెక్” అని పిలుస్తుంది. “ఒక్క తలుపే ఉన్న ఇంటిలా”… ఈశాన్య భారతానికి బయట ప్రపంచంతో ఉన్న ప్రధాన దారి ఇదొక్కటే. రోజూ వేల టన్నుల సరుకులు… లక్షలాది మంది ప్రయాణాలు… వాణిజ్యం… అవసరమైతే సైనిక రవాణా… అన్నీ ఇదే దారిలో సాగుతాయి.
1962 యుద్ధం భారత్‌కు ఒక పాఠం నేర్పింది
చైనాతో జరిగిన 1962 యుద్ధం తర్వాత భారత వ్యూహకర్తలకు ఒక విషయం స్పష్టమైంది. “ఒక్క దారిపై ఆధారపడితే… ఒకరోజు అదే బలహీనత అవుతుంది.” అప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ మొదలైంది. ఆ ఆలోచనకే ఇప్పుడు జపాన్ రూపం ఇస్తోంది. ఇదే ఆ మాస్టర్ ప్లాన్… బంగ్లాదేశ్‌లోని మతర్బారి వద్ద జపాన్ అత్యాధునిక డీప్ సీ పోర్టును నిర్మిస్తోంది. దానికి అనుసంధానంగా రోడ్లు… రైల్వే లైన్లు… లాజిస్టిక్స్ నెట్వర్క్… అన్నీ సిద్ధమవుతున్నాయి. ఇది పూర్తయితే… ఇప్పటివరకు…
ఇవి కూడా చదవండి
ఈశాన్య భారత్ → చికెన్ నెక్ → మిగతా భారత్ → పోర్ట్ → ప్రపంచం
ఇకపై…
ఈశాన్య భారత్ → బంగ్లాదేశ్ → మతర్బారి → ప్రపంచం
విశాఖ పోర్ట్ లాగే..
మన ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం పోర్ట్ ఎంత పెద్ద ఆర్థిక బలం ఇచ్చిందో అందరికీ తెలుసు. విశాఖ లేకపోతే ఎగుమతులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగం ఇవాళ ఇలా ఉండేవి కావు. అలాగే… ఈశాన్య భారతానికి కూడా మతర్బారి ఒక “విశాఖలా” మారుతుందా? అదే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
జపాన్‌కు దీనితో వచ్చే లాభం ఏమిటి?
భారతదేశం కోసం జపాన్ బంగ్లాదేశ్‌లో ఎందుకు వేల కోట్లు పెడుతోంది? దీని వెనుక జపాన్‌కు పెద్ద వ్యాపార, వ్యూహాత్మక లాభాలు ఉన్నాయి.
సరికొత్త ఇండస్ట్రియల్ హబ్: జపాన్ కేవలం పోర్ట్ మాత్రమే కట్టడం లేదు, ఈ రూట్ మొత్తాన్ని ఒక పారిశ్రామిక ప్రాంతంగా మార్చాలనుకుంటోంది. జపాన్ కంపెనీలు తయారుచేసే వస్తువులకు ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ కలిపి ఒకేసారి దాదాపు 25 కోట్ల మంది జనాభా ఉన్న భారీ మార్కెట్ దొరుకుతుంది.
రవాణా ఖర్చులు తగ్గడం: ఆసియా ఖండంలో జపాన్ సరుకుల రవాణాకు ఈ పోర్ట్ ఒక పెద్ద జంక్షన్ లా మారుతుంది.
నమ్మకమైన భాగస్వామి: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ లాంటి పెద్ద దేశంతో వ్యూహాత్మక బంధాన్ని గట్టిగా లాక్ చేసుకోవడానికి జపాన్‌కు ఇదొక సువర్ణావకాశం.
చైనా ఎందుకు చూస్తోంది?
ఎక్కడా చైనా పేరు వినిపించడం లేదు. కానీ… “పొగ లేనిదే మంట రాదు” అన్నట్టు ఈ విషయాలని ప్రపంచ విశ్లేషకులు మాత్రం మరో కోణంలో చూస్తున్నారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయంగా భారత్-జపాన్ కలిసి కొత్త కనెక్టివిటీ నెట్వర్క్ నిర్మిస్తున్నాయా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
భారత్‌ను ఒంటరిని చేయలేకపోవడం: యుద్ధం వస్తే ‘చికెన్స్ నెక్’ను నొక్కి భారత్‌ను దెబ్బతీయవచ్చనే చైనా వ్యూహాన్ని ఈ కొత్త సముద్ర మార్గం పూర్తిగా నీరుగారుస్తుంది. ప్రత్యామ్నాయ దారి ఉండటం వల్ల సైనికపరంగా భారత్‌కు తిరుగులేని రక్షణ దొరుకుతుంది.
బే ఆఫ్ బెంగాల్‌పై పట్టు: బంగాళాఖాతంలో చైనా తన ఉనికిని పెంచుకోవాలని చూస్తోంది. కానీ అదే ప్రాంతంలో భారత్, జపాన్, బంగ్లాదేశ్‌లు చేతులు కలపడం చైనాకు మింగుడుపడటం లేదు.
దీనివల్ల మనకు లాభమేంటి?
రవాణా ఖర్చులు తగ్గే అవకాశం.
ఈశాన్య రాష్ట్రాలకు పెట్టుబడులు పెరిగే అవకాశం.
ఎగుమతులు వేగవంతం అయ్యే అవకాశం.
ఒకే కారిడార్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గే అవకాశం.
ఎప్పటికి పూర్తవుతుంది?
జూలై 3న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని సనాయ్ తకైచిల భేటీ ముగిశాక వచ్చే ఉమ్మడి ప్రకటనలో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని కీలక నిర్ణయాలు బయటకు రానున్నాయి. మాతర్బారి పోర్ట్ వివిధ దశల్లో 2027 నుంచి 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
ఏదైమైనా :ఇకపై ‘ఆ బలహీనత’ మన బలం!
ఒక దేశాన్ని భౌతికంగా లొంగతీసుకోవడం కంటే, దాని వాణిజ్య మూలాలను దెబ్బతీయడం ఆధునిక యుద్ధ వ్యూహాల్లో అత్యంత ప్రమాదకరమైనది. దశాబ్దాలుగా మన మ్యాప్‌లో ఉన్న ఆ 20 కిలోమీటర్ల చిన్న దారే మనకు అతిపెద్ద గుండెకోతగా మారుతుందని శత్రుదేశాలు భావించాయి. కానీ, ఇప్పుడు రూట్ మారింది.. వ్యూహం మారింది!
జపాన్ సాయంతో రూపుదిద్దుకుంటున్న ఈ సరికొత్త సముద్ర మార్గం.. కేవలం వ్యాపారానికి సంబంధించినది మాత్రమే కాదు; అది భారతదేశ సార్వభౌమాధికారానికి, రక్షణ వ్యూహానికి లభించిన ఒక వజ్రాయుధం. మాతర్బారి పోర్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే నాటికి, ఈశాన్య భారతం ఒక వెనుకబడిన ప్రాంతంగా కాకుండా.. ఆసియా ఖండానికే ఒక పెద్ద ట్రేడ్ హబ్‌గా మారబోతోంది.
భారత్ మ్యాప్‌లోని ఒక చిన్న ముక్క వల్ల వస్తున్న పెద్ద తలనొప్పిని వదిలించే ఈ “గేమ్ ఛేంజర్” ప్రాజెక్ట్.. ఆసియా ఖండంలోనే కొత్త చరిత్ర సృష్టించబోతోంది!








