సింధూ జలాల ఒప్పందం నేపథ్యమిదీ.. పాక్ కు ఎందుకు నష్టం?
సింధూ జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ విషయంలో యుద్ధానికైనా సిద్ధంగాన వుంటామంటూ ప్రగల్భాలు పలికిన దాయదాది… తాజాగా భారత్ పై తన అక్కసును వెళ్లగక్కింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాక్ కి దక్కాల్సిన వాటాపై కన్నేసే వారి చేతులు నరికేస్తామంటూ పరోక్షంగా భారత్ ను హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు పాక్ మంత్రి ముసాదిక్ మలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘మా నీటిపై ఎవరైనా చేయి వేస్తే ఇ చేతినే నరికేస్తామని ఇప్పటికే ప్రకటించాం. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, గత ఒకటిన్నర రెండేళ్లలో రెండు సార్లు ఆచరణలో చూపించాం కూడా. మిమ్మల్ని మేము కాపాడుకోగలమని రెండు సార్లు నిరూపించాం. అయితే ఎగువన వున్న దేశాలు, దిగువన వున్న దేశాల నీటిని ఆపేసే హక్కును ప్రపంచం వారికి ఇచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
కొన్ని రోజుల క్రిందట పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. భారత్ చర్యలు తమ నీటి సరఫరాకు ముప్పు కలిగిస్తున్నాయని, అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా హెచ్చరించారు పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని అన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజల జీవనాధారం సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని ఆసిఫ్ అన్నారు. ఈ నేపథ్యంలో నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలనూ ఉపయోగిస్తామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆసిఫ్ హెచ్చరించారు.
పహల్గామ్ ఉగ్రవాది తర్వాతే నిర్ణయం…
నిజానికి 1960 లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది.దీనిపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. దీని ప్రకారం రవి, బియాస్, సట్లేజ్ నదులపై భారత్ కి పూర్తి హక్కులు వుండగా, సింధు, జీలం, చీనాబ్ నదుల జలాల్లో ఎక్కువ భాగం పాక్ కి కేటాయించారు.
అయితే.. 2025 ఏప్రిల్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. “ఉగ్రవాదం-చర్చలు కలిసి ప్రయాణం సాగించవు” అని స్పష్టం చేస్తూ, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ‘సస్పెండ్’ చేసింది. సరిహద్దుల అవతల నుంచి ఉగ్రవాదం ఆగిపోయే వరకు నీటి పంపిణీపై ఎలాంటి చర్చలు ఉండవని భారత్ తేల్చిచెప్పింది.
సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే సుక్కూర్ బ్యారేజ్ పరిధిలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోయింది. పాకిస్థాన్‌లోనే అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థల్లో ఒకటైన ఈ బ్యారేజ్‌పై కోట్లాది మంది జీవనాధారం ఆధారపడి ఉంది.
సింధు నదీ వ్యవస్థ పాకిస్థాన్‌కు కేవలం నీటి వనరు మాత్రమే కాదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు ‘లైఫ్ లైన్’.
వ్యవసాయ సంక్షోభం: పాకిస్థాన్‌లోని 90% పైగా పంటలు, ఆహార ఉత్పత్తి (గోధుమలు, వరి, పత్తి) సింధు బేసిన్ మీదే ఆధారపడి ఉన్నాయి. భారత్ నీటిని నిలిపివేస్తే అక్కడ కరువు, ఆకలి చావులు తప్పవు.
జీడీపీ (GDP)పై దెబ్బ: పాక్ ఆర్థిక వ్యవస్థలో 25% వాటా వ్యవసాయానిదే. భారత్ నీటిని కట్టడి చేస్తే ఆ దేశ జీడీపీలో 1.5% నుండి 2% వరకు పడిపోయే అవకాశం ఉంది.
విద్యుత్ అంధకారం: పాక్ హైడ్రోపవర్ విద్యుత్ ఉత్పత్తిలో 60% – 79% సింధు నదిపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా ‘తర్బేలా డ్యామ్’ (4,888+ MW) వంటి ప్రాజెక్టులు నిలిచిపోతే దేశమంతా చీకట్లోకి వెళ్లాల్సిందే.








